ఆ ముచ్చట కోసం ఏకంగా 1150 కోట్లు వెచ్చించిన విలాస పురుషుడు

Update: 2020-02-17 01:30 GMT
విలాస పురుషుడుగా పేరొందిన ఈకామర్స్‌ దిగ్గజం అమెజాన్ వ్యవస్థాపకుడు జెఫ్‌ బెజోస్‌.. గత కొంతకాలంగా తన జల్సాల కోసం భారీ మొత్తం ఖర్చు చేస్తున్నాడు. 2019లో భార్య మెకంజీ బెజోస్‌తో విడాకులు తీసుకున్న ఆయన.. ప్రస్తుతం తన గర్ల్‌ ఫ్రెండ్‌ లౌరెన్‌ సాంచెజ్‌ తో తిరుగుతూ ఖరీదైన విలాసాలకు పోతున్నాడు. ఇటీవలే అమెజాన్‌లో 400 కోట్ల డాలర్ల విలువైన షేర్లను నగదుగా మార్చుకున్న ఆయన పెద్ద మొత్తంలో సొమ్ము ఖర్చు చేస్తుండటం హాట్ ఇష్యూగా మారింది. 

గర్ల్‌ ఫ్రెండ్‌ తో కలిసి కొత్త జీవితాన్ని ఆస్వాదించేందుకే ఆయన భారీ కొనుగోళ్లకు మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది. తాజాగా ఆయన.. తన ముచ్చట తీర్చుకోవడానికి ఏకంగా 1150 కోట్లు వెచ్చించడం ఆశ్చర్యం కలిగిస్తోంది. బెవర్లీ హిల్స్‌ లో అత్యంత విలాసవంతమైన భవనాన్ని ఏకంగా 165 మిలియన్‌ డాలర్లు (1150 కోట్లు) పెట్టి కొనుగోలు చేశాడు ఈ సంపన్నుడు. లాస్‌ ఏంజెల్స్‌ పరిసర ప్రాంతాల్లో ఓ భవనం కోసం ఇంత భారీ మొత్తం వెచ్చించడం గతంలో ఎప్పుడూ చూడలేదని అక్కడి వాణిజ్య విశ్లేషకులు అంటున్నారు.
 
1930 దశకంలో హాలీవుడ్ ఫిల్మ్ 'టైటాన్ జాక్ వార్నర్' కోసం రూపొందించిన ఈ భవనాన్ని 1992లో ఆర్కిటెక్చరల్ డైజెస్ట్ "ఆర్కిటిపాల్ స్టూడియో మొగల్ ఎస్టేట్"గా అభివర్ణించింది.  జార్జియన్ శైలిలో విస్తారమైన టెర్రేస్‌ లతో పాటు భారీ గోల్ప్‌ కోర్స్‌ ఈ భవనంలోని ప్రత్యేక ఆకర్షణలు. దీంతో పాటు ఇప్పటికే వాష్టింగ్టన్‌ డీసీ లాంటి అమెరికన్‌ తీర ప్రాంతాల్లో జెఫ్‌ బెజోస్‌ కు మరికొన్ని విలాసవంతమైన భవనాలున్నాయి. ఈ విలాస పురుషుడి ఖర్చులు చూసి సగటు మనిషి నివ్వెరపోతున్నాడు.




Tags:    

Similar News