‘టీ’లు తాగే వారికి రూపాయికి కిలో బియ్యమేంటి?

Update: 2016-01-07 06:49 GMT
కరుకుగా కనిపించినప్పటికీ.. లాజిక్ ఉన్న విషయాన్ని తెరపైకి చర్చకు తీసుకొచ్చారు ఏపీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి. ఆసక్తికర వ్యాఖ్యలకు కేరాఫ్ అడ్రస్ అయిన ఆయన తన మనసులో ఉన్న ఏ విషయాన్ని బయటకు చెప్పేందుకు అస్సలు సంకోచించరు. ఓటు బ్యాంకు గురించి కాకుండా.. నిజం నిజంగా మాట్లాడితే తప్పేంటన్నట్లుగా ఆయన మాట తీరు ఉంటుంది. తాజాగా.. గాంధీతోనే ప్రజాస్వామ్యం పోయిందంటూ సరికొత్త వ్యాఖ్య చేసిన ఆయన సంక్షేమ పథకాల అమలుపై గుర్రుగా ఉంటారు.

కొన్ని సంక్షేమ పథకాల కారణంగా నష్టమే తప్పించి ఎలాంటి లాభం ఉండదని తెలిసినా కూడా.. దాని గురించి మాట్లాడితే ఎక్కడ తమ ఓటు బ్యాంకు నష్టపోతుందన్న ఆలోచనలో ఉండే రాజకీయ పార్టీలకు.. నేతలకు భిన్నంగా ఒక సున్నితమైన అంశాన్ని జేసీ చర్చకు పెట్టారు.

ఏపీలో అమలు చేస్తున్న రూపాయికి కిలో బియ్యం పథకం అనవసరమన్నది ఆయన భావన. తాను సంక్షేమ పథకాలకు వ్యతిరేకినని చెప్పే ఆయన.. ప్రతిరోజూ కూలి పనికి వెళ్లే వ్యక్తి రోజుమొత్తంలో కనీసం 5 సార్లు టీ తాగుతుంటారని.. అలాంటి వ్యక్తికి కిలో రూపాయికి బియ్యం ఇవ్వటం సరికాదన్నది జేసీ వాదన. ఏపీ సర్కారు ఘనంగా చెప్పుకునే పథకాల్లో ఒకటైన రూపాయికి కిలో బియ్యం పథకం మీద జేసీ చేసిన వ్యాఖ్యలపై చంద్రబాబు ఎలా రియాక్ట్ అవుతారో..? ఏమైనా జేసీ వాదనలో లాజిక్కుందన్న మాట మాత్రం వాస్తవమని చెప్పక తప్పదు.
Tags:    

Similar News