మీడియాతో జగన్ యుద్ధమా?

Update: 2021-08-26 10:30 GMT
‘ప్రభుత్వ అధికారులు అప్రమత్తంగా ఉండాలి.. ముఖ్యంగా కలెక్టర్లు, పోలీసు అధికారులు కొన్ని సంఘటనలపై సున్నితంగా వ్యవహరించాలి.. స్వప్రయోజనాల కోసం కొన్ని మీడియాల సంస్థలు చేస్తున్న ఆగడాలను అరికట్టే విధంగా మనం యుద్ధం చేస్తున్నాం.. అయినా ప్రభుత్వంపై బురద జల్లుతూ అసత్య ప్రచారం చేస్తున్నారు.. వారికి సంబంధించిన వ్యక్తి కూడా సీఎం సీట్లో కూర్చున్నా.. ఇలాగే వ్యవహరిస్తారు.. వీరి పట్ల జాగ్రత్తగా ఉండకుంటే ప్రమాదంలో పడుతాం..’ ఇవి ఏపీ సీఎం జగన్ చేసిన వ్యాఖ్యలు. తమ ప్రభుత్వంపై ఓ వర్గం మీడియా పనిగట్టుకొని అబద్దపు ప్రచారాన్ని చేస్తోందని, మేం రాజకీయాలతో కాకుండా ఇలాంటి వాటితో యుద్ధం చేయాల్సి వస్తోందని ఆరోపించారు.

రాష్ట్రంలో గత కొన్ని నెలలుగా జరుగుతున్న దురదృష్ట సంఘటనలపై సీఎం వీడియో కాన్పరెన్స్ నిర్వహించారు. ఈ సమావేశంలో సీఎం ప్రధానంగా ఓ వర్గం మీడియాపై ఫైర్ అయ్యారు. ఓ మూడు మీడియా సంస్థలు పనిగట్టుకొని ప్రభుత్వంపై బురదజల్లుతోందని అన్నారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ ‘ఇటీవల ఓ అమ్మాయి ఈవ్ టీజింగ్ కేసులో ఓ కానిస్టేబుల్ సస్పెండ్ అయ్యాడు. ఆ కేసులో అమ్మాయి కుటుంబం మాట్లాడిన తీరును సోషల్ మీడియాలో ప్రచారం చేశారు. అలా చేయడం వల్ల ఆ కుటుంబం గౌరవం మంటగలిపేలా ఉంది. దానిని కొన్ని మీడియా సంస్థలు రాజకీయం చేస్తున్నారు’ అని అన్నారు.

‘ఓ వర్గం మీడియా సంస్థలకు సొంత ప్రయోజనాలు తప్ప ప్రజా ప్రయోజనాల గురించి ఆలోచించరు. ఇలా చేయడం వల్ల రాను రాను సామాన్యులు బలయ్యే అవకాశం ఉంది. వాళ్లకు సంబంధించిన వ్యక్తిని కూడా సీఎం సీట్లో కూర్చొబెట్టినా బురదజల్లే ప్రయత్నం చేస్తారు. ఇందులో మీకు కూడా మినహాయింపు ఉండదు. అందువల్ల ఈ మీడియా సంస్థల ద్వారా చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి’ అని కలెక్టర్లు, ఎస్పీలకు సూచించారు. చిన్న సంఘటన జరిగినా ఏమాత్రం నిర్లక్ష్యం చేయకూడదు. మీ నిర్లక్ష్యాన్ని ఆసరాగా చేసుకొని వక్రీకరణ చేస్తారు. అందువల్ల వక్రీకరణకు ఏమాత్రం అవకాశం ఇవ్వకూడదు.

ప్రజల కోసం ప్రభుత్వం ఎంత మంచి పనిచేస్తుందన్న విషయం ఆ మీడియా సంస్థలకు అవసరం లేదు. మనం ఎంత మంచి పని చేసినా దానిని చెడ్డగాచూపించడం వారికి అలవాటు. అయితే ఇదంతా వారి స్వార్థ ప్రయోజనాలకోసమేనన్న విషయం అర్థం చేసుకోవాలి. ప్రభుత్వంలో పనిచేసేవారు కేవలం ప్రజా ప్రయోజనాలు మాత్రమే ఆలోచించాలి. ఒకటి, రెండు మీడియా సంస్థలు చెప్పేవన్నీ పట్టించుకోవద్దు. ప్రతీ విషయాన్ని లోతుగా పరిశీలంచారు. ఒకవేళ ఎలాంటి ఆరోపణలు వచ్చినా వాటిని లోతుగా పరిశీలించారు. ఆ మీడియా చెప్పినట్లు వెళ్లకూడదు. వారి ట్రాప్లో పడితే ప్రమాదంలో చిక్కుకుంటారు.

ప్రతిపక్ష పార్టీలతో మనకు బెడద లేదు. ఇప్పుడు మనం రాజకీయ పార్టీలో యుద్ధం చేయడం లేదు. ఆ మీడియా సంస్థలతో పోరాడుతున్నాం. ఈ పోరాటంలో అప్రమత్తంగా ఉండకపోతే ట్రాప్లో పడిపోతాం. ప్రతీ విషయంలో అప్రమత్తతే మనల్సి కాపాడుతుండి. సామాన్యులు, మధ్య తరగతి ప్రజలను ఈ మీడియా తప్పుదారి పట్టిస్తోంది,వారితో చేయకూడని పనులు చేయిస్తోంది. దీంతో కొందరు అవగాహన లేనివారు తమ జీవితాలను చిక్కుల్లో పడేస్తున్నారు. అయితే వారికి అర్థం చేసే విధంగ మనం నడుచుకోవాలి. వారికి నిజనిర్దారణ చేసి అసలు విషయం తెలపాలి.

సామాన్యులను అడ్డం పెట్టుకొనే వారు ఆడే గేమ్లో అమాయకులు బలి కాకుండా కాపాడుకోవాలి. ప్రభుత్వంపై వారికి నమ్మకం కలిగించాలి. ఇందుకోసం ఉన్నత స్థాయి అధికారులు పర్యవేక్షణ తప్పనిసరిగా ఉండాలి. మొత్తంగా ఆ మూడు మీడియా సంస్థల పట్ల అప్రమత్తంగా ఉండాలి... అని సీఎం జగన్ అధికారులకు దిశా నిర్దేశం చేశారు


Tags:    

Similar News