విశాఖ వాసినే అంటున్న జగన్

Update: 2023-04-19 14:00 GMT
జగన్ విశాఖ రాజధాని మీద సంచలన ప్రకటన చేశారు. ఉత్తరాంధ్రా పర్యటనలో ఉన్న సీఎం శ్రీకాకుళం జిల్లాలోని మూలపేట గ్రీన్ ఫీల్డ్ పోర్టుకు ఈ రోజు శంకుస్థాపన చేశారు. అదే విధంగా నౌపడా వద్ద పోర్టు నిర్వాసితుల కాలనీకి, ఎచ్చెర్ల వద్ద ఫిషింగ్ హార్బర్ కి, హీరమండలం వద్ద  లిఫ్ట్ ఇరిగేషన్ స్కీం కి జగన్ శంకుస్థాపన చేశారు.

ఈ సందర్భంగా ఆయన విశాఖ రాజధాని మీద కీలక ప్రకటన చేశారు. ఏపీలో అతి పెద్ద నగరం అందరికీ అన్ని విధాలుగానూ మెచ్చే నచ్చే నగరం కావడం వల్లనే విశాఖను రాజధానిగా ఎంపిక  చేసుకున్నామని తెలిపారు. ఈ ఏడాది సెప్టెంబర్ నుంచి తాను విశాఖలోనే స్థిరపడతాను అని జగన్ స్పష్టంగా చెప్పేశారు.

తాను విశాఖ నుంచే పాలన చేస్తానని ఆయన తెలియచేశారు. వికేంద్రీకరణలో భాగంగానే విశాఖలోనే పరిపాలనా రాజధాని వస్తుందని జగన్ వివరించారు. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల ప్రజలు ఆమోదించే సిటీ విశాఖ అని ఆయన అంటున్నారు. తాను విశాఖలో ఉంటూ పాలన చేయడం ద్వారా వెనకబడిన ప్రాంతాలకు మరింత మేలు చేకూరుతుందని జగన్ తెలిపారు.

ఉత్తరాంధ్రాను ప్రత్యేకించి శ్రీకాకుళం జిల్లాను గత పాలకులు పూర్తిగా నిర్లక్ష్యం చేశారని జగన్ విమర్శిచారు. తాను మాత్రం అభివృద్ధి అంటే ఏంటో చూపిస్తున్నానని ఆయన అంటున్నారు. ప్రస్తుతం ఏపీలో పెద్దలకు పేదలకు మధ్య యుద్ధం సాగుతోందని, పెత్తందారీలతో తాను చేస్తున్న పోరాటంలో పేదలంతా అండగా నిలవాలని ఆయన కోరారు.

తాను చేసిన మంచిని చూసి తనను ఆశీర్వదించాలని జగన్ కోరారు. తాను ప్రతీ ఇంటీకీ మేలు చేశానని, తమ పధకాలు అందరికీ చేరాయని జగన్ గట్టిగా చెప్పారు. తాను అనుకున్న దాన్ని చేసి చూపించానని ఇక ప్రజలు అండగా ఉండడమే వారి వంతు అని ఆయన అంటున్నారు.

ఇక ప్రతిపక్షాల మీద జగన్ పరోక్షంగా విమర్శలు చేశారు. అందరూ ఏకమయ్యారని ఆయన నిందించారు. ఒక అబద్ధాన్ని పదే పదే చెప్పడం ద్వారా నిజం చేసే కిటిల కుట్రకు తెర తీశారని ఇవన్నె ప్రజలు గమనించాలని ఆయన అన్నారు. ప్రస్తుతం ఏపీలో సాగుతున్న రాజకీయ పరిణామాల నేపధ్యంలోనే ముఖ్యమంత్రి ఈ ప్రకటనలు చేశారని భావిస్తున్నారు.

Similar News