అప్పుడు ఆంధ్రా వాళ్ల‌ను తిట్టి.. ఇప్పుడు పొడుగుతారా? : కేసీఆర్‌పై పాల్ ఫైర్‌

Update: 2023-04-13 22:03 GMT
తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్‌పై ఇటీవ‌ల కాలంలో త‌ర‌చుగా విమ‌ర్శ‌లు చేస్తున్న ప్ర‌జాశాంతి పార్టీ వ్య‌వ‌స్థాప‌కుడు, శాంతి దూ త .. కేఏపాల్ తాజాగా మ‌రోసారి విరుచుకుప‌డ్డారు. విశాఖ ఉక్కు ప‌రిశ్ర‌మ‌ను అమ్మేస్తే.. తాము కొంటామంటూ.. కేసీఆర్ మేన ల్లుడు మంత్రి హ‌రీష్ రావు చేసిన ప్ర‌క‌ట‌న‌ను ఉటంకిస్తూ.. సీఎం కేసీఆర్‌పై పాల్ విరుచుకుప‌డ్డారు. తెలంగాణ ఉద్య‌మం స‌మ యంలో ఏపీ వాళ్ల‌ను తిట్టిన నోటితోనే ఇప్పుడు ఏపీ ప్ర‌జ‌ల‌ను పొగుడుతున్నార‌ని విమ‌ర్శించారు. అంతేకాదు.. త‌ల్లికి అన్నం పెట్ట‌లేని వాడు.. పిన్నికి బంగారు నెక్ల‌స్ చేయిస్తాన‌న్న‌ట్టుగా కేసీఆర్ వైఖ‌రి ఉంద‌ని ఎద్దేవా చేశారు.

తెలంగాణ‌లో సింగ‌రేణిని అమ్మేందుకు కేంద్రం పెద్ద ఎత్తున ప్ర‌య‌త్నాలు చేస్తుంటే.. దీనిని అడ్డుకోలేని.. దీనిని కొన‌లేని కేసీఆర్ .. ఎక్క‌డో విశాఖ‌లో ఉన్న ఉక్కును కొంటాన‌ని.. గంభీర వ‌చ‌నాలు ప‌లుకుతున్నార‌ని.. ఇది పూర్తిగా రాజ‌కీయ ఎత్తుగ‌డేన‌ని పాల్ వ్యాఖ్యానించారు. ఇక‌, దేశంలోనే అతి పెద్ద అంబేద్క‌ర్ విగ్ర‌హాన్ని హైద‌రాబాద్‌లో ఏర్పాటు చేయ‌డాన్ని కూడా రాజ‌కీయంగా పాల్ విమ‌ర్శించారు. ప్ర‌ధాని మోడీ.. గుజ‌రాత్‌లో ఏర్పాటు చేసిన‌.. ప‌టేల్ విగ్ర‌హానికి పోటీగా.. ఇక్క‌డ అంబేద్క‌ర్ విగ్ర‌హాన్ని ఏర్పాటు చేస్తున్నార‌ని.. ప్ర‌ధానిని ఓవ‌ర్ టేక్ చేయ‌డ‌మే దీని వెనుకున్న రీజ‌న‌ని అన్నారు.

2008లో కేసీఆర్ తన వద్దకు రూ.10 కోట్లు అడగడానికి వచ్చారని పాల్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. కానీ, ఇప్పుడు మాత్రం త‌న‌ను హింసలకు గురి చేస్తున్నారంటూ మండిపడ్డారు. తెలంగాణ‌లో నూత‌న స‌చివాల‌య్యాన్ని హిట్ల‌ర్ వ‌ర్ధంతి రోజున ప్రారం భించేందుకు ముహూర్తం నిర్ణ‌యించార‌ని.. తెలంగాణ స‌మాజానికి ఎలాంటి మెసేజ్ ఇస్తున్నార‌ని పాల్ మండిప‌డ్డారు. త‌న రాక‌తోనే తెలంగాణ బాగుప‌డుతుంద‌ని తేల్చి చెప్పారు. మ‌రోవైపు.. దేశం మరో శ్రీలంక గా మారుతోందని కేఏ పాల్ అసహనం వ్యక్తం చేశారు.

ఇదిలావుంటే, అక్టోబర్ 1 గ్లోబల్ పీస్ సభ, అక్టోబర్ 2న గ్లోబల్ పీస్ ఎకనామిక్ మీటింగ్ జరుగుతుందని పాల్ తెలిపారు. ఈ స‌భ‌ల కార‌ణంగా హైదరాబాద్ వచ్చేందుకు చాలామంది సిద్ధంగా ఉన్నారన్నారు. తన ఆహ్వానాన్ని మన్నించి గ్లోబల్ పీస్ మీటింగ్ ను తెలుగు రాష్ట్రాల్లో నిర్వహించాలని ఆయన కోరారు. తెలుగు ప్రజల జీవితాలను తాను మాత్రమే మార్చగలనని కేఏ పాల్ తనదైన స్టైల్ లో చెప్పుకొచ్చారు.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.

Similar News