`జూబ్లీ హిల్స్` సొసైటీలో మ‌ళ్లీ విభేదాలు.. పోలీస్ కంప్ల‌యింట్‌!

Update: 2021-08-13 09:08 GMT
 జూబ్లీ హిల్స్ సొసైటీలో  కొత్త‌గా ఏర్ప‌డిన పాల‌క వ‌ర్గంలోనూ విభేదాలు తెర‌మీదికి వ‌చ్చాయి. కేవ‌లం వివాదాలు మాత్ర‌మే కాద‌ని.. స‌భ్యులు ఒక‌రిపై ఒక‌రు ప‌డి కొట్టుకున్నార‌ని అంటున్నారు. దీనికి సొసైటీ సెక్ర‌టరీ.. పోలీసుల‌కు ఇచ్చిన కంప్ల‌యింట్ మ‌రింత బ‌లం చేకూరుస్తోంది.

జూబ్లీ హిల్స్ సొసైటీకి సంబంధించిన రికార్డుల విష‌యంలో త‌లెత్తిన వివాదం.. ఇప్పుడు పోలీసు స్టేష‌న్ వ‌ర‌కు చేరింది. సొసైటీ బైలా ప్ర‌కారం.. దీనికి సంబంధించిన రికార్డుల‌ను స‌భ్యులు ప‌రిశీలించుకునే అవ‌కాశం ఉంది. అయితే.. ఈ విష‌యంలో సొసైటీ అధ్య‌క్షుడు ఇత‌ర స‌భ్యులు.. వ్య‌వ‌హ‌రించిన తీరు తీవ్ర వివాదంగా మారింద‌నే వాద‌న వినిపిస్తోంది. ఇదే విష‌యంపై ప్రస్తుత సెక్ర‌ట‌రీ పోలీసుల‌కు కంప్ల‌యింట్ ఇచ్చాడు. విష‌యంలోకి వెళ్తే..  సొసైటీ బై  లాస్  ప్రకారం సెక్రటరీ అయిన తను రికార్డ్స్ మైంటైన్  చేస్తున్నాననీ, ఎప్పుడు ఎవరికీ ఏ రికార్డు  అవసరం వచ్చినా  సెక్రటరీ సమక్షం లో రికార్డ్స్ చూడ‌డానికి అవ‌కాశం ఉంద‌ని ప్ర‌స్తుత సెక్ర‌ట‌రీ చెబుతున్నారు.

అయితే.. తాను రికార్డుల‌ను చూసేందుకు వెళ్తే.. త‌న‌ను నిర్బంధించార‌ని..  నిబంధనలకు విరుద్ధంగా, త‌న వ‌ద్ద ఉన్న‌ రికార్డు రూమ్ తాళాలను త‌మ‌కు అప్ప‌గించాల‌ని.. అధ్య‌క్షుడు స‌హా ఇత‌ర స‌భ్యులు అడిగార‌ని.. అయితే.. ఇది నిబంధ‌న‌ల‌కు విరుద్ధ‌మ‌ని చెప్ప‌డంతో.. త‌న‌ను తీవ్రంగా బెదిరించార‌ని.. ఈ క్ర‌మంలో తనను రెండు గంటల పాటు ఒక గ‌దిలో పెట్టి నిర్భంధించారని ప్ర‌స్తుత సెక్ర‌ట‌రీ పేర్కొన్నారు.  తన పైన దౌర్జన్యం చేసారని  అంటున్నారు. అంతేకాదు.. దీనిపై ఆయ‌న పోలీసులకు ఇటు సహకార సంఘాల రిజిస్ట్రార్ కు  ఫిర్యాదు చేశారు.

అంతేకాదు.. త‌న‌పై చేయి కూడా చేసుకున్నార‌ని.. ఈ క్ర‌మంలో వివాదం జ‌రిగింద‌ని కూడా ఆయ‌న వివ‌రించిన‌ట్టు తెలిసింది.  అదేస‌మ‌యంలో.. తాను కనుక తాళాలు ఇవ్వ‌క‌పోయినా.. రికార్డు రూం తాళాలు.. ప‌గ‌ల‌గొట్ట‌యినా.. రికార్డుల‌ను స్వాధీనం చేసుకునేందుకు ప్ర‌య‌త్నిస్తున్నార‌ని.. ప్ర‌స్తుత సెక్ర‌ట‌రీ ఆరోపించారు. ఈ క్ర‌మంలో త‌క్ష‌ణ‌మే.. సొసైటీ కార్యాల‌యానికి.. భ‌ద్ర‌త క‌ల్పించాల‌ని.. త‌న‌ను బెదిరించిన వారిపై చ‌ర్య‌లు తీసుకోవాల‌ని.. ఆయ‌న పోలీసులకు విజ్ఞ‌ప్తి చేశారు. కాగా, ఎన్నికైన కొద్ది నెలల్లోనే  ఇలాంటి గొడవలతో సొసైటీ విమ‌ర్శ‌ల‌పాల‌వుతోంద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు.
Tags:    

Similar News