బాబు ప‌నిని సింపుల్ గా తీసి పారేశాడుగా?

Update: 2018-10-19 04:45 GMT
క‌డుపు నిండిన‌ప్పుడు బిర్యానీ తెచ్చి ఇచ్చినా.. ఇప్పుడు కాదులే అనేస్తాం. అదే. ఆక‌లితో న‌క‌న‌క‌లాడుతున్న వేళ‌.. తిండి ఏదైనా కానీ.. ఆవురావుర‌మ‌ని తినేస్తాం. అవ‌స‌రం వ‌చ్చిన‌ప్పుడు అందే సాయానికి విలువ వేరు. ఆ విష‌యం మ‌న‌సున్న మ‌నిషిగా.. ఎవ‌రికైనా క‌ష్టం వ‌చ్చిందంటే త‌న‌కే వ‌చ్చిన‌ట్లుగా బాధ ప‌డే వ్య‌క్తి అన్న ఇమేజ్ ఉన్న జ‌న‌సేన అధిప‌తి ప‌వ‌న్ క‌ల్యాణ్ తాజా తీరును ప‌లువురు త‌ప్పు ప‌డుతున్నారు.

ఓవైపు తిత‌లీ తుపాను కార‌ణంగా సిక్కోలు (శ్రీ‌కాకుళం) జిల్లా వాసులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న వేళ‌.. ప్ర‌భుత్వ సాయం అంతంత మాత్రంగా అందుతున్న వేళ‌.. త‌న‌కున్న శ‌క్తియుక్తుల్ని సిక్కోలు మీద పెట్టాల్సిన ప‌వ‌న్ క‌ల్యాణ్.. అందుకు భిన్నంగా క‌వాతు పేరుతో రాజ‌మహేంద్ర‌వ‌రంలో భారీ బ‌హిరంగ స‌భ‌ను పెట్ట‌టాన్ని ప‌లువురు త‌ప్పు ప‌ట్టిన విష‌యం తెలిసిందే.

ఇప్పుడున్న ప‌రిస్థితుల్లో ఇంత భారీ స‌భ కంటే.. దాని కోసం ఖ‌ర్చు చేసిన నిధుల్ని సిక్కోలు ప్రాంతానికి సాయంగా అందించి ఉండాల్సింద‌న్న మాట ప‌లువురి నోటి నుంచి వినిపించింది. కార్య‌క‌ర్తలు.. అభిమానుల బ‌లం గురించి త‌ర‌చూ చెప్పే ప‌వ‌న్ క‌ల్యాణ్.. సిక్కోలు వాసుల వెత‌లు తీర్చేందుకు త‌న అభిమానుల్ని సిక్కోలుకు వెళ్లి ఆదుకోవాల్సిందిగా చెప్పి ఉంటే బాగుండేద‌న్న మాట ఉంది.

అయితే.. సిక్కోలు వెత‌ల్ని ప‌ట్టించుకోని ప‌వ‌న్‌.. త‌న స‌భ మీద ఫోక‌స్ పెట్ట‌టం.. ఈ నేప‌థ్యంలో వెల్లువెత్తిన నెగిటివ్ కామెంట్స్ నేప‌థ్యంలో సిక్కోలులో ప‌ర్య‌టిస్తున్నారు. ఈ సంద‌ర్భంగా సీఎం చంద్ర‌బాబుపై ఆయ‌న తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు. తుపాను కార‌ణంగా వంద‌లాది మంది ఇళ్లు పోగొట్టుకొని నిరాశ్ర‌యుల‌య్యార‌ని.. వారికి అందే సాయం విష‌యంలో ప్ర‌భుత్వ ప‌ని తీరుపై అసంతృప్తి వ్య‌క్తం చేశారు.

వ‌జ్ర‌పుకొత్తూరు మండ‌లంలో ప‌ర్య‌టించిన ప‌వ‌న్ మీడియాతో మాట్లాడుతూ.. సిక్కోలు ప్ర‌జ‌ల‌కు కావాల్సింది పాతిక కేజీల బియ్యం కాద‌ని.. పాతికేళ్ల భ‌విష్య‌త్ అని పేర్కొన్నారు. క‌రెంటు.. మంచినీళ్లు ఇచ్చేసి జిల్లాలో ప‌రిస్థితులు మెరుగుప‌డ్డాయ‌ని చెప్పేసుకుంటూ ప్ర‌చారం చేసుకోవ‌టం త‌గ‌ద‌న్నారు.

ప్ర‌భుత్వం చేసుకుంటున్న ప్ర‌చారానికి.. వాస్త‌వాల‌కు మ‌ధ్య వ్య‌త్యాసం చాలా ఉంద‌న్న ఆయ‌న‌.. కేర‌ళ‌కు వ‌ర‌ద‌లు వ‌స్తే అంద‌రూ వ‌చ్చారు కానీ.. శ్రీ‌కాకుళానికి తుపాను వ‌స్తే ఎవ‌రూ రాలేద‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. ప్ర‌ధాని మోడీ కేర‌ళకు వెళ్లారు కానీ.. సిక్కోలుకు రాలేద‌న్నఅసంతృప్తి ప‌వ‌న్ మాట‌ల్లో వినిపించింది. ఉద్దానంలో ఇప్ప‌టికి క‌రెంటు రాలేద‌న్న ఆయ‌న‌.. ఉద్దానం కిడ్నీ స‌మ‌స్య‌ను తాను ప్ర‌పంచానికి ఎలా తెలియ చెప్పానో.. అదే రీతిలో సిక్కోలు వెత‌ల్ని.. తుపాను  క‌ష్టాల్ని ప్ర‌పంచానికి తెలిసేలా చేస్తాన‌ని చెప్పారు.

అనుకుంటాం కానీ ప‌వ‌న్‌.. ప్ర‌ధాని మోడీ సిక్కోలుకు రాలేద‌న్న వంక బాగానే ఉంది. మ‌రి.. మీ సంగ‌తేంది?  సిక్కోలు దారుణంగా దెబ్బ‌తింద‌న్న స‌మాచారం ఉన్నా..  మీ స‌భ‌ను మీరు చూసుకున్నారే కానీ.. దాన్ని ర‌ద్దు చేసేసి ప్ర‌జ‌లకు సాయం చేసేందుకు వ‌చ్చారా?  ఇక్క‌డ ఎవ‌రి స్వార్థం వారికి ముఖ్యం. ఎవ‌రి లెక్క‌లు వారివి. ఏపీకి ఏమీ చేయ‌కూడ‌ద‌న్న ఆలోచ‌న‌లో ఉన్న ప్ర‌ధాని మోడీ.. సిక్కోలుకు ఎందుకు వ‌స్తారు?  

వ‌స్తే.. సాయం మాట చెప్పాల్సి ఉంటుంది.. ఏపీకి ఏమీ చేయ‌టం ఇష్టం లేని వేళ‌.. వ‌చ్చి ఇవ్వ‌లేద‌న్న మాట అనిపించుకునే క‌న్నా.. రాకుండా ఉండ‌టం ద్వారా సిక్కోలు తుపాను తీవ్ర‌త‌ను చిన్న‌ది చేసే ప్ర‌య‌త్నాన్ని అర్థం చేసుకోవ‌చ్చు.  మోడీ దాకా ఎందుకు.. మీరు మాత్రం క‌వాతు అయ్యాకే సిక్కోలు క‌నిపించింది కానీ.. ముందు కాదుగా. ఇప్పుడు నీతులు చెప్పే ముందు కాస్త వెన‌క్కి తిరిగి చూసుకుంటే బాగుంటుందేమో ప‌వ‌న్‌?
Tags:    

Similar News