జేసీల పుట్టి ముంచిన బ్లాక్ మెయిల్ పాలిటిక్స్‌: అనంత టాక్‌

Update: 2020-10-23 03:00 GMT
రాజ‌కీయాలు ఎప్పుడూ ఒకేలా ఉండ‌వు. నిన్న హీరోలు.. నేడు జీరోలు కావ‌డం చ‌రిత్ర చెబుతున్న స‌త్యం. ఈ క్ర‌మంలోనే ఖ‌చ్చితంగా ఏడాదిన్నర కింద‌ట అనంత‌పురంలో త‌మ‌కు తిరుగులేద‌ని అనుకున్న జేసీ దివాక‌ర్ రెడ్డి, ప్ర‌భాక‌ర్ రెడ్డి కుటుంబాలు.. నేడు.. త‌మ‌ను గుర్తించేవారే లేకుండా పోయార‌ని విల‌పిస్తున్న ప‌రిస్థితి క‌నిపిస్తోంది. ఇక‌, వీరిని న‌మ్ముకున్న కేడ‌ర్ కూడా జారిపోతోంద‌నే టాక్ వినిపిస్తోంది. ముఖ్యంగా టీడీపీలో ఇప్పుడు జేసీల‌ను ప‌ల‌క‌రించేవారు కూడా క‌రువ‌య్యారు. సుదీర్ఘ కాలం కాంగ్రెస్‌లో ఉన్న జేసీలు.. తాడిప‌త్రిలో తిరుగులేని హ‌వా చ‌లాయించారు. రాష్ట్ర విభ‌జ‌న‌తో కాంగ్రెస్‌తో విభేదించారు.


ఈ క్ర‌మంలోనే వైసీపీ నుంచి వ‌చ్చిన ఆహ్వానాల‌ను తిర‌స్క‌రించి టీడీపీలోకి చేరిపోవ‌డం దివాక‌ర్‌రెడ్డి అనంత‌పురం ఎంపీగా, ప్ర‌భాక‌ర్ రెడ్డి తాడిప‌త్రి ఎమ్మెల్యేలుగా చ‌క్రం తిప్ప‌డం తెలిసిందే. అయితే, వీరికి.. చంద్ర‌బాబుకు మ‌ధ్య సెంటిమెంటు రాజ‌కీయాల‌క‌న్నా.. కూడా బ్లాక్‌మెయిల్ రాజ‌కీయాలు న‌డిచాయ‌ని అంటారు జిల్లా నేత‌లు. ఎంపీగా ఉంటూనే నియోజ‌క‌వ‌ర్గానికి నీరు ఇప్పించుకునే విష‌యంలో రాజీనామా అస్త్రాన్ని ప్ర‌యోగించారు దివాక‌ర్‌రెడ్డి. దీంతో బాబు.. అనంత‌పురం నియోజ‌క‌వ‌ర్గానికి నీటిని విడుద‌ల చేశారు. ఆ త‌ర్వాత కూడా అనంత‌పురం అర్భ‌న్ నియోజ‌క‌వ‌ర్గంలో పాగా వేసేందుకు ఇదే పంథాను అనుస‌రించారు దివాక‌ర్‌.

కొన్నాళ్లు చంద్ర‌బాబు స‌హించినా.. ప్ర‌భాక‌ర్ చౌద‌రి సౌమ్యం.. ప్ర‌జాద‌ర‌ణ‌తో నిజాలు తెలుసుకున్నారు. అయిన‌ప్ప‌టికీ.. జేసీల‌కు ఇచ్చే ప్రాధాన్యం ఇస్తూనే ఉన్నారు. ఇటీవ‌ల జ‌గ‌న్ స‌ర్కారు ప్ర‌భాక‌ర్‌రెడ్డి కుటుంబంపై కేసులు న‌మోదు చేసిన‌ప్పుడు క‌రోనాను కూడా లెక్క‌చేయ‌కుండా.. త‌న కుమారుడు లోకేష్‌ను పంపించి సానుభూతి, మ‌ద్ద‌తు తెలిపారు. అయితే.. జేసీల పంథా మాత్రం మార‌లేదు. పార్టీలో మాకు గుర్తింపు లేదు.. అంటూ..కూనిరాగాలు తీస్తూనే ఉన్నారు. అదేస‌మ‌యంలో రాజ‌ధానిగా అమ‌రావ‌తినే ఉంచుతానంటే.. జ‌గ‌న్ కే తాను కూడా ఓటు వేస్తాన‌ని ప్ర‌భాక‌ర్ రెడ్డి చెప్ప‌డం.. వంటివి బాబుకు ఒకింత వారిపై అసంతృప్తి క‌లిగించాయి.

ఈనేప‌థ్యంలోనే ఇటీవ‌ల పార్టీలో అనేక మందికి ప‌ద‌వులు ఇచ్చినా.. జేసీ కుటుంబంలో ఉన్న న‌లుగురుని కూడా బాబు ప‌ట్టించుకోలేదు. ప్ర‌భాక‌ర్‌, దివాక‌ర్‌, అస్మిత్‌, ప‌వ‌న్‌రెడ్డిల‌ను  పార్టీలోకానీ.. పార్ల‌మెంట‌రీ జిల్లా క‌మిటీల్లో కానీ ప్రాధాన్యం ఇవ్వ‌క‌పోవ‌డం గ‌మ‌నార్హం. దీంతో జేసీలు ఇక వేరే దారి చూసుకోక త‌ప్ప‌ద‌ని అంటున్నారు. పైగా వీరితో ఏమాత్రం పొస‌గ‌ని మాజీ మంత్రి కాల్వ శ్రీనివాసులు ఇప్పుడు .. అనంత‌పురం ఇంచార్జ్‌గా ఉన్నారు. ఈ ప‌రిణామాల‌ను గ‌మ‌నిస్తే.. బాబు వీరికి పూర్తిగా మంగ‌ళం పాడిన‌ట్టేన‌ని.. బ్లాక్‌మెయిల్ రాజ‌కీయాలే జేసీల కుటుంబాన్ని ముంచేశాయ‌ని అనంత‌పురంలో భారీ ఎత్తున చ‌ర్చ సాగుతోంది. మ‌రి సోద‌రులు ఏం చేస్తారో.. చూడాలి.
Tags:    

Similar News