ఎంపీల‌తో జ‌గ‌న్ కీల‌క‌భేటీ..వ్యూహం ఖ‌రారుకేనా?

Update: 2018-03-26 06:38 GMT
ఎంపీల‌తో కీల‌క భేటీకి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి సిద్ధ‌మ‌వుతున్నారు. విభ‌జ‌న నేప‌థ్యంలో సార్వ‌త్రిక ఎన్నిక‌లు ముగిసిన నాటి నుంచి ఏపీ  ప్ర‌త్యేక హోదా కోసం ఇప్ప‌టికే ప‌లుమార్లు గ‌ళం విప్పిన జ‌గ‌న్‌.. నిర‌స‌న కార్య‌క్ర‌మాల్ని.. ఆందోళ‌న‌ల్ని నిర్వ‌హించారు.

నాలుగేళ్లుగా ప్ర‌త్యేక హోదా అంశం లైవ్ లో స‌జీవంగా ఉంచ‌టంతో పాటు.. ఏపీ అధికార‌ప‌క్షం హోదాను నీరుకార్చే ప్ర‌య‌త్నం చేసినా.. వాటిని ధైర్యంగా ఎదుర్కొనే ప్ర‌య‌త్నం చేసింది. ఇదిలా ఉండ‌గా.. ఇటీవ‌ల చోటు చేసుకున్న రాజ‌కీయ ప‌రిణామాల నేప‌థ్యంలో ఏపీ హోదా అంశం తెర‌పైకి రావ‌ట‌మే కాదు.. నిన్న‌టి వ‌ర‌కూ ప్ర‌త్యేక ప్యాకేజీకి జై కొట్టిన ఏపీ అధికార‌ప‌క్షం ఇప్పుడు హోదా త‌ప్పించి మ‌రింకేమీ వ‌ద్ద‌ని చెబుతోంది.

ఇదిలా ఉంటే.. హోదా సాధ‌న కోసం మోడీ స‌ర్కారుపై లోక్ స‌భ‌లో అవిశ్వాస తీర్మానాన్ని ప్ర‌వేశ పెట్టింది కూడా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీనే. అయితే.. దీనిపై ఇప్ప‌టికే పిల్లిమొగ్గ‌లు వేసిన టీడీపీ..వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీతో పాటు అవిశ్వాస తీర్మానాన్ని నిత్యం ఇస్తూనే ఉంది.

అయితే.. అన్నాడీఎంకే.. టీఆర్ ఎస్ ఎంపీలు చేస్తున్న ఆందోళ‌న‌ల‌తో గ‌డిచిన ఆరు ద‌ఫాలుగా అవిశ్వాస తీర్మానంపై చ‌ర్చ‌కు రాని ప‌రిస్థితి నెల‌కొంది. ఇలాంటి వేళ కాంగ్రెస్ పార్టీ అనూహ్యంగా రంగంలోకి దిగింది. తాను సైతం అవిశ్వాస తీర్మానాన్ని స్పీక‌ర్ కు అంద‌జేసింది. దీంతో.. మంగ‌ళ‌వారం జ‌రిగే లోక్ స‌భ‌లో ఈ అంశంపై చ‌ర్చ జ‌రిగే అవ‌కాశం ఉంద‌న్న మాట వినిపిస్తోంది.  దీంతో.. హోదాపై రాజ‌కీయం మ‌రింత వేడెక్కింది. ఇదిలా ఉండ‌గా.. లోక్ స‌భ‌లో  మంగ‌ళ‌వారం అనుస‌రించాల్సిన విధానంపై త‌న ఎంపీల‌తో కీల‌క భేటీని నిర్వ‌హిస్తున్నారు జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి.

పాద‌యాత్ర‌లో భాగంగా ప్ర‌స్తుతం గుంటూరు జిల్లా స‌త్తెన‌ప‌ల్లి అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గ ప‌రిధిలోని ముప్పాళ్ల గ్రామంలో భేటీ సాగనుంది. అవిశ్వాస తీర్మానంపై చ‌ర్చ సంద‌ర్భంగా అనుస‌రించాల్సిన వ్యూహాన్ని ఖ‌రారు చేయ‌టంతో పాటు.. అవిశ్వాసంతో క‌లిసి వ‌చ్చే పార్టీల్ని క‌లుపుకుపోయే అంశంపైనా చ‌ర్చించ‌నున్నారు. అవిశ్వాస తీర్మానం సంద‌ర్భంగా  స‌భ‌లో చేయాల్సిన ప్ర‌సంగాల‌పైనా జ‌గ‌న్ వ్యూహాన్ని సిద్ధం చేయ‌నున్నార‌ని చెబుతున్నారు.
Tags:    

Similar News