మీడియాను న్యాయం చెప్ప‌మ‌న్న జేసీ?

Update: 2018-09-22 05:17 GMT
మామూలుగా రాజ‌కీయ నాయ‌కులంటేనే తెలివితేట‌ల‌కు కేరాఫ్ అడ్ర‌స్ గా నిలుస్తుంటారు. ప్ర‌జా సంక్షేమం సంగ‌తి ఎలా ఉన్నా.. త‌మ మాట‌ను నెగ్గించుకోవ‌టానికి.. త‌మ అధిప‌త్యాన్ని ప్ర‌ద‌ర్శించుకోవ‌టానికి దేనికైనా సై అనే వైఖ‌రి కొట్టొచ్చిన‌ట్లుగా క‌నిపిస్తూ ఉంటుంది. అలాంటి నేత‌ల్లో రాజ‌కీయాన్ని న‌ర‌న‌రాన నింపుకున్నట్లుగా ఉండే అనంత‌పురం టీడీపీ ఎంపీ జేసీ దివాక‌ర్ రెడ్డి గురించి ప్ర‌త్యేకంగా చెప్పుకోవాల్సిందే.

త‌మ రాజ‌కీయ అధిప‌త్యాన్ని నిలుపుకునేందుకు దేనికైనా రెఢీ అన్న‌ట్లుగా వ్య‌వ‌హ‌రించే జేసీ.. గ‌డిచిన వారంగా ఆయ‌న మీడియాలో తెగ నానుతున్నారు.  ఆయ‌న అడ్డాలాంటి తాడిప‌త్రిలో ప్ర‌భోదానంద‌తో త‌న‌కున్న పంచాయ‌తీల నేప‌థ్యంలో పోలీసుల తీరును ఇష్టం వచ్చిన‌ట్లుగా తిట్టేయ‌టం తెలిసిందే.

పాపం పోలీసులు.. ఎప్ప‌టిక‌ప్పుడు అధికార‌పార్టీ ప‌క్షాన త‌మ‌కున్న విధేయ‌త‌ను ప్ర‌ద‌ర్శించేందుకు తాప‌త్ర‌య‌ప‌డుతూ.. ఒద్దిక‌గా వ్య‌వ‌హ‌రించే వారిపైనా త‌న నోటి ప్ర‌తాపాన్ని ప్ర‌ద‌ర్శించారు. ఆ మాట‌ల ఘాటు ఎంత‌వ‌ర‌కూ వెళ్లిందంటే.. పోలీసులు సైతం స్పందించి.. తీవ్ర వ్యాఖ్య‌లు చేసే వ‌ర‌కూ వెళ్లింది. పోలీసుల‌పై జేసీ చేసిన వ్యాఖ్య‌ల‌పై ఏపీ పోలీసు అధికారుల సంఘం ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి గోరంట్ల మాధ‌వ్ కాస్త మోతాదుకు మించిన వ్యాఖ్య‌లే చేశారు.

రాజ‌కీయ నాయ‌కులు ఎవ‌రైనా స‌రే.. పోలీసుల‌పై అడ్డ‌దిడ్డంగా విమ‌ర్శ‌లు చేస్తే.. నాలుక కోస్తామ‌న్న హెచ్చ‌రింపుతో పాటు.. అదే ప‌నిగా త‌మ‌ను తిడుతూ ఉంటే ఊరుకునేది లేద‌ని తేల్చి చెప్పారు. ఎప్పుడూ లేని విధంగా త‌న మాట‌ల‌పై ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తూ పోలీసు అధికారుల సంఘం విరుచుకుప‌డ‌టంతో జేసీ అర్జెంట్ గా ప్రెస్ మీట్ పెట్టేశారు.

తాను పోలీసుల‌ను ఉద్దేశించి కొజ్జా ప‌దం వాడాన‌ని.. అదేమైనా త‌ప్పు మాటా? అంటూ ఎదురు ప్ర‌శ్న వేశారు. కొజ్జా అన్న ప‌దం త‌ప్ప‌ని మీడియా చెబితే తాను క్ష‌మాప‌ణ చెప్ప‌టానికి సిద్ధ‌మేన‌ని ప్ర‌క‌టించారు. జేసీ తీరు చూస్తే భ‌లే ముచ్చ‌టేస్తుంద‌ని చెప్పాలి. అనాల్సిన మాట అనేసి. తాను అన్న మాట‌లో త‌ప్పు ఉంద‌ని మీడియా చెబితే తాను సారీ చెబుతాన‌ని చెప్ప‌టం చూస్తే.. జేసీ త‌న తెలివితో మీడియాను ముగ్గులోకి లాగాల‌న్న‌ట్లుగా జేసీ వ్యాఖ్య‌లు ఉన్న‌ట్లుగా క‌నిపిస్తున్నాయి. చూస్తూ.. చూస్తూ జేసీ ఇష్యూలో ఎవ‌రు మాత్రం వేలు పెట్ట‌గ‌ల‌రు చెప్పండి? 
Tags:    

Similar News