ఈసారి అదానీ సతీమణికి రాజ్యసభ సీటు ఇవ్వనున్న జగన్?

Update: 2022-03-03 05:30 GMT
గౌతమ్ అదానీ.. ఈ పేరు గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. అత్యంత తక్కువ వ్యవధిలో తిరుగులేని పారిశ్రామిక శక్తిగా అవతరించిన అదానీ కుటుంబంలో కీలకమైన వ్యక్తి. ఆయన టార్గెట్ చేయాలే కానీ.. జరగని పని అంటూ ఏమీ ఉండదన్న మాట వినిపిస్తూ ఉంటుంది.

అలాంటి గౌతమ్ అదానీ సతీమణికి రాజ్యసభ సీటును కట్టబెట్టేందుకు ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సిద్ధమయ్యారా? అంటే అవునన్న మాట వినిపిస్తోంది. ఆ మధ్యన పారిశ్రామికవేత్త పరిమళ్ నత్వానీకి రాజ్యసభ సీటును కట్టబెట్టటం ద్వారా సంచలనంగా మారిన జగన్ నిర్ణయం.. తాజాగా మరో సంచలనానికి తెర తీయనున్నారా? అంటే అవునన్న మాట వినిపిస్తోంది.

గౌతమ్ అదానీ సతీమణి ప్రీతి అదానీకి రాజ్యసభ సీటును కట్టబెట్టేందుకు వీలుగా సీఎం జగన్ నిర్ణయం తీసుకున్నారా? అన్నది ఇప్పుడు ప్రశ్నగా మారింది. ఆంధ్రప్రదేశ్ నుంచి ఎన్నికైన నలుగురు రాజ్యసభ సభ్యుల పదవీకాలం జూన్ 21తో ముగియనుంది. వైసీపీ నుంచి విజయసాయిరెడ్డి.. బీజేపీ నుంచి సురేష్ ప్రభు. వైవీ చౌదరి.. టీజీ వెంకటేశ్ లు రిటైర్ అవుతారు. ఆ స్థానాలకు త్వరలోనే నోటిఫికేషన్ జారీ కానుంది. ఈ నలుగురిలో ముగ్గురిని అప్పటి చంద్రబాబు ప్రభుత్వం ఎంపిక చేసిన వైనం తెలిసిందే.

2019లో జరిగిన ఎన్నికల్లో టీడీపీ దారుణ ఓటమి అనంతరం.. అదే పార్టీకి చెందిన సుజనా చౌదరి.. టీజీ వెంకటేశ్ లు బీజేపీ తీర్థం పుచ్చుకోవడం తెలిసిందే. తాజాగా గడువు ముగుస్తున్న వేళ.. అసెంబ్లీలో టీడీపీకి ఉన్న బలం నేపథ్యంలో ఆ పార్టీ నుంచి ఎవరూ నామినేట్ అయ్యే అవకాశం లేదు.

అధికార వైసీపీ నుంచే నలుగురు సభ్యుల్నిఎంపిక చేసే వీలుంది. ఈ నేపథ్యంలో ఖాళీ అయ్యే నాలుగు స్థానాలకు ఎవరిని ఎంపిక చేయనున్నారన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం.. ఈ నాలుగు ఖాళీల్లో ఒక స్థానాన్ని మాత్రం గౌతమ్ అదానీ సతీమణి ప్రీతీ అదానీకి ఇస్తారంటున్నారు. ఇప్పటికే గౌతమ్ అదానీ కోరుకున్నంతనే కృష్ణపట్నం, గంగవరం పోర్టులు అప్పగించేశారన్న ఆరోపణ జగన్ ప్రభుత్వం మీద ఉంది.

ఆయన అడిగారనే విశాఖలో లీజుకు ఇవ్వాల్సిన స్థలాన్ని సేల్ డీడ్ చేసేందుకు సైతం రెఢీ అయినట్లుగా చెబుతారు. ఇక.. ఖాళీ అయ్యే నాలుగు స్థానాల్లో ఒకటి గౌతమ్అదానీ కుటుంబానికి పోతే.. మిగిలిన మూడింటిలో సీఎం జగన్ కు అత్యంత సన్నిహితుల్లో ఒకరైన విజయసాయి రెడ్డికి మరోసారి రాజ్యసభ సభ్యుడిగా అవకాశం ఇస్తారని చెబుతున్నారు.

మిగిలిన రెండు స్థానాల కోసం పోటీ తీవ్రంగా ఉందంటున్నారు.ఏపీ ప్రభుత్వ సలహాదారుగా కీ రోల్ ప్లే చేస్తున్న సజ్జల రామచంద్రారెడ్డికి రాజ్యసభకు పంపాలన్న యోచనలో ఉన్నట్లు చెబుతున్నారు. అయితే.. సీఎంకు అత్యంత సన్నిహితుడు.. టీటీడీ ఛైర్మన్ గా వ్యవహరిస్తున్న వైవీ సుబ్బారెడ్డి సైతం రాజ్యసభ సీటును కోరుకుంటున్నట్లు చెబుతున్నారు.

మరోవైపు మంతి బొత్స సత్యనారాయణ.. సినీ నటుడు ఆలీ తదితరులు పోటీ పడుతున్నారు. సినీ నటుడు ఆలీ విషయానికి వస్తే.. త్వరలోనే ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి ప్రకటన వస్తుందని చెప్పారే కానీ.. అదేం పదవి అన్నదానిపై క్లారిటీ లేదు.

ఆ మధ్యలో ఆయనకు ఏపీ మైనార్టీ ఛైర్మన్ గా ఎంపిక చేస్తారన్న మాట వినిపించినా.. దానికి సంబంధించిన అధికారిక ప్రకటన ఏదీ వెలువడలేదు. మొత్తంగా నాలుగు రాజ్యసభ సీట్లను కేటాయించే విషయంలో సీఎం జగన్ తీసుకునే నిర్ణయం చర్చగా మారుతుందన్న మాట వినిపిస్తోంది. మరేం జరుగుతుందో చూడాలి.
Tags:    

Similar News