అత్తల‌కు స్వాతంత్ర్యం తెచ్చిన పింఛ‌న్లు

Update: 2017-11-09 10:52 GMT
మార్కుల పిచ్చి ఇప్ప‌టి విద్యార్థుల త‌ల్లిదండ్రుల‌కే కాదు.. రాజ‌కీయ‌నాయ‌కుల‌కు కూడా బాగానే ఎక్కేసిన‌ట్లుంది. గ‌తంలో త‌మ‌కు వ‌చ్చే నివేదిక‌లు.. వారి ప‌ని తీరుపై వ‌చ్చే ఫీడ్ బ్యాక్ ఆధారంగా నేత‌ల ప‌నితీరును మ‌దింపు చేసేవారు అధినేత‌లు. ప‌రిస్థితి ఇప్పుడు మారిపోయింది. అందుబాటులోకి వ‌చ్చిన సాంకేతిక‌త‌తో పాటు.. కార్పొరేట్ స్టైల్లో నేత‌ల ప‌నితీరును మార్కుల్లో చూడ‌టం.. వారి ఇమేజ్ ను శాతాల్లో కొల‌వ‌టం.. గెలుపు ఓట‌ముల్ని ర్యాంకుల‌తో డిసైడ్ చేసే కొత్త అల‌వాటు ఈ మ‌ధ్య ఎక్కువ అవుతోంది.

అధికారంలోకి వ‌చ్చినోళ్లు దాన్ని కాపాడుకోవ‌టానికి మార్కులు.. ర్యాంకులు అంటూ నేత‌ల వెంట ప‌డుతుంటే.. విప‌క్షంలో ఉన్నోళ్లు.. ప‌వ‌ర్ కోసం ప‌డుతున్న ప్ర‌యాస అంతా ఇంతా కాదు. ఇందులో భాగంగా గెలుపు గుర్రాల్ని గుర్తించేందుకు విప‌క్ష అధినేత‌లు సైతం ర్యాంకులు.. మార్కుల లెక్క‌ల్లో మునిగిపోయారు. తెలుగు రాజ‌కీయాల వ‌ర‌కూ చూస్తే.. ఈ మార్కుల గోల ఏపీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబుకు ఎక్కువ‌.

ప్ర‌తిదీ ఆయ‌న అంకెల్లో కొలుస్తుంటారు. ప్ర‌జాప్ర‌తినిధుల ప‌ని తీరును అంకెల్లో తెలుసుకొని వారికి క్లాస్ పీకుతుంటారు. దీంతో బాబు మార్కుల దెబ్బ‌కు ఎమ్మెల్యేలు విల‌విల‌లాడిపోతున్నారు. తామెంత పని చేసినా.. ప‌డుతున్న మార్కులు అర‌కొర‌గా ఉన్నాయ‌ని.. మ‌రీ అంత క‌ఠినంగా మార్కులు వేయొద్దంటూ అభ్య‌ర్థిస్తున్న వైనం ఇప్పుడు పార్టీలో ఆస‌క్తిక‌ర చ‌ర్చ‌గా మారింది. ర్యాంకుల‌పై కొంద‌రు నేత‌లు బాబుతో డైరెక్ట్ గానే త‌మ‌కున్న అభ్యంత‌రాల్ని వ్య‌క్తం చేస్తున్నారు కూడా.

ఫారిన్ టూర్ ముగించుకొచ్చిన నేప‌థ్యంలో పార్టీ ఎమ్మెల్యేలు.. ఇన్ చార్జ్ లతో ఒక స‌మ‌న్వ‌య క‌మిటీ స‌మావేశాన్ని నిర్వ‌హించారు. దీనికి మంత్రుల‌తో వీడియో కాన్ఫ‌రెన్స్ లో మాట్లాడారు. ఈ సంద‌ర్భంగా ఎమ్మెల్యేల గ్రేడ్ ల‌ను చ‌దివి వినిపించారు. ఈ సంద‌ర్భంగా తెలుగు త‌మ్ముళ్ల‌కు.. చంద్ర‌బాబుకు మ‌ధ్య ఆస‌క్తిక‌ర సంభాష‌ణ జ‌రిగిన‌ట్లుగా తెలుస్తోంది.

బాబు నోట గ్రేడ్లు వ‌స్తున్న వేళ‌.. కొంత‌మంది ఎమ్మెల్యేలు తాము ఎంత‌గా క‌ష్ట‌ప‌డినా ఫ‌లితం ఉండ‌టం లేద‌ని వ్యాఖ్యానించిన‌ట్లుగా స‌మాచారం. గుంటూరు ప‌శ్చిమ ఎమ్మెల్యే వేణుగోపాల్ రెడ్డికి మంచి గ్రేడ్ రాక‌పోవ‌టంపై సీఎం చంద్ర‌బాబు స్పందించి.. ఆకారం పెర‌గ‌టంతో తిర‌గ‌లేక‌పోతున్నావా వేణు అంటూ న‌వ్వుతూ ప్ర‌శ్నించారు. దీనికి స్పందించిన ఆయ‌న‌.. తాను ఇంట్లో నుంచి ట్యాబ్‌ కు స‌మాచారం పంప‌టం లేద‌ని.. ఇంటింటికి తిరుగుతున్న‌ట్లుగా వెల్ల‌డించారు. అంతేకాదు.. గ‌తంలో కోడ‌ళ్లు ఏం చెబితే అది అత్త‌లు చేసేవార‌ని.. ఇప్పుడు మాత్రం ప్ర‌భుత్వం ఇస్తున్న పెన్ష‌న్ల కార‌ణంగా అత్త‌లు కోడ‌ళ్ల మాట విన‌టం లేద‌ని చెప్ప‌టంతో అంద‌రూ న‌వ్వేశారట‌.

ఇలా న‌వ్వులే కాదు కాస్త సీరియ‌స్ గానూ స‌మావేశం సాగిన‌ట్లుగా చెబుతున్నారు. నెల్లూరు జిల్లాకు చెందిన ఒక ఎమ్మెల్యే త‌న‌కు గ్రేడ్ త‌క్కువ రావ‌టంపై సీరియ‌స్ అయ్యారు. తాను విప‌రీతంగా ఇంటింటికి తిరుగుతున్నా త‌క్కువ గ్రేడ్ రావ‌టం ఏమిటంటూ ఆవేశంగా ప్ర‌శ్నించిన‌ప్ప‌టికీ.. స‌ద‌రు నేత అడిగిన తీరుకు న‌వ్వేసిన చంద్ర‌బాబు.. స‌ర్ది చెప్పార‌ట‌.
Tags:    

Similar News