ఇంతకీ పవన్ ఆలోచనేమిటి ?

Update: 2022-06-20 09:30 GMT
పొత్తులగురించి ఇప్పుడే ఏమీ మాట్లాడను..జనసేన పొత్తు నేరుగా ప్రజలతోనే..ఇవి జనసేన అధినేత పవన్ కల్యాన్ చేసిన వ్యాఖ్యలు.  ఆత్మహత్యలు చేసుకున్న కౌలురైతులకు పరిహారం అందించేందుకు పవన్ ప్రకాశం జిల్లాలోని పర్చూరులో పర్యటించారు.

ఈ సందర్భంగా మాట్లాడుతు వచ్చే ఎన్నికలకు సంబందించి పొత్తులపై ఇప్పుడే ఏమీ మాట్లాడనని చెప్పేశారు. మరో సందర్భంలో తన పొత్తు నేరుగా ప్రజలతోనే అని ప్రకటించారు.

పై రెండు వ్యాఖ్యల్లోనే పరస్పర విరుద్ధ వైఖరి కనబడుతోంది. ఇదంతా సరే ఎన్నికల సమయంలో మాత్రమే పొత్తుల గురించి మాట్లాడుతానని చెప్పిన పవన్ మరి దాదాపు మూడు నెలల క్రితమే ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు చీలనిచ్చేది లేదని ఎందుకన్నట్లు ? ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు చీలనిచ్చేది లేదంటే అర్ధం పొత్తులు పెట్టుకోవటమే కదా ? పొత్తులు పెట్టుకోకుండా ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు చీలనివ్వకుండా వేరే మార్గముందా ?

పోనీ ఈ విషయాన్ని కూడా వదిలేస్తే దాదాపు నెలక్రితం జనసేనతో పొత్తులకు మూడు ఆప్షన్లిచ్చింది స్వయంగా పవనే కదా. జనసేన+బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు, జనసేన+బీజేపీ+టీడీపీ ప్రభుత్వం, జనసేన ఒంటరిగా ప్రభుత్వాన్ని ఏర్పాటుచేయటం అనే ఆప్షన్లు ఎందుకిచ్చినట్లు ?

ప్రభుత్వం ఏర్పాటు విషయంలో అసలు ఆప్షన్లు ఇవ్వమని పవన్ ఎవరడిగారు ? ఎవరు అడగకుండానే తనంతట తానుగా అప్పుడు ఆప్షన్లిచ్చిన పవన్ ఇపుడేమో పొత్తుల గురించి ఇపుడే మాట్లాడనని చెప్పటంలో అర్థమేంటి ?

చూడబోతే ఢిల్లీ టూరు అట్టర్ ఫ్లాప్ అయ్యిందా ?  టీడీపీతో పొత్తుకు బీజేపీ అగ్రనేతలను ఒప్పించేందుకు ప్రయత్నించి విఫలమవ్వటంతోనే పవన్ కు ఏమి చేయాలో తెలీటం లేదా ? వచ్చే ఎన్నికల్లో బీజేపీతోనే కలిసి వెళ్ళాలా ? లేకపోతే కమలంపార్టీని వదిలేయాలా ? అన్న కన్ఫ్యూజన్ ఉండటం వల్లే ఏమి మట్లాడాలో తెలియక పొత్తుల విషయాన్ని దాటేశారా అనే చర్చ పెరిగిపోతోంది. చూద్దాం ఏదో రోజు పొత్తులపై తనంతట తానే మాట్లాడకుండా ఉంటారా ?
Tags:    

Similar News