గుంటూరులో జరిగిన వైసీపీ ప్లీనరీ సందర్భంగా ఆ పార్టీ అధ్యక్షుడు జగన్ ఇచ్చిన నవ రత్నాల్లాంటి హామీలతో టీడీపీ వెన్నలో వణుకు పుట్టిన సంగతి తెలిసిందే. రాష్ట్రంలో ప్రతి నోట ఆ తొమ్మిది హామీల గురించే చర్చ జరగడంతో అధికార పక్షం డిఫెన్స్ లో పడింది. అదే ఎటాకింగ్ స్పీడ్ తో ఆ హామీలకు సంబంధించి జగన్ బుధవారం చేసిన ట్వీట్ ఆసక్తికరంగా మారింది.
మీ కోసం నా తొమ్మిది వాగ్దానాలు..... ‘అన్న వస్తున్నాడు - నవరత్నాలు తెస్తున్నాడు’ అని ఊరూ వాడ చాటి చెప్పాలని ఆయన ట్వీట్ చేశారు. ప్లీనరీలో మాట్లాడిన వీడియోను జగన్ ట్విట్ చేశారు. తాజాగా, జగన్ ట్వీట్ కు సోషల్ మీడియాలో విపరీతమైన స్పందన వస్తోంది. రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజల సంక్షేమం కోసం, అధికారంలోకి వచ్చాక తొమ్మిది పథకాలను అమలుచేయనున్నట్లు ప్లీనరీలో ప్రకటించిన విషయం తెలిసిందే.
డ్వాక్రా మహిళలకు 'వైఎస్ ఆర్ ఆసరా - రైతులకు వైఎస్ ఆర్ భరోసావృద్ధులకు రూ. 2వేల పెన్షన్ - కొత్తగా 25 లక్షల ఇళ్ల నిర్మాణం - చదువుల కోసం అమ్మ ఒడి పథకం - ఆరోగ్యశ్రీకి అవసరమైన నిధుల కేటాయింపు, సాగునీరు కోసం జలయజ్ఞం, మద్యనిషేధం.. ఇలా నవరత్నాల్లాంటి పథకాలతో అందరి జీవితాల్లో వెలుగులు నింపుతానని ఆయన భరోసా ఇచ్చారు. 'అన్న వస్తున్నాడు.. మంచిరోజులు వస్తున్నాయ్' అన్న సందేశంతో ఈ 9 పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని ఆయన కార్యకర్తలకు సూచించారు.