పులివెందులను వదిలేస్తున్నారా... ?

Update: 2021-11-08 09:33 GMT
పులివెందుల. ఈ పేరు వినగానే ఏపీ రాజకీయాల మీద అవగాహన ఉన్న వారికి వైఎస్సార్ ఫ్యామిలీయే ఫస్ట్ గుర్తుకు వచ్చేది వైఎస్సార్ 1978 ఎన్నికల్లో ఫస్ట్ టైమ్ పులివెందుల శాసన సభకు రెడ్డి కాంగ్రెస్ తరఫున పోటీ చేశారు. ఆయన తొలిసారి రంగంలోకి దిగినా మంచి మెజారిటీతో విజయం సాధించారు. అది లగాయితూ పులివెందులలో వైఎస్సార్ కుటుంబం ఎత్తిన జెండా ఈ రోజు దాకా దించలేదు. మధ్యలో ఎన్టీయార్ టీడీపీని స్థాపించి అన్ని సీట్లు కైవశం చేసుకున్నా కూడా పులివెందుల మాత్రం వైఎస్సార్ నుంచి వీడిపోలేదు, ఓడిపోలేదు. వైఎస్సార్ కుటుంబం నుంచి వైఎస్ వివేకానందరెడ్డి, వైఎస్ పురుషోత్తం రెడ్డి, వైఎస్ విజయమ్మ, వైఎస్ జగన్ ఇలా చాలా మంది ఎమ్మెల్యేలుగా పులివెందుల నుంచి నెగ్గారు. ప్రస్తుతం వైఎస్సార్ తనయుడు జగన్ రెండు పర్యాయాలుగా ఎమ్మెల్యేగా ఉంటున్నారు. 2019 ఎన్నికల్లో ఆయన తొంబై వేల పై చిలుకు మెజారిటీ సాధించి రికార్డు నెలకొల్పారు.

అలా పులివెందుల వైఎస్సార్ ఫ్యామిలీకి విజయాల లోగిలిగా మారిన నేపధ్యంలో జగన్ మరిన్ని సార్లు అక్కడ నుంచే సునాయాసంగా గెలవవచ్చు. కానీ 2024 ఎన్నికల్లో జగన్ పులివెందుల నుంచి పోటీ చేస్తారా లేదా అన్న చర్చ అయితే అధికార పార్టీలో మొదలైపోయిందిట. అంతే కాదు, కడప జిల్లాలోనూ దీని మీద ఆసక్తికరమైన చర్చ సాగుతోంది. జగన్ వచ్చే ఎన్నికల్లో పులివెందుల నుంచి పోటీ చేయకుండా ఉత్తరాంధ్రా జిల్లాలోని ఒక కీలక నియోజకవర్గం నుంచి పోటీ చేస్తారు అంటున్నారు. ఉత్తరాంధ్రా సెంటిమెంట్ తో పాటు, తాను ఆ అక్కడ నుంచే పనిచేస్తాను అన్న గట్టి సందేశం ఇచ్చేందుకే జగన్ అక్కడ ఒక‌ సీటును ఎంచుకుని మరీ బరిలోకి దిగుతారు అంటున్నారు.

అదే నిజమైతే పులివెందులలో ఎవరు పోటీ చేస్తారు అన్నదే ప్రశ్న. దానికి జవాబు అని కాదు కానీ రకరకాలైన ప్రచారాలు మాత్రం జోరుగా సాగుతున్నాయి. అందులో ఒకటి ఏంటి అంటే జగన్ సతీమణి వైఎస్ భారతి ఈసారి పులివెందుల నుంచి పోటీ చేస్తారు అని. జగన్ పులివెందుల వదిలిపెడితే సతీమణి అక్కడ ఎమ్మెల్యేగా ఉంటూ బాధ్యతలు చూస్తుంది అంటున్నారు. ఒక విధంగా ఇది ఇంటెరెస్టింగ్ మ్యాటర్ గానే చూడాలి. జగన్ రాజకీయ జీవితంలో భారతిది ఇప్పటిదాకా తెర వెనక పాత్ర. అయితే ఆమె కూడా రాజకీయాల మీద మంచి అవగాహనతో ఉన్నారని అంటున్నారు. దాంతో వచ్చే ఎన్నికల్లో ఆమెను ఎమ్మెల్యేగా పోటీకి దించి ప్రత్యక్ష రాజకీయాల్లోకి తీసుకువచ్చే ఆలోచన అయితే జగన్ కి ఉంది అంటున్నారు. ఆ విధంగా వైసీపీలో తన తరువాత స్థానం నంబర్ టూ గా ఆమెను ఉంచాలను ఆయన భావిస్తున్నారు అన్నదే ప్రచారం. అదే కనుక నిజం అయితే మాత్రం అటు పులివెందులతో పాటు ఇటు ఉత్తరాంధ్రా రాజకీయాలు కూడా వేరే లెవెల్ లో ఉండడం ఖాయం.




Tags:    

Similar News