ప్ర‌త్య‌ర్థుల‌పై క‌త్తికి.. వీరతాడు వేసిన మోడీ!

Update: 2022-07-17 11:30 GMT
తాజాగా కేంద్రంలోని న‌రేంద్ర మోడీ స‌ర్కారు, ఎన్డీయే కూట‌మి ఉప‌రాష్ట్ర‌ప‌తి అభ్య‌ర్థిగా జ‌గ‌దీప్ ధ‌న‌క‌ర్‌ను ఎంపిక చేసింది. ఆయ‌న గెలుపు కూడా లాంఛ‌న‌మే. అయితే.. ఏ అర్హ‌త‌తో ఆయ‌న‌ను ఎంపిక చేశార‌నేది ఇప్పుడు దేశ‌వ్యాప్తంగా జ‌రుగుతున్న కీల‌క చ‌ర్చ‌. ఇప్ప‌టి వ‌ర‌కు లేని పేరు.. అస‌లు ఊసులో కూడా లేని ధ‌న‌క‌ర్‌ను అనూహ్యంగా ఎంపిక చేశారా?  లేక ఒక ``కీల‌క సంకేతాన్ని`` ఇచ్చే ఉద్దేశంతోనే ఎంపిక చేశారా? అనేది చ‌ర్చ‌కు వ‌చ్చిన అంశం. ఎందుకంటే.. ప్ర‌స్తుతం ప‌శ్చిమ బెంగాల్ గ‌వ‌ర్న‌ర్‌గా ఉన్న ధ‌న‌క‌ర్‌.. నిత్యం వివాదాలు.. అక్క‌డి మ‌మ‌త ప్ర‌భుత్వంతో విభేదాల‌తోనే కాలం గ‌డిపారు. అదే ఆయ‌న‌కు ఈ ప్ర‌మోష‌న్ ఇచ్చిందా? అనే సందేహాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి.

ఇంత‌కీ ఈయ‌న ఎవ‌రు?

జగ్దీప్‌ ధన్‌కర్‌ రాజస్థాన్‌లోని.... ఒక రైతు కుటుంబంలో 1951లో జన్మించారు. రాజకీయాల్లోకి రాకముందు వ్యవసాయం చేశారు. ఆయన కిసాన్‌పుత్ర అనే గుర్తింపు తెచ్చుకున్నారు. చిత్తోడ్‌గఢ్‌ సైనిక స్కూల్‌లో ప్రాథమిక విద్యాభ్యాసం పూర్తి చేసిన ఆయన భౌతికశాస్త్రంలో డిగ్రీ పూర్తి చేశారు. అనంతరం రాజస్థాన్‌ విశ్వవిద్యాలయం నుంచి న్యాయవిద్యను అభ్యసించారు. ప్రముఖ న్యాయవాదిగా గుర్తింపు పొందిన జ‌గ్దీప్‌.. రాజస్థాన్‌ హైకోర్టు, సుప్రీంకోర్టులోనూ ప్రాక్టీస్‌ చేశారు. రాజస్థాన్‌ హైకోర్టు బార్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడుగా కూడా పని చేశారు.

ఆద్యంతం రాజకీయ‌మే!

జనతాదళ్‌ నుంచి తన రాజకీయ ప్రస్థానాన్ని ధ‌న‌క‌ర్‌ ప్రారంభించారు. 30 ఏళ్ల నుంచి ప్రజా జీవితంలో కొనసాగుతున్నారు. 1989లో ఝుంఝునూ నుంచి ఆ పార్టీ తరపున లోక్‌సభకు ఎన్నికయ్యారు. 1990లో పార్లమెంట్‌ వ్యవహారాల సహాయశాఖ మంత్రిగా ఆయన పనిచేశారు. 1993లో రాజస్థాన్‌లోని కిషన్‌గడ్‌ నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. అయితే.. ఆయ‌న ఎప్పుడూ వివాదాల‌కు కేంద్రంగానే ఉన్నార‌నేది రాజ‌కీయ వ‌ర్గాల మాట‌. త‌న‌వారికి మేలు చేయ‌డంలో ఆయ‌న అందెవేసిన చేయిగా పేరు తెచ్చుకున్నార‌ని అంటారు.

కేంద్రం క‌నుస‌న్న‌ల్లో..

2019 జులై నుంచి బంగాల్‌ గవర్నర్‌గా పని చేస్తున్నారు. అయితే.. ఆయ‌న ప్ర‌తి విష‌యంలోనూ కేంద్రంలోని మోడీ స‌ర్కారు క‌నుస‌న్న‌ల్లోనే మెలిగార‌నేది నిర్వివాదాంశం. మ‌మ‌తా బెన‌ర్జీ ప్రభుత్వ నిర్ణయాలపై గవర్నర్‌గా అనేక సందర్భాల్లో.. జగ్దీప్‌ తీవ్రంగా విభేదించారు. మమతా సర్కార్ తీరును ఎన్నోసార్లు బహిరంగంగానే విమర్శించారు. ఈ క్ర‌మంలో కేంద్రంలోని బీజేపీకి.. ఏకంగా ప్ర‌భుత్వాన్ని ర‌ద్దు చేయాల‌ని కూడా గ‌త ఎన్నిక‌ల‌కు ముందు ఆయ‌న సిఫార్సు చేయ‌డం దేశంలోనే క‌ల‌క‌లం రేపింది. ముఖ్యంగా శార‌దా చిట్‌ఫండ్ కుంభ‌కోణానికి సంబంధించి ఏకంగా.. డీజీ స్థాయి పోలీసు విష‌యంలోనూ గ‌వ‌ర్న‌ర్ వ్య‌వ‌హ‌రించిన తీరు వివాదంగా మారింది. ఈ క్ర‌మంలోనే మోడీ నిర్ణ‌యం ఆస‌క్తిగా మారింది. త‌మ‌కు అనుకూలంగా ఉంటూ.. త‌మ ప్ర‌త్య‌ర్థుల‌పై క‌త్తిక‌ట్టేవారికి వీర‌తాడు వేస్తామ‌నే సంకేతాలు ఆయ‌న పంపుతున్నారా? అని విశ్లేష‌కులు ప్ర‌శ్నిస్తున్నారు.
Tags:    

Similar News