కేసీఆర్ అడ్డాలో జేపీ నడ్డాకు షాక్

Update: 2022-01-04 14:30 GMT
తెలంగాణ రాజకీయాల్లో జీవో నెంబరు 371 పెను దుమారం రేపుతోన్న సంగతి తెలిసిందే. ఆ జీవోకు వ్యతిరేకంగా కరీంనగర్ ఎంపీ, తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ చేపట్టిన జాగరణ దీక్షకు పోలీసులు అనుమతివ్వని సంగతి తెలిసిందే. అయితే, అనుమతి లేకున్నా దీక్షకు దిగిన బండి సంజయ్ ను పోలీసులు అరెస్టు చేశారు. కోవిడ్ నిబంధనల ఉల్లంఘన కేసు పెట్టడంతో...సంజయ్‌కు 14 రోజుల రిమాండ్ విధించారు.

దీంతో, బండి సంజయ్‌ను పోలీసులు అక్రమంగా అరెస్టు చేశారంటూ తెలంగాణ బీజేపీ రాష్ట్ర వ్యాప్త నిరసనలకు పిలుపునిచ్చింది. ఈ క్రమంలోనే తాజాగా నేడు సాయంత్రం హైదరాబాద్‌లోని ఎల్బీ స్టేడియం సమీపంలో క్యాండిల్ ర్యాలీ చేపట్టాలని బీజేపీ పెద్దలు నిర్ణయించారు. ఈ ర్యాలీకి బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా హాజరుకానున్నారు. ఈ నేపథ్యంలో నడ్డాకు హైదరాబాద్ పోలీసులు షాకిచ్చారు. జేపీ నడ్డా ర్యాలీకి అనుమతి లేదని స్పష్టం చేశారు.

జేపీ నడ్డా ర్యాలీకి అనుమతి నిరాకరించామని నార్త్ జోన్ డీసీపీ చందన దీప్తి వెల్లడించారు. కోవిడ్ నిబంధనలను అందరూ పాటించాలని చందన అన్నారు. ఈ నెల 10వరకు తెలంగాణలో ర్యాలీలు, ధర్నాలకు అనుమతి లేదన్నారు. జేపీ నడ్డా పాల్గొనే క్యాండిల్ ర్యాలీని కూడా అడ్డుకుంటామని తెలపారు. అయితే, ఎలాగైనా సరే ర్యాలీ నిర్వహించి తీరతామని బీజేపీ నేతలు చెబుతున్నారు.

అంతకుముందు, కేసీఆర్‌ ఆదేశాలతోనే బీజేపీ నేతలపై పోలీసులు హింసకు పాల్పడ్డారని నడ్డా ఆరోపించారు. టీచర్ల ఆందోళనకు సంజయ్ సంఘీభావం తెలిపారని, కోవిడ్ నిబంధనలు పాటిస్తూ శాంతియుతంగా చేస్తున్న దీక్షకు కేసీఆర్‌ ప్రభుత్వం భయపడిందని ఆరోపించారు.'వినాశకాలే విపరీతబుద్ధి'అన్న రీతిలో కేసీఆర్‌ తీరు ఉందని ఆరోపించారు. ఈ నేపథ్యంలోనే తాజాగా నేడు కేసీఆర్ అడ్డాలో జేపీ నడ్డా హవా సాగుతుందా లేదా...ర్యాలీ జరుగుతుందా లేదా అన్నదానిపై సర్వత్రా ఉత్కంఠ ఏర్పడింది.
Tags:    

Similar News