జియో ఎంత‌మంది క‌డుపు కొట్టిందో తెలుసా?

Update: 2017-11-15 10:46 GMT
రికార్డుల‌న్నీ చెరిగిపోయేలా చేయ‌ట‌మే కాదు.. స‌మీప భ‌విష్య‌త్తులో టెలికాం రంగంలోకి ఎవ‌రూ అడుగు పెట్టేందుకు సైతం సాహ‌సం చేయ‌ని రీతిలో వ్య‌వ‌హ‌రించింది రిల‌య‌న్స్ జియో. విన్నంత‌నే.. చేస్తున్న ప‌నిని ప‌క్క‌న పెట్టేసి మ‌రీ జియో సిమ్ కొనాల‌న్న‌ట్లుగా చేసిన ముకేశ్ అంబానీ పుణ్య‌మా అని టెలికం ప‌రిశ్ర‌మ‌లో భారీ విధ్వంస‌మే సృష్టించింద‌ని చెబుతున్నారు. జియో ఎఫెక్ట్ తో వేలాది మంది ఉద్యోగుల క‌డుపు కొట్టిన షాకింగ్ నిజం తాజాగా బ‌య‌ట‌కు వ‌చ్చింది.

ఒక ప్ర‌ముఖ మీడియా సంస్థ‌కు చెందిన  నివేదిక‌తో పాటు.. సెంట‌ర్ ఫ‌ర్ మానిట‌రింగ్ ఇండియ‌న్ క‌మిటీ అందించిన స‌మాచారాన్ని క‌లిపి చూస్తే షాకింగ్ అంశాలు బ‌య‌ట‌కు వ‌స్తాయి.  టెలికం రంగంలో ప‌లు సంచ‌నాల‌కు తెర తీయ‌ట‌మే కాదు.. ప్ర‌తిఒక్క‌రూ జియో సిమ్ కొనేలా చేయ‌టంలో స‌క్సెస్ అయ్యింది జియో.

జియో ఇచ్చిన పోటీ దెబ్బ‌కు ప‌లు టెలికాం సంస్థ‌లు తీవ్ర ఆర్థిక సంక్షోభంలో చిక్కుకుపోయాయి. అంతేకాదు.. జియో కార‌ణంగా త‌మ‌కు జ‌రిగిన ఆర్థిక న‌ష్టాన్ని స‌రి చేసుకునేందుకు వీలుగా ప‌లు టెలికం సంస్థ‌లు త‌మ వ‌ద్ద‌నున్న ఉద్యోగుల్ని భారీగా తీసేసింది. గ‌త ఏడాది 3 ల‌క్ష‌ల‌కు పైగా ఉద్యోగులు వివిధ టెలికాం కంపెనీలు నియ‌మించుకోగా.. జియో ఎంట్రీ త‌ర్వాత తగ్గిన తమ ఆదాయం నేప‌థ్యంలో దాదాపుగా 75 వేల ఉద్యోగాల్ని త‌గ్గించుకున్నారు.

దీంతో.. టెలికాం రంగంలో ఉద్యోగుల సంఖ్య 2.25 ల‌క్ష‌ల‌కు ప‌డిపోయింది. టెలికాం మార్కెట్లో పోటీ తీవ్రంగా ఉండ‌టం.. రానున్న రోజుల్లో మ‌రింత సంక్షోభంలో కూరుకుపోనున్న‌ట్లుగా చెబుతున్నారు. ఇప్ప‌టికే ఖాళీ అయిన ఉద్యోగాల్ని భ‌ర్తీ చేసే ఆలోచ‌న‌లో టెలికం కంపెనీలు లేవ‌ని.. ఉన్న ఉద్యోగుల్ని సైతం త‌గ్గించే వ్యూహాల్ని కంపెనీలు ఆలోచిస్తున్న‌ట్లు తెలుస్తోంది.

టెలికాం రంగంలో చోటు చేసుకున్న జియో విధ్వంసాన్ని గుర్తించిన మిడిల్ మేనేజ్ మెంట్ వారు కంపెనీల‌ను వ‌దిలి వెళ్లిపోతున్నారుట‌. ఇదిలా ఉంటే జియో పుణ్య‌మా అని టెలికం కంపెనీల ఆదాయం మీద కూడా ప్ర‌భావం ప‌డిన‌ట్లుగా చెబుతున్నారు. జియో పెట్టిన చౌక ఆఫ‌ర్ల‌తో టెలికం రంగం రూ.5లక్ష‌ల కోట్ల అప్పుల్లో కూరుకుపోయింది.దీంతో దిగ్గ‌జ కంపెనీల‌న్నీ ఆర్థిక ఇబ్బందుల‌తో ఉక్కిరిబిక్కిరి అవుతున్నాయి.  జియో ఎఫెక్ట్ ముకేశ్ సోద‌రుడు అనిల్ అంబానీకి తాకింది. ఆయ‌న నిర్వ‌హిస్తున్న రిల‌య‌న్స్ క‌మ్యూనికేష‌న్స్ త‌న వైర్ లెస్ సేవ‌ల‌కు స్వ‌స్తి ప‌లికింది. అదే స‌మ‌యంలో ఐడియా.. వొడాఫోన్‌.. ఎయిర్ టెల్ సంస్థ‌లు త‌మ ట‌వ‌ర్ల వ్యాపారాన్ని అమ్మేసుకోవ‌టం మొద‌లైంది. రానున్న రోజుల్లో టెలికాం రంగం మ‌రింత గ‌డ్డు ప‌రిస్థితి ఎదుర్కొనే అవ‌కాశం ఉంద‌ని చెబుతున్నారు. 
Tags:    

Similar News