వరస్ట్ సీఎం ఎవరంటే చంద్రబాబే.. జేసీ వ్యాఖ్యలు

Update: 2020-03-10 07:30 GMT
రాజకీయాల్లో జేసీ సోదరుల పాత్ర డిఫరెంట్. వారు రాజకీయం గా కీలకంగా ఉంటూనే ఎప్పుడూ హాట్ టాపిక్ గా నిలుస్తుంటారు. సొంత పార్టీ నాయకులను ఇరుకున పెట్టేలా వారి వ్యవహారం ఉంటుంది. పార్టీ అధినేత చంద్రబాబును నేరుగా దూషిస్తారు.. ఆయనకు వ్యతిరేకం గా వ్యాఖ్యలు చేయడం మాజీ జేసీ దివాకర్ రెడ్డికే చెల్లు. తాజాగా అలాంటి వ్యాఖ్యలే జేసీ దివాకర్ రెడ్డి చేశారు. సీఎం వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డిని ‘మా వాడే’ అని చెబుతూ చంద్రబాబు వరస్ట్ సీఎం అని పేర్కొన్నారు. సోమవారం మీడియాతో ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా పలు అంశాలపై ఆయన స్పందించారు.

ఓటమి అనంతరం రాజకీయాల్లో సైలెంట్ గా ఉన్న ఆయన తరచూ మీడియా కంటపడుతున్నారు. ఈ సందర్భంగా చంద్రబాబుపై సంచలన వ్యాఖ్యలు చేశారు. 2024 లో చంద్రబాబే ముఖ్యమంత్రిగా అవుతారని జోస్యం చెబుతూనే చంద్రబాబును అప్పుడు అందరూ వరస్ట్‌ సీఎంగా చూస్తారని పేర్కొన్నారు. దానికి కారణం, ప్రస్తుత ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డే వ్యవహారమని తెలిపారు. ఇక స్థానిక ఎన్నికల్లో టీడీపీ పోటీ చేయవద్దని కోరుతున్నారు. ఈ ఎన్నికల్లో వైఎస్సార్సీపీ అద్భుతంగా గెలుస్తుందని చెప్పారు.

టీడీపీ ఎంత గింజుకున్నా స్థానిక సంస్థల ఎన్నికల్లో దండగని పేర్కొంటూనే ప్రస్తుత ప్రభుత్వ వైఖరి ఎలా ఉందో వివరించారు. ఒకవేళ ఇతర పార్టీల నుంచి ఎవరన్నా గెలిస్తే, జైలుకు వెళ్లాల్సిందేనని, ఆ దిశగా వైఎస్‌ జగన్‌ ఇప్పటికే వ్యూహం సిద్ధం చేశారని వివరించారు. వేరే పార్టీల నుంచి ఎవరు గెలిచినా, వారిని వైఎస్సార్సీపీలో కి లాగేయడమో.. లేదంటే వారిపై కేసులు పెట్టడమో జరుగుతుంది.. అందుకే, స్థానిక ఎన్నికల్లో పోటీ చేయొద్దని చంద్రబాబుకి సూచించినట్లు తెలిపారు. అయితే ప్రస్తుతం జగన్ వ్యవహారిస్తున్న రాజకీయమంతా భవిష్యత్ లో చంద్రబాబు కూడా పాటిస్తారని పేర్కొన్నారు. అప్పుడు చంద్రబాబు రాజకీయం ఇంకా దారుణంగా ఉంటుందని ఎవరూ తట్టుకోలేరని పేర్కొన్నారు.
Tags:    

Similar News