ఎమ్మెల్యేల అక్రమాస్తుల కేసు: కేసీఆర్‌ను సీబీఐ ప్రశ్నించే చాన్స్

Update: 2022-12-31 10:31 GMT
నలుగురు భారత్ రాష్ట్ర సమితి ఎమ్మెల్యేలను కొనుగోలు చేసేందుకు ప్రయత్నించిన కేసును తెలంగాణ హైకోర్టు సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్‌ (సీబీఐ)కు అప్పగించడంతో కేసు ఆసక్తికర మలుపు తిరిగింది. భారతీయ జనతా పార్టీ నాయకత్వాన్ని బట్టబయలు చేయడంలో అత్యుత్సాహం కారణంగా ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు ఇప్పుడు మంచి అవకాశాన్ని చేజార్చుకున్నారన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.   తెలంగాణ సీఎం కేసీఆర్ ఈ బీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో చిక్కులు తప్పవని ప్రముఖ బ్యూరోక్రాట్, సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ సంచలన వ్యాఖ్యలు చేశారు.

ఎమ్మెల్యేలు, ముగ్గురు నిందితుల మధ్య జరిగిన సంభాషణకు సంబంధించిన వీడియోలు, ఆడియోలు, ఇతర పత్రాలతో సహా దర్యాప్తు అంశాలు ముఖ్యమంత్రికి ఎలా చేరాయనే కీలకమైన అంశాన్ని హైకోర్టు న్యాయమూర్తి బీ విజయసేన్ రెడ్డి తన తీర్పులో లేవనెత్తారు. ముఖ్యమంత్రికి ఎవరు ఆధారాలు ఇచ్చారనే ప్రశ్నలకు ప్రత్యేక దర్యాప్తు బృందం అధికారులు సమాధానం చెప్పలేకపోయారని న్యాయమూర్తి గమనించారు.

మొయినాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేసిన పైలట్ రోహిత్ రెడ్డి కూడా కేసీఆర్ పత్రాలను ఎలా పొందుతారనే దానిపై సమాధానం ఇవ్వలేకపోయారు. ఇప్పుడు ఇది కేంద్రానికి ఆయుధంగా మారింది. సాక్ష్యాధారాలు ముఖ్యమంత్రి వద్దకు ఎలా చేరాయని సీబీఐ ఇప్పుడు బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలను ప్రశ్నించనుంది. వారు సమాధానం ఇవ్వకపోతే, సాక్ష్యాలు ఎలా సంపాదించాయో తెలుసుకోవడానికి సిబిఐ ముఖ్యమంత్రికి సమన్లు కూడా జారీ చేసే అవకాశం ఉంది.
 
'తెలంగాణలో బయటపడ్డ ఎమ్మెల్యేల ఎర కేసులో తాజాగా పరిణామాలతో సీఎం కేసీఆర్ ను కూడా సీబీఐ విచారించే అవకాశం లేకపోలేదు' అని సీబీఐమాజీ జేడీ లక్ష్మీనారాయణ పేర్కొన్నారు. చట్టం ముందు అందరూ సమానమేనని.. సీబీఐకి అనుమానం ఉంటే కేసీఆర్ ను కూడా ప్రశ్నించే అవకాశం లేకపోలేదని తన అభిప్రాయం వ్యక్తం చేశారు.  చట్టం ముందు ముఖ్యమంత్రి, ఎమ్మెల్యేలు ఎవరైనా ఒకటే అని పేర్కొన్న జేడీ.. అవసరమైతే కేసీఆర్ కు సైతం నోటీసులు ఇచ్చి విచారించే అవకాశం ఉందన్నారు. చట్టానికి లోబడి ఎవరైనా విచారణకు రావాల్సిందేనని సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ పేర్కొన్నారు.

తెలంగాణ హైకోర్టు కూడా కీలక తీర్పులో సీఎం కేసీఆర్ కు ఆధారాలు ఎక్కడి నుంచి వచ్చాయని ప్రశ్నించింది. కేసుకు సంబంధించిన ఆధారాలను, వీడియోలను సీఎంకు ఎవరిచ్చారో చెప్పాలని కోర్టు సిట్ అధికారులను ప్రశ్నించింది.

ఇక సిట్ దర్యాప్తు సరిగాలేదని..పేర్కొన్న హైకోర్టు ఈ కేసును సీబీఐకి అప్పగించడానికి 45 కారణాలను చూపించింది. ఇక సీబీఐ ఎంట్రీ ఇస్తే సీఎం కేసీఆర్ ను సైతం విచారించే అవకాశం ఉందని రాష్ట్రవ్యాప్తంగా చర్చ సాగుతోంది. ఈ చర్చకు బలం ఇస్తూ సీబీఐ మాజీ జేడీ కూడా ఇదే వాదన తెరపైకి తేవడం కేసీఆర్ సర్కార్ ను ఇరుకునపెట్టినట్టైంది. 



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News