ఇలా మీరెందుకు చేయకూడదు: జగన్‌ కు జేడీ లక్ష్మీనారాయణ కీలక సూచన!

Update: 2023-04-10 12:05 GMT
ఏపీలోనూ తమ ప్రభావాన్ని చూపించాలనుకుంటున్న కేసీఆర్‌ నేతృత్వంలోని భారత్‌ రాష్ట్ర సమితి (బీఆర్‌ఎస్‌) తన పని మొదలుపెట్టింది. ఇందులో భాగంగా విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ ను కేంద్రం ప్రైవేటీకరించడాన్ని నిరసిస్తూ ఇప్పటికే ఆ పార్టీ నేతలు ప్రకటన జారీ చేశారు.

తాజాగా విశాఖ ఉక్కు కర్మాగారం నిర్వహణకు మూలధనం/ముడిసరకుల కోసం నిధులు ఇచ్చి.. నిబంధనల మేరకు ఉక్కు ఉత్పత్తులను కొనేందుకు యాజమాన్యం నిర్వహిస్తున్న ఆసక్తి వ్యక్తీకరణ (ఎక్స్‌ప్రెషన్‌ ఆఫ్‌ ఇంట్రెస్ట్‌–ఈవోఐ) ప్రతిపాదనల బిడ్డింగ్‌లో తెలంగాణ ప్రభుత్వం పాల్గొననుంది. ఇందులో సింగరేణి తరఫున లేదా రాష్ట్ర ఖనిజాభివృద్ధి సంస్థ లేదా నీటిపారుదల శాఖ పాల్గొనే అవకాశం ఉంది. ఈ మేరకు తెలంగాణ కేసీఆర్‌ సంచలన నిర్ణయం తీసుకున్నారు.

ఈ నేపథ్యంలో సీబీఐ మాజీ జాయింట్‌ డైరెక్టర్, జనసేన పార్టీ మాజీ నేత లక్ష్మీనారాయణ స్పందించారు. 2019 ఎన్నికల్లో జనసేన తరఫున విశాఖ ఎంపీగా పోటీ చేసి లక్ష్మీనారాయణ ఓడిపోయిన సంగతి తెలిసిందే. అప్పటి నుంచి ఆయన విశాఖ కేంద్రంగానే రాజకీయాలు నడుపుతున్నారు. వచ్చే ఎన్నికల్లోనూ అక్కడి నుంచే పోటీ చేస్తానని ప్రకటించారు. ఈ నేపథ్యంలో విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ ప్రైవేటీకరణ ప్రతిపాదనలను ఆయన మొదటి నుంచి వ్యతిరేకిస్తూ వస్తున్నారు.

తాజాగా తెలంగాణ సీఎం కేసీఆర్‌ విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ ఆసక్తి వ్యక్తీకరణ బిడ్డింగ్‌ లో పాల్గొనాలని నిర్ణయించడంపై లక్ష్మీనారాయణ స్పందించారు. విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ ఆసక్తి వ్యక్తీకరణ ప్రక్రియలో పాల్గొనాలని నిర్ణయించినందుకు ఆయనకు కృతజ్ఞతలు తెలిపారు. ఏపీ సీఎం జగన్, సెయిల్‌ కూడా ఇదే విధంగా ఆసక్తి చూపుతాయని భావిస్తున్నానన్నారు. ఈ మేరకు లక్ష్మీనారాయణ ట్వీట్‌ చేశారు. ఈ ట్వీట్‌ ను తెలంగాణ మంత్రులు కేటీఆర్, హరీష్‌ రావు, ఏపీ సీఎం జగన్, సెయిల్‌ లకు ట్యాగ్‌ చేశారు.

ఇందుకు లక్ష్మీనారాయణ ఒక ఉదాహరణ చూపారు. కేరళ ప్రభుత్వం... సెంట్రల్‌ పిఎస్‌యు.. హిందుస్థాన్‌ న్యూస్‌ప్రింట్‌ లిమిటెడ్‌ ని కేరళ పేపర్‌ పొడక్ట్స్‌ లిమిటెడ్‌ గా మార్చిందని గుర్తు చేశారు. ఇందుకు రూ.146 కోట్లు వెచ్చిందని తెలిపారు.

అదేవిధంగా విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ ని పునరుద్ధరించడానికి స్టీల్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా లిమిటెడ్‌ (సెయిల్‌), ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలు, 15/4కి ముందు ఆసక్తి వ్యక్తీకరణలో పాల్గొనాలని సూచించారు. ఈ ట్వీట్‌ ను కూడా కేటీఆర్, హరీష్‌ రావు, ఏపీ సీఎం జగన్, సెయిల్‌ లకు ట్యాగ్‌ చేశారు.  

వైజాగ్‌ స్టీల్‌ ప్లాంట్‌ ముడి పదార్థాల సరఫరా, ప్లాంట్‌ నిర్వహణకు అవసరమైన ప్రైవేట్‌ కంపెనీల ప్రవేశాన్ని నిరోధించడానికి స్టీల్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా లిమిటెడ్, ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలు ఈ బిడ్డింగ్‌ లో పాల్గొనాలని లక్ష్మీనారాయణ సూచించారు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.

Similar News