24 గంటల్లోనే.. జేసీ మళ్లీ అరెస్ట్!!

Update: 2020-08-07 13:53 GMT
తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డిని.. ఆయన తనయుడు జేసీ అస్మిత్ రెడ్డిని అంత ఈజీగా వదిలేలా కనిపించడం లేదు. బెయిల్ పై బయటకొచ్చిన 24 గంటల్లోనే పోలీసులు మళ్లీ వారిద్దరినీ అరెస్ట్ చేయడం సంచలనమైంది.

జేసీ ప్రభాకర్ రెడ్డి బయటకు రాగానే హల్ చల్ చేశారు. బెయిల్ పై విడుదలై తాడిపత్రికి వచ్చిన జేసీ ప్రభాకర్ రెడ్డికి స్వాగతం చెప్పడానికి పెద్ద ఎత్తున అనుచరులు వచ్చి ర్యాలీ తీశారు. ఈ క్రమంలోనే అంబులెన్స్ లకు దారి కూడా ఇవ్వకుండా జేసీ ర్యాలీ కాన్వాయ్ సాగింది. వారిని నియంత్రించడానికి ప్రయత్నించిన పోలీసులు, సీఐపై జేసీ ప్రభాకర్ రెడ్డి దురుసుగా ప్రవర్తించారు. కారు దిగి పోలీసులపైకి ఉరిమి చూస్తూ చేతులు చూపిస్తూ బెదిరింపులకు దిగాడు. తన అనుచరులతో కలిసి పోలీసులపైకి దూసుకెళ్లారు.ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.

కాగా పోలీస్ విధులకు ఆటంకం కలిగించినందుకు జేసీ ప్రభాకర్ రెడ్డిపై సెక్షన్ 353తోపాటు ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీకింద కేసు నమోదు చేసినట్టు అనంతపురం పోలీసులు తెలిపారు.

తాడిపత్రి సీఐ దేవేంద్రకుమార్ పై అనుచితంగా ప్రవర్తించారనే కారణంతో వారిద్దరిపై మూడు సెక్షన్ల కింద కేసులు నమోదయ్యాయి. ఈ కేసులకు సంబంధించి వారిద్దరినీ తాజాగా పోలీసులు మళ్లీ అరెస్ట్ చేశారు. బెయిల్ పై విడుదలైన 24 గంటల్లోనే బయటకొచ్చిన జేసీ ప్రభాకర్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టి మరీ సీఎం జగన్ సహా వైసీపీ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించారు. చాలెంజ్ లు విసిరారు. ఈ క్రమంలోనే పోలీసులను బెదిరించిన కేసులో మరోసారి జేసీ, ఆయన కుమారుడిని అరెస్ట్ చేయడం అనంతపురం జిల్లాలో చర్చనీయాంశమైంది.
Tags:    

Similar News