వ్యూహం ఏదైనా ప్ర‌జ‌లు న‌మ్మాలి క‌దా ప‌వ‌నూ...!

Update: 2022-05-22 01:30 GMT
రాజ‌కీయాల్లో వ్యూహాలు.. ప్ర‌తివ్యూహాలు కామ‌న్‌. ఎక్క‌డిక‌క్క‌డ ప్ర‌త్య‌ర్థులను నిలువ‌రించేందుకు.. పార్టీలు ప్ర‌య‌త్నాలు చేస్తాయి. నాయ‌కులు కూడా ప్ర‌య‌త్నాలు చేస్తారు. అయితే.. ఈ వ్యూహాలు ఫ‌లించాలంటే.. ప్ర‌జ‌లు అస‌లు నాయ‌కుల‌ను కానీ.. పార్టీల‌ను కానీ.. న‌మ్మాలి క‌దా!! ఈ న‌మ్మ‌క‌మే లేన‌ప్పుడు.. ఎన్ని వ్యూ హాలు వేసి కూడా ప్ర‌యోజ‌నం ఏంటి? ఎన్ని ప్ర‌యత్నాలు చేసి.. ఉప‌యోగం ఏంటి? ఇదే ఇప్పుడు మేధావులు జ‌న‌సేన‌ను ప్ర‌శ్నిస్తున్నారు.

ఎందుకంటే.. జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్‌.. చేస్తున్న రాజ‌కీయ‌ల‌ను ప‌రిశీలిస్తున్న వారు.. ఆయ‌న క‌ర్ర విడిచి సాము చేస్తున్నార‌నే వాద‌న‌ను వినిపిస్తున్నారు. వ్యూహం ప్ర‌కారం అయితే.. ఆయ‌న వ‌చ్చే ఎన్నిక ల్లో వైసీపీ వ్య‌తిరేక ఓటు బ్యాంకును చీల్చ‌కుండా చూస్తాన‌ని అన్నారు. అదేస‌మ‌యంలో రాష్ట్రంలో అధి కారంలోకి కూడా వ‌స్తామ‌ని చెప్పారు. అంటే.. ఇదేమీ అంత తేలికైన వ్యూహం కాదు. బ‌ల‌మైన వైసీపీ ఓటు బ్యాంకును త‌న వైపు తిప్పుకోవాలి.

సంక్షేమ రాజ్యంలో పాల‌న చేస్తున్నామ‌ని.. ప్ర‌జ‌ల్లో సెంటిమెంటును ర‌గిలించిన వైసీపీ నేత‌ల ను వారికి దూరం చేయాలి. అదేస‌మ‌యంలో ``అంత‌కుమించి`` అన్న విధంగా సంక్షేమ ఫ‌లాల‌ను ప్ర‌జ‌ల‌కు ప్ర‌క టించాలి.

వీటిక‌న్నాముందు.. అస‌లు ప‌వ‌న్ విజిటింగ్ లీడ‌ర్‌.. పెయిడ్ ఆర్టిస్ట్.. అనే వైసీపీ నేత‌ల వ్యాఖ్య‌ల‌ను తిప్పికొడుతూ.. వారికి దీటుగా ఏపీలోనే నివాసం ఏర్పాటు చేసుకుని.. ప్ర‌జ‌ల్లో క‌లిసిపోవాలి. ఇవ‌న్నీ చేయ‌డం మానేసి.. గుర్తుకు వ‌చ్చిన‌ప్పుడు.. రాజ‌కీయాలు చేయ‌డం విమ‌ర్శ‌ల‌కు తావిస్తోంది.

తాజాగా ప‌వ‌న్ రెండు కీల‌క‌మైన ప్ర‌క‌ట‌న‌లు చేశారు. ఒక‌టి.. ఏపీలో తాము అధికారంలోకి రాగానే ఉద్యోగు లు డిమాండ్ చేస్తున్న సీపీఎస్‌ను ర‌ద్దు చేస్తామ‌న్నారు. అదేస‌మ‌యంలో త‌మ‌కు అధికారంపై మ‌క్కువ లేదని చెప్పారు. దీనిని ఎలా చూడాలి. సీపీఎస్ విష‌యాన్ని తీసుకుంటే.. గ‌త సీఎం చంద్ర‌బాబు దీనిని ర‌ద్దు చేయ‌లేక పోయారు. దీంతో ఉద్యోగులు జ‌గ‌న్‌ను న‌మ్మారు. ఇప్పుడు ఆయ‌న కూడా దీనిని చేయ‌లేన‌ని చెప్పారు. ఇక‌, తాజాగా తాను చేస్తాన‌ని ప‌వ‌న్ చెబుతున్నారు.

అయితే.. దీనిని ఎలా చేస్తార‌నేది ఇప్పుడు ప్ర‌శ్న‌. కేవ‌లం హామీ ఇచ్చినంత మాత్రాన‌.. ప‌వ‌న్‌ను ఉద్యోగులు న‌మ్మే ప‌రిస్థితి లేదు. ఎందుకంటే.. గ‌తంలో హామీల‌కే వారు ఓట్లేశారు. ఈ హామీలు ఇప్ప‌టికీ నెర‌వేర‌లేదు. ఈ నేప‌థ్యంలో వారికి ఎలా చేస్తారో వివ‌రించాలి. మ‌రోవైపు అధికారం వ‌ద్ద‌న్నారు. మ‌రి ఓట్లెందుకు వేయాలి? అనే ప్ర‌శ్న తెర‌మీదికి వ‌స్తుంది. దీనికి కూడా ప‌వ‌న్ స‌మాధానం చెప్పాల్సి ఉంటుంది.
Tags:    

Similar News