టీ అసెంబ్లీలో సీను రివర్సవుతోందా..

Update: 2016-03-20 09:44 GMT
తెలంగాణ రాష్ట్రం ఏర్పడి టీఆరెస్ ప్రభుత్వం కొలువుదీరింది మొదలు ఆ పార్టీ హవాకు అడ్డే లేకుండాసాగుతోంది. తెలంగాణ అసెంబ్లీలో అయితే... అంతా టీఆరెస్ ఇష్టమన్నట్లుగా ఇంతకాలం వ్యవహారం సాగింది. కాంగ్రెస్ సీనియర్లలో కొందరు లోపాయికారీగా టీఆరెస్ తో అంటకాగుతుండడం.. మిగతావారు పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉండడం... యాక్టివ్ గా లేకపోవడంతో టీఆరెస్ కు అడ్డు లేకుండా పోయింది. అయితే... క్రమేపీ విపక్ష కాంగ్రెస్ వేగం పెంచుతోందనిపిస్తోంది. తెలుగు రాష్ట్రాలపై కాంగ్రెస్ అధిష్ఠానం దృష్టి పెట్టడంతో తెంలగాణలోని నేతలు కూడా తమ స్పీడు పెంచారు. ఇంతకాలం టీఆరెస్ కు వత్తాసు పలికిన జానారెడ్డి ఇప్పటికే కాంగ్రెస్ తరఫున జోరు పెంచగా తాజాగా మిగతా సీనియర్లు కూడా ఆయన బాటలోనే సాగుతున్నారు. ఆ క్రమంలోనే మాజీ మంత్రి జీవన్ రెడ్డి ఈ రోజు తెలంగాణ అసెంబ్లీలో పాత జీవనరెడ్డి కనిపించేలా చేశారు.

జీవన్ రెడ్డి విజృంభణతో తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ఒక్కసారిగా టర్ను తీసుకున్నాయి. పది రోజులుగా టీఆరెస్ ఆధిపత్యాన్నే చూస్తున్న తెలంగాణ అసెంబ్లీ తొలిసారి కాంగ్రెస్ డామినేషన్ ను చూసింది. దీంతో పాలక టీఆరెస్ లో కంగారు మొదలైంది. తెలంగాణ అసెంబ్లీ ఆదివారం వేడెక్కింది. మాజీ మంత్రి జీవన్ రెడ్డి మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి వద్దకు వెళ్లి ఆయన టేబుల్ పై ఉన్న ఫైళ్లను విసిరికొట్టారు. కరవుపై సభలో చర్చ జరుగుతున్నప్పుడు ఇది జరిగింది.

కరవు మండలాల విషయంలో కేసీఆర్ ద్వంద్వ వైఖరి పాటిస్తున్నారంటూ జీవన్ రెడ్డి విరుచుకుపడగా మంత్రి పోచారం ఆయన్ను అడ్డుకున్నారు. జీవన్ వి అన్నీ అబద్దాలేనంటూ ప్రత్యారోపణలు చేశారు. దీంతో ఆగ్రహించిన జీవన్ నేరుగా పోచారం సీటు వద్దకు వెళ్లి మీ ప్రభుత్వానివే అబద్ధాలు అంటూ అక్కడున్న పేపర్లు విసిరికొట్టారు. దీంతో కాంగ్రెస్ జోరు పెరుగుతోందని గుర్తించిన మంత్రి కేటీఆర్ జోక్యం చేసుకుని జీవన్ రెడ్డి క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. ఎంతో సీనియర్ అయిన జీవన్ రెడ్డి ఇలా చేస్తారనుకోలేదంటూ సెంటిమెంటు ప్రయోగించే ప్రయత్నం చేశారు. అయితే... ప్రభుత్వ తీరుకు నిరసనగా కాంగ్రెస్ శాసనసభాపక్ష నేత జానారెడ్డి వాకౌట్ చేస్తున్నట్లుగా ప్రకటించగానే కాంగ్రెస్ సభ్యులంతా వెళ్లిపోయారు.

కాగా తెలంగాణ కాంగ్రెస్ లో సీనియర్లు సీనులోకి రావడంతో టీఆరెస్ కంగారు పడుతున్నట్లుగా తెలుస్తోంది. కరీంనగర్ వంటి చైతన్యవంతమైన జిల్లాకు చెందిన సీనియర్ నేత జీవన్ రెడ్డి అసెంబ్లీలో చురుగ్గా వ్యవహరించడం మొదలుపెట్టడంతో టీఆరెస్ ఆలోచనలో పడింది. విషయం - ప్రజాభిమానం - అనుభవం - దూకుడు - వ్యూహం అన్నీ ఉన్న అలాంటి నేతలు ప్రభుత్వంపై విరుచుకుపడితే వారిని ఎదుర్కొనడం కష్టమని భావిస్తున్నారు. మొత్తానికి జానా - జీవన్ లు ఇప్పటికే స్పీడు పెంచగా... మిగతా సీనియర్లూ ఆ జోరు అందుకుంటే టీఆరెస్ కు ఇబ్బంది తప్పదు.
Tags:    

Similar News