బీజేపీ నేతలు: నిన్న కౌంటర్లు.. నేడు కౌగిలింతలు!

Update: 2023-07-04 15:10 GMT
అసెంబ్లీ ఎన్నికల ముందు తెలంగాణ బీజేపీలో అనూహ్య మార్పులు చోటుచేసుకుంటున్న సంగతి తెలిసిందే. తెలంగాణలో బండి సంజయ్‌ ను మారుస్తారని.. ఆ పదవిని ఈటెల రాజేందర్‌ కు ఇస్తారని వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో తెలంగాణలో బండి సంజయ్‌ నాయకత్వాన్ని వద్దనేవారికి దున్నపోతు ట్రీట్మెంట్‌ ఇవ్వాలంటూ మాజీ ఎంపీ జితేందర్‌ రెడ్డి ట్విట్టర్‌ లో షేర్‌ చేసిన వీడియో కలకలం రేపిన సంగతి తెలిసిందే.

దీనిపై ఈటెల రాజేందర్‌ కౌంటర్‌ ఇచ్చారు. వయస్సు అనుభవం ఉన్న నేతలు ఏది పడితే అది మాట్లాడవద్దని సూచించారు. ఎవరి గౌరవానికి భంగం కలగకుండా చూసుకోవాలన్నారు. ఇతరుల స్వేచ్ఛ, గౌరవం తగ్గించకూడదు అంటూ సుతిమెత్తని హెచ్చరికలు జారీ చేశారు.

అయితే జితేందర్‌ రెడ్డి ఈ ట్వీట్‌ చేసిన ఒక్క రోజులోనే తన ఫామ్‌ హౌస్‌ కు ఈటెల రాజేందర్‌ ను ఆహ్వానించారు. ఈ సమావేశంలో హరియాణా గవర్నర్‌ బండారు దత్తాత్రేయ, విజయశాంతి తదితర నేతలు కూడా పాల్గొన్నారు. తామంతా ఒకటేనని.. తమ మధ్య ఎలాంటి విభేదాలు లేవన్నారు. ఈటెల మంత్రిగా ఉన్నప్పుడు ఢిల్లీ వస్తే తన ఇంట్లోనే ఉండేవారని జితేందర్‌ రెడ్డి గుర్తు చేసుకున్నారు. ఆయన మరింత స్థాయికి వెళ్తే సంతోషించేవారిలో తాను కూడా ఉంటానని జితేందర్‌ రెడ్డి తెలిపారు.

కాగా తాను చేసిన ట్వీట్‌పై తాజాగా జితేందర్‌ రెడ్డి మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇందుకు సంబంధించి ఆయన ఒక వీడియో విడుదల చేశారు. ఆ ట్వీట్‌ పై ఇక తాను స్పందించనని తెలిపారు. ఎవరికి నచ్చినట్లు వారు అర్థం చేసుకోవచ్చునని చెప్పారు.

తాను చేసిన ట్వీట్‌ చూసిన తెలంగాణ కాంగ్రెస్‌ అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డి తనకు ఫోన్‌ చేశారని జితేందర్‌ రెడ్డి తెలిపారు.  మీది మంచి కవి హృదయం అని పొగిడారని అన్నారు. ట్విట్టర్‌లో మీ కళా రూపాన్ని ప్రదర్శించావ్‌ అని మెచ్చుకున్నారని వెల్లడించారు.

రేవంత్‌ తనపైన ఎలాంటి ఆరోపణలు చేయలేదని జితేందర్‌ రెడ్డి తెలిపారు. కేవలం తనకు ఫోన్‌ చేసి తాను చేసిన ట్వీట్‌ ను మెచ్చుకున్నారన్నారు. మీరు చాలా మంచి రైటర్‌ అని రేవంత్‌ తనతో అన్నారని వెల్లడించారు. తాను చేసిన ట్వీట్‌ పై ప్రెస్‌ మీట్‌ పెట్టి చెప్పడం అంటూ ఏమీ ఉండదన్నారు. మొత్తానికి తెలంగాణలో బీజేపీ నేతల మధ్య కౌంటర్లు, కౌగిలింతలు చోటు చేసుకుంటున్నాయి.

Similar News