మోహన్ బాబుకు జగన్ భారీ గిఫ్ట్!?

Update: 2019-05-30 05:24 GMT
ఏపీలోనే అతిపెద్ద నామినేటెడ్ పదవిని వైఎస్ జగన్.. తనకు ఎన్నికల్లో సహకరించిన నటుడు మోహన్ బాబుకు ఇవ్వనున్నారా.? ఆ దేవదేవుడి కొలిచే అదృష్టం మోహన్ బాబునే వరించనుందా.? తిరుపతి కేంద్రంగా విద్యాసంస్థలు నడుపుతున్న మోహన్ బాబు మొన్నటి ఎన్నికల వేళ వైసీపీకి మద్దతుగా ప్రచారం చేసినందుకు కృతజ్ఞతగా జగన్ భారీ బహుమతిని ఇవ్వబోతున్నట్టు సమాచారం.

తిరుమల వేంకటేశ్వర స్వామి కొలువై ఉన్న క్షేత్రం దేశంలోనే అత్యంత పురాతనమైనది.. భక్తి ప్రవత్తులతో నిండింది. ఈ టీటీడీ చైర్మన్ పదవి అంటే చాలా పెద్దది. పైగా ఆ దేవదేవుడి సేవలో తరించవచ్చు. ఏపీలోనే ప్రతీ నాయకుడు కోరుకునే పదవి ఇదీ.. మరి అధికారంలోకి వచ్చిన వైసీపీ అధినేత జగన్ ఇప్పుడు టీటీడీ చైర్మన్ పదవిని ఎవరికి ఇస్తున్నారనే చర్చ ఆ పార్టీలో సాగుతోంది.

ప్రస్తుతం టీటీడీ చైర్మన్ గా పుట్టా సుధాకర్ ఉన్నారు. ఈయనను గత టీడీపీ ప్రభుత్వ హయాంలో చంద్రబాబు నామినేట్ చేశారు. ఇప్పుడు అధికారం మారినా ఆయన తన పదవికి రాజీనామా చేయనంటున్నాడు. తొలగించే వరకూ ఉంటానంటున్నాడు. ఇక వైసీపీ గద్దెనెక్కాక ఎలాగూ జగన్ ఆ నామినేటెడ్ పదవులను రద్దు చేయడం ఖాయం.. దీంతో ఆ పదవిలో ఇప్పుడు వైసీపీలో ప్రధానంగా వినిపిస్తున్న పేర్లు మూడు.

అందులో మొదటగా తనకు ఎన్నికల్లో సహకరించి టీడీపీ అధినేత చంద్రబాబును ఇరుకునపెట్టిన మోహన్ బాబుకు కృతజ్ఞతగా టీటీడీ చైర్మన్ పదవిని ఇవ్వాలని జగన్ డిసైడ్ అయ్యారట.. ఇక ఆయన కాకపోతే 2014లో గెలిచి 2019లో ఒంగోలు పార్లమెంట్ సీటును త్యాగం చేసిన వైవీ సుబ్బారెడ్డి టీటీడీ చైర్మన్ రేసులో ముందున్నట్టు సమాచారం. వీరిద్దరూ కాదంటే రాజంపేట మాజీ ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డి పేర్లు వినిపిస్తున్నాయి. 2019లో కూడా జగన్ ఆదేశంతో రాజంపేట సీటును టీడీపీ నుంచి వచ్చిన మల్లికార్జున్ రెడ్డికి త్యాగం చేశారు అమర్నాథ్ రెడ్డి. దీంతో వారిద్దరూ కాదంటే ఈయనకే జగన్ ఇచ్చే చాన్స్ ఉంది.

ఇక తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి పేరు కూడా వినిపిస్తోంది. ఆయన వైఎస్ హయాంలో కూడా టీటీడీ చైర్మన్ గా ఉన్నారు. మరి వీరిలో జగన్ ఎవరి వైపు మొగ్గు చూపుతారనేది ఆసక్తిగా మారింది.


Tags:    

Similar News