టీడీపీ ఆవిర్భావ వేడుక‌లో జేపీ నడ్డా.. సంకేతాలేంటి?

Update: 2023-03-29 15:20 GMT
రాజ‌కీయాల్లో ఎప్పుడు ఎలాంటి మార్పులు చోటు చేసుకుంటాయో చెప్ప‌డం క‌ష్టం. రాజ‌కీయాల్లో ఎవ‌రూ ఎవ‌రికీ శాశ్వ‌త శ‌త్రువులు కారు. అలానే.. ఇప్పుడు ఏపీ ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం టీడీపీతోనూ బీజేపీ త‌న వైఖ‌రి మార్చుకున్న సంకేతాలు క‌నిపిస్తున్నాయి. నిన్న మొన్న‌టి వ‌ర‌కు దూరంగా ఉన్న బీజేపీ.. ఇప్పుడు టీడీపీకి చేరువ‌వుతున్న ప‌రిస్థితి క‌నిపిస్తోంది. తాజాగా టీడీపీ ఆవిర్భావ వేడుక‌ల‌కు బీజేపీ జాతీయ అధ్య‌క్షుడు జేపీ న‌డ్డా హాజ‌రు కావ‌డం.. రాజ‌కీయంగా సంచ‌ల‌నం అయింది.

పార్ల‌మెంటు సెంట్ర‌ల్ హాల్లోని ఎన్టీఆర్ విగ్ర‌హం వ‌ద్ద‌.. టీడీపీ ఎంపీలు.. గ‌ల్లా జ‌య‌దేవ్‌, కేశినేని నాని, క‌న‌క మేడ‌ల రవీంద్ర కుమార్ లు టీడీపీ ఆవిర్భావ దినోత్స‌వాన్ని పుర‌స్క‌రించుకుని నివాళుల‌ర్పించారు. విగ్ర‌హానికిపూల‌మాల‌లు వేసి.. ఆయ‌న‌ను స్మ‌రించుకున్నారు. ఈ స‌మ‌యంలో న‌డ్డా కూడా.. ఈ కార్య‌క్ర‌మానికి హాజ‌రు కావ‌డం.. చ‌ర్చ‌కు దారితీసింది.

టీడీపీ 41వ  ఆవిర్భావ దినోత్స‌వాన్ని పుర‌స్క‌రించుకుని ఎంపీ.. కేక్ క‌ట్ చేశారు. ఈ సంద‌ర్భంగా స‌హ‌చ‌ర ఎంపీల‌కు కూడా.. కేకుల‌ను పంచిపెట్టారు. ఈ క్ర‌మంలో అటుగా వ‌చ్చిన జేపీ న‌డ్డా.. ఎన్టీఆర్‌కు నివాళుల ర్పించి.. టీడీపీ నేత‌ల‌కు అభినంద‌న‌లు తెలిపారు. ఈ సంద‌ర్భంగా క‌న‌క‌మేడ‌ల‌.. ఎన్టీఆర్ గురించి.. టీడీపీ గురించి.. న‌డ్డాకు వివ‌రించారు. అదేవిధంగా టీడీపీకి, బీజేపీకి మ‌ధ్య ఉన్న సాన్నిహిత్యాన్ని, అటల్ బిహారీ వాజ‌పేయితో ఉన్నఅనుబంధాన్ని కూడా వివ‌రించారు.  

ఈ సంద‌ర్భంగా .. న‌డ్డా కూడా సంతోషం వ్య‌క్తం చేశార‌ని.. ఎన్టీఆర్ హ‌యాంలో బీజేపీతో ఉన్న అనుబంధాన్నిఆయ‌న గుర్తు చేసుకున్నార‌ని పార్టీ వ‌ర్గాలు తెలిపాయి. అనంత‌రం.. టీడీపీ ఎంపీల‌తో క‌లిసి న‌డ్డా పొటోలు సైతం దిగారు.  ``ఇది సానుకూల ప‌రిణామం. ఏపీలో టీడీపీతో పొత్తు పెట్టుకునేందుకు బీజేపీ అనుకూలంగానే వ్య‌వ‌హ‌రిస్తుందని అనుకుంటున్నాం`` అని టీడీపీ నాయ‌కులు పేర్కొన్నారు.  


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.

Similar News