చేతులు జోడించి సారీ చెప్పిన జేసీ

Update: 2017-06-16 09:25 GMT
అనంత‌పురం టీడీపీ ఎంపీ దివాక‌ర్ రెడ్డి క్షమాప‌ణ‌లు చెప్పారు. గురువారం విశాఖ విమానాశ్ర‌యంలో జ‌రిగిన ఘ‌ట‌న తర్వాత ఆయ‌న‌పై ప‌లు  విమాన సంస్థ‌లు నిషేధం విధించిన సంగ‌తి తెలిసిందే. ఈ సంఘ‌ట‌న‌పై ఆయ‌న్ను మీడియా ప్ర‌శ్నించింది. అయితే త‌న ప్ర‌వ‌ర్త‌న, వివాదం ప‌ట్ల మాట్లాడేందుకు నిరాక‌రించిన ఎంపీ దివాక‌ర్ రెడ్డి చేతులు జోడించి సారీ చెప్పారు.

అనంత‌పురం ఎంపీ జేసీ దివాక‌ర్ రెడ్డి గురువారం విశాఖ విమానాశ్ర‌యంలో వీరంగం సృష్టించిన సంగ‌తి తెలిసిందే. ఇండిగో విమానంలో ఆయ‌న విమానాశ్ర‌యానికి వ‌చ్చారు. బోర్డింగ్ పాస్ జారీ స‌మ‌యం అయిపోవ‌డంతో సిబ్బంది కౌంట‌ర్ మూసేశారు. త‌న‌కు బోర్డింగ్ పాస్ ఇవ్వాల‌ని సిబ్బందితో దివాక‌ర్ రెడ్డి వాద‌న‌కు దిగారు. స‌మ‌యం ముగిసింద‌ని, ఇవ్వ‌డం కుద‌ర‌ద‌ని అక్క‌డి వారు చెప్ప‌డంతో ఆయ‌న ఆగ్ర‌హంతో ఊగిపోయారు. బోర్డింగ్ పాస్ ప్రింట‌ర్‌ ను విసిరేసి వీరంగం సృష్టించారు. జేసీ వ్య‌వ‌హారంపై ఎయిర్‌ పోర్టు సిబ్బంది ఉన్న‌తాధికారుల‌కు ఫిర్యాదు చేశారు.

జేసీ దురుసు ప్ర‌వ‌ర్త‌న నేప‌థ్యంలో విస్తారా - గో ఎయిర్‌ - ఎయిర్ ఆసియా ఇండియాతో పాటు ఎయిర్ ఇండియా - స్పైస్‌ జెట్‌ - జెట్ ఎయిర్‌ వేస్‌ - ఇండిగో సంస్థ‌లు జేపీపై బ్యాన్ విధించాయి. ఇదిలాఉండ‌గా...విమానాశ్ర‌యంలో జేసీ చేసిన వీరంగం ఘ‌ట‌న‌పై విచార‌ణ‌కు ఆదేశించనున్న‌ట్లు పౌర‌విమానాయాన సంస్థ మంత్రి అశోక్ గ‌జ‌ప‌తి రాజు తెలిపారు. ఘ‌ట‌న ప‌ట్ల పూర్తి విచార‌ణ చేప‌డుతామ‌ని కేంద్ర మంత్రి రాజు స్ప‌ష్టం చేశారు. విమానాశ్ర‌య పోలీసులు కూడా ఈ ఘ‌ట‌న ప‌ట్ల స్పందించారు. అయితే ఘ‌ట‌న ప‌ట్ల ఇండిగో సంస్థ నుంచి ఎటువంటి ఫిర్యాదు రాలేద‌ని ఎయిర్‌ పోర్ట్ సీఐ తెలిపారు. ప్రాథ‌మిక విచార‌ణ చేప‌ట్టామ‌ని, కానీ ఎవ‌రూ ఎటువంటి ఫిర్యాదు చేసేందుకు ముందుకు రాలేద‌న్నారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News