ఫండ్స్ ప్ర‌స్తావ‌న వెనుక ప‌వ‌న్ వ్యూహం అదేనా?

Update: 2018-12-17 08:03 GMT
పార్టీ ఫండ్స్ గురించి జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్ అమెరికా ప‌ర్య‌ట‌న‌లో చేసిన వ్యాఖ్య‌లు స‌ర్వ‌త్రా చ‌ర్చ‌నీయాంశ‌మ‌వుతున్నాయి. ఎవ‌రూ ప్ర‌శ్నించ‌న‌ప్ప‌టికీ.. క‌నీసం మాట మాత్ర‌మైనా ఎత్త‌న‌ప్ప‌టికీ ఆయ‌న ఫండ్స్ విష‌యంపై ఎందుకు మాట్లాడార‌ని అంతా చ‌ర్చించుకుంటున్నారు. అత్యుత్సాహంతో ప‌వ‌న్ అన‌వ‌స‌రంగా ప‌వ‌న్ నోరు జారారని ప‌లువురు అభిప్రాయ‌ప‌డుతున్నారు. గుమ్మ‌డి కాయ‌ల దొంగ‌లు అంటే భుజాలు స‌ర్దుకున్న‌ట్లుగా ఆయ‌న తీరు ఉందంటూ ఎద్దేవా చేస్తున్నారు.

అమెరికా ప‌ర్య‌ట‌న‌కు వెళ్లిన ప‌వ‌న్ తాజాగా డ‌ల్లాస్ లో జ‌రిగ‌న ఓ కార్య‌క్ర‌మంలో కాస్త విచిత్రంగా మాట్లాడారు. ఎవ‌రూ ప్ర‌శ్నించ‌న‌ప్ప‌టికీ ఫండ్స్ ప్ర‌స్తావ‌న తీసుకొచ్చారు. విరాళాలు-నిధులు వ‌సూలు చేసేందుకు తాను అమెరికాకు రాలేద‌న్నారు. డ‌బ్బులు వ‌సూలు చేయాల‌ని తానెప్పుడూ ఎవ‌రితోనూ చెప్ప‌లేద‌న్నారు. అలాంటిదేదైనా ఉంటే అఫీషియ‌ల్ గా ప్ర‌క‌టిస్తాన‌ని చెప్పారు. పార్టీకి డ‌బ్బులు ఎందుకంటూ త‌న‌ను చాలా మంది ప్ర‌శ్నిస్తుంటార‌ని ప‌వ‌న్ తెలిపారు. కానీ - తాను ఎక్క‌డికైనా వెళ్లి ప్ర‌సంగించాలంటే తానొక్క‌డినే వెళ్ల‌ను క‌దా అని సూచించారు. అక్క‌డికి 400 మంది వ‌స్తార‌ని.. 40 కార్లు అవ‌స‌ర‌మ‌వుతాయ‌ని పేర్కొన్నారు.

ప‌వ‌న్ వ్యాఖ్య‌ల‌పై ప‌లువురు ఆశ్చ‌ర్యం వ్య‌క్తం చేస్తున్నారు. ఫండ్స్ విష‌యంపై అక్క‌డ మాట్లాడాల్సిన అవ‌స‌ర‌మేంట‌ని ప్ర‌శ్నిస్తున్నారు. పార్టీని న‌డిపించేందుకు స‌రైన మూల‌ధ‌నం లేక ఆయ‌న ఇబ్బంది ప‌డుతుండొచ్చ‌ని పేర్కొన్నారు. అందుకే అభ‌ద్ర‌తా భావంతో అచేత‌నంగా అసంద‌ర్బ వ్యాఖ్య‌లు చేస్తున్నార‌ని అనుమానం వ్యక్తం చేశారు.

ఏపీలో ఎన్నిక‌లు స‌మీపిస్తున్న నేప‌థ్యంలో ప్ర‌చార ప‌ర్వం, ఇత‌ర వ్య‌వ‌హారాల‌కు డ‌బ్బు చాలా అవ‌స‌ర‌మ‌వుతుంద‌న్న సంగ‌తిని ప‌వ‌న్ ఇప్పుడు గ్ర‌హించి ఉండొచ్చ‌న్న‌ది విశ్లేష‌కుల మాట‌. ఇత‌ర పార్టీల్లోలా కాక‌లు తిరిగిన రాజ‌కీయ యోధులు గానీ ఆర్థికంగా బ‌లంగా ఉన్న వ్య‌క్తులు గానీ జ‌న‌సేన‌లో లేరు. కాబట్టి ఫండ్స్ గురించి ప‌దే ప‌దే మాట్లాడ‌టం ద్వారా డ‌బ్బుల కోసం తాను ఇబ్బంది ప‌డుతున్న సంగ‌తిని అంద‌రికీ తెలియ‌జేయాల‌న్న‌ది ప‌వ‌న్ వ్యూహం కావొచ్చ‌ని కూడా ఓ వాద‌న ఉంది. అమెరికాలో ప‌లువురు తెలుగు వ్య‌క్తులు ఆర్థికంగా చాలా బ‌లంగా ఉన్నారు. త‌న క‌ష్టాలు చెప్ప‌డం ద్వారా వారి నుంచి విరాళాలు పొంద‌వ‌చ్చున‌ని ఆయ‌న భావిస్తుండొచ్చున‌ని ప‌లువురు అభిప్రాయ‌ప‌డుతున్నారు.


Tags:    

Similar News