కాపుల హీరో గా జోగయ్య... మరి ముద్రగడ ...?

Update: 2023-02-07 16:26 GMT
ఏపీలో బలమైన కాపు సామాజికవర్గాన్ని తమ వైపు తిప్పుకోవడానికి అన్ని రాజకీయ పార్టీలు ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాయి. వారి ఓట్ల కోసం ఎవరి ఎత్తులు వారు వేస్తూనే ఉన్నారు. ఇక కాపులకు సంబంధించి వారి సామాజికవర్గంలో ప్రముఖ నాయకులు ఉన్నారు. వారిని మచ్చిక చేసుకునే పనిలో కూడా రాజకీయ పార్టీలు ఉన్నాయి.

ఇదిలా ఉంటే  కాపుల సంక్షేమ కోసం పాటుపడిన నేతలు ఆ సామాజికవర్గంలో మన్ననలు అందుకున్నారు. అలా వంగవీటి మోహన రంగా తరువాత ముద్రగడ పద్మనాభం కాపుల సంక్షేమం కోసం గట్టిగానే ప్రయత్నాలు చేస్తూ వచారు. అదే విధంగా వృద్ధ నాయకుడు, మాజీ మంత్రి హరి రామజోగయ్య కాపుల పక్షాన ప్రస్తుతం గట్టిగా పోరాడుతున్నారు.

ఒక విధంగా చూస్తే తెలుగుదేశం ప్రభుత్వం 2014లో ఏర్పాటు అయిన నాటి నుంచి ముద్రగడ పద్మనాభం కాపుల రిజర్వేషన్ల కోసం ఉద్యమిస్తూ వచ్చారు. అది ఎంతవరకూ వెళ్ళిందంటే తునిలో రైలు తగులబెట్టిన అవాంచనీయ సంఘటన కూడా జరిగింది. ఇక ముద్రగడ ఉద్యమాలు ర్యాలీలతో ఆందోళన పెంచారు. దాంతో ఆయన్ని అరెస్ట్ చేశారు. మొత్తానికి ముద్రగడ వర్సెస్ చంద్రబాబు అన్నంతగా నాడు కాపు నాడు ఉద్యమం సాగింది.

అయితే వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ముద్రగడ తగ్గారు అన్న ఆరోపణలు వచ్చాయి. ఒక దశలో ఆయన తాను కాపు నాడు ఉద్యమం నుంచి తప్పుకుంటున్నాను అని చెప్పారు. ఇక కేంద్రం ఆర్ధికంగా వెనకబడిన వారికి పది శాతం ఈబీసీ రిజర్వేషన్లు ఇచ్చింది. అందులో అయిదు శాతం కాపుల కోసం నాటి సీఎం చంద్రబాబు ఇచ్చారు. అయితే అది ఆచరణకు రాకముందే ఆయన దిగిపోయారు.

ఇక జగన్ అయితే కాపులను బీసీలలో చేర్చడం జరగదు అని చెప్పారు. అయితే ఆయన ఆ తరువాత అధికారంలోకి వచ్చినా కాపుల కోసం పెద్దగా తీసుకున్న చర్యలు లేవని కాపు నాడు నేతలు విమర్శిస్తూ ఉంటారు. ఈ నేపధ్యంలో కాపుల కోసం అన్నట్లుగా హరి రామజోగయ్య యాక్టివ్ అయ్యారు. ఆయన జనసేనకు అనుకూలంగా ఉన్నారు. అదే టైం లో పవన్ ఆయన్ని చాలా సార్లు కలసి వచ్చారు ఇక హరిరామజోగయ్య కాపులకు ఈబీసీ రిజర్వేషన్లలో అయిదు శాతం కేటాయించాలని కోరుతూ ఆ మధ్యన అమరణ దీక్ష చేపడతాను అని ప్రకటించారు. కానీ ఆయనని పోలీసులు అరెస్ట్ చేశారు.

ఇక ఆయన లేటెస్ట్ గా హై కోర్టులో కాపు రిజర్వేషన్ల మీద తేల్చుకోవడానికి కేసు వేశారు. దీని మీద ప్రభుత్వాన్ని అఫిడవిట్ దాఖలు చేయమని కోర్టు కోరింది. ఈ విషయంలో పట్టుదలగా ఉన్న హరిరామజోగయ్య తన ప్రాణం పోయేలోగా కాపులకు రిజర్వేషన్లు సాధిస్తాను అని అంటున్నారు. మరో వైపు చూస్తే ఆయన కాపు సమాజికవర్గాన్ని జనసేన వైపుగా నడిపిస్తున్నారు అని అంటున్నారు.

ఆయన గౌరవ అధ్యక్షుడిగ ఉన్న కాపు సేన ఏపీ అంతటా గ్రామ గ్రామాన యూనిట్లుగా విస్తరించింది. ఈ నేపధ్యంలో పవన్ కి యాంటీగా ఎవరు మాట్లాడినా ఆయన గట్టిగానే తగులుకుంటున్నారు. ఇక వైసీపీ యువ మంత్రి గుడివాడ అమరనాధ్ ని ఆయన రాజకీయ బచ్చా అనేశారు. కాపు నాడు తరఫున ఆయన హెచ్చరించినట్లుగా చెబుతున్నారు.

ఇదిలా ఉంటే గతంలో ముద్రగడ కాపులకు పెద్ద దిక్కుగా ఉండేవారు ఇపుడు హరిరామ జోగయ్య సీన్ లోకి వచ్చారు. ముద్రగడ క్రమంగా మౌనంతో వెనకబడ్డారు. ఆయన ఈ మధ్య రెండు సార్లు కాపులకు ఈబీసీ రిజర్వేషన్లు ఇవ్వాలని కోరుతూ జగన్ కి లేఖ కూడా రాశారు. అయినా ఫలితం లేకపోయింది.మరి రేపటి రోజున గోదావరి జిల్లాలతో పాటుగా ఏపీలో కాపులను ప్రభావితం చేసే నాయకుడు ఎవరు అంటే హరి రామజోగయ్య ముందు వరసలోకి వస్తున్నారు అని అంటున్నారు.

వయోభారం వల్ల ఆయన ప్రత్యక్ష ఉద్యమాలు చేయలేకపోయినా ఆయన మాత్రం కాపుల విషయంలో తన ఫైట్ ని సాగిస్తున్నారు. అదే సమయంలో ముద్రగడ మౌనమే నా భాష అంటున్నరు. ఈ విధంగా చూస్తే కాపులకు జోగయ్య ముద్రగడలో ఇపుడు ఎవరు అసలైన హీరో అంటే జోగయ్య ముందుకు వస్తున్నారా అన్న చర్చ అయితే సాగుతోంది అని చెప్పాలి.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.

Similar News