టీడీపీకి నియర్ కాదు... జూనియర్ దూరమే... ?

Update: 2022-12-21 03:30 GMT
జూనియర్ ఎన్టీయార్ తెలుగుదేశం పార్టీ ప్రచారానికి వస్తారు అంటూ ఈ మధ్యనే ఆయన సోదరుడు తారకరత్న సంచలన ప్రకటన చేసారు. తమ్ముడు నందమూరి బ్లడ్. కాబట్టి ఆయన కూడా తప్పకుండా పార్టీ జెండా ఎత్తుకుంటారు. సరైన సమయంలో జూనియర్ టీడీపీ ఎన్నికల ప్రచారానికి వస్తారు అని తారకరత్న రత్నం లాంటి మాట చెప్పారు అని తమ్ముళ్ళు సంబరపడుతున్నారు. అయితే తారకరత్న చెప్పడం బాగానే ఉంది కానీ ఆయన చెప్పినట్లు జరుగుతుందా అంటే ఆచరణలో చూస్తే అది అసలు జరిగే వీలు లేదు అని అంటున్నారు.

ఎందుకంటే జూనియర్  ఎన్టీయార్  ఇపుడు పాన్ ఇండియా స్టార్ అయ్యారు. ట్రిపుల్ ఆర్ తో అదిరిపోయే హిట్ కొట్టారు. ఆ టెంపోని కంటిన్యూ చేయడానికి వరసబెట్టి సినిమాలు ప్లాన్స్ చేసుకున్నారు. అవన్నీ కూడా రానున్న ఏడాది రెండేళ్ళలో క్యూ కట్టి ఉన్నాయి. దాంతో ఎన్టీయార్ 2024 ఎన్నికల సమయానికి తీరిక లేనంత బిజీగా ఉంటారు అని అంటున్నారు. ఇంకా చెప్పాలీ అంటే ఆయన ఆ టైం లో ఏపీలో కూడా ఉండే అవకాశాలు తక్కువ అని చెబుతున్నారు. ఏ విదేశాల్లో షూటింగ్ హడావుడితో జూనియర్ ఉంటాడని అంటున్నారు.

ఇది ఆయన సినిమాకు సంబంధించిన వ్యవహారం అయితే ఇక రాజకీయంగా చూస్తే జూనియర్ కి పాలిటిక్స్ కి దూరం చాలా ఉంది. ఆయన పట్టుమని పాతికేళ్ళ వయసు లేని రోజుల్లో తెలిసో తెలియకో టీడీపీకి 2009 ఎన్నికల ప్రచారం చేశారు. ఆనాడు ఆయన తండ్రి హరిక్రిష్ణ రాజ్యసభ మెంబర్ గా ఉన్నారు. నందమూరి ఫ్యామిలీ అంతా ఒక్కటి అని చెప్పి అందరూ కలసి ప్రచారం చేశారు. అయితే ఆ తరువాత జరిగిన పరిణామాలతోనే జూనియర్ రాజకీయాల పట్ల విరక్తి పెంచుకున్నారు అని అంటున్నారు.

ఆయన్ని వాడుకుని కావాలని దూరం పెట్టారన్న ఆవేదన ఆయనలో ఉంది అని చెబుతున్నారు. ఇక టీడీపీ 2014, 2019 ఎన్నికల్లో కూడా జూనియర్ ని ఎన్నికల ప్రచారానికి పిలవలేదు. ఈ మధ్యలో జరిగిన మహానాడు మీటింగులలో కూడా ఆయన ఎక్కడా కనిపించలేదు. ఈ నేపధ్యంలో 2024 ఎన్నికల వేళ కూడా జూనియర్ ప్రచారానికి రాకపోవచ్చు అని అంటున్నారు. ఆయన తన సినిమాలు తాను అన్నట్లుగానే ఉంటారని చెబుతున్నారు. తెలుగుదేశంలో ఇపుడు చంద్రబాబు ఆయన తరువాత లోకేష్ అన్నట్లుగానే సీన్ ఉంది. ఎవరు వచ్చినా ప్రచారం చేసి వెళ్ళాల్సిందే.

ఈ మాత్రం రాజకీయాల కోసం తన నంబర్ వన్ పొజిషన్ ని వదిలేసుకుని రాజకీయాల్లోకి రావడం అన్నది జరిగేది కాదనే అంటున్నారు. ఇక చంద్రబాబు మీటింగ్స్ కి వెళ్ళినపుడు కూడా తమ్ముళ్ళు జూనియర్ కోసం బాహాటంగా అడుగుతున్నా ఆయన ఏమీ చెప్పలేకపోతున్నారు. దానికి కారణం లోకేష్ ని వారసుడిగా ఫిక్స్ చేసి ఉంచారు. జూనియర్ ని అందుకే పిలవలేకపోతున్నారు అంటున్నారు. ఇక ఏపీలో తెలుగుదేశం పార్టీ ఎన్నడూ లేని విధంగా ఇపుడు బిగ్ ట్రబుల్ ని ఏపీలో ఫేస్ చేస్తోంది.

జగన్ రాజకీయం ముందు టీడీపీ తట్టుకోలేని స్థీతిలో ఉంది. ఇది టీడీపీకి బాగా కొత్త. కాంగ్రెస్ వంటి జాతీయ పార్టీని ఎదిరించి గెలవడం వేరు. యువకుడు అయిన జగన్ తోనూ బలమైన మరో ప్రాంతీయ పార్టీతో తలపడడం వేరు. జగన్ బలంగా గట్టిగా ఉన్నారు. ఆయన రాజకీయ వ్యూహాలు పదును తేరి ఉన్నాయి. దాంతో తెలుగుదేశానికి ఈ ఎన్నికల వేళ జూనియర్ లాంటి గ్లామర్ ఫిగర్ అవసరం. కానీ ఆయన తారకరత్న ప్రకటనలు చేస్తే రారు అంటున్నారు. చంద్రబాబు అనుకుంటే  కోరుకుంటే వస్తారు. మరి అది జరుగుతుందా. అంటే చూడాలి మరి. ఇప్పటికైతే జూనియర్ టీడీపీకి నియర్ కాదు దూరమే అని అంటున్నారు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News