కేఏ పాల్ మామూలోడు కాదుగా!

Update: 2022-09-16 05:05 GMT
ప్ర‌జాశాంతి పార్టీ అధినేత కేఏ పాల్‌ను రాజ‌కీయ నాయ‌కుడిగా కంటే ఒక క‌మెడియ‌న్‌గా చూసేవారే ఎక్కువ‌. సీరియ‌స్ పాలిటిక్స్‌లో ఆయ‌న‌ను ఒక ఆట‌లో అర‌టిపండులా భావించేవారే అధికం. వాస్త‌వానికి ఈ విష‌యంలో ప్ర‌జ‌ల‌నో, నెటిజ‌న్ల‌నో త‌ప్పుప‌ట్టాల్సిన అవ‌స‌రం లేదు. కేఏ పాల్ చెప్పే మాట‌లు కూడా విమ‌ర్శ‌ల‌కు, ఫ‌న్నీ మీమ్స్‌కు కార‌ణ‌మ‌య్యేలా ఉంటాయి.

ఇప్ప‌టివ‌ర‌కు ఆయ‌న త‌ప్ప ఆ పార్టీకి అనుబంధ సంఘాలు కానీ, కార్య‌వ‌ర్గం కానీ, జిల్లా కార్య‌వ‌ర్గాలు కానీ ఇలా ఏదీ లేక‌పోయినా వ‌చ్చే ఎన్నిక‌ల్లో తెలంగాణ‌లో తానే ముఖ్య‌మంత్రిని అంటారు. జ‌గ‌న్ త‌న పార్టీలో చేరితే ప్ర‌ధాన‌మంత్రి చేస్తానంటారు. అలాగే ప‌వ‌న్ క‌ల్యాణ్ జ‌నసేనను ప్ర‌జాశాంతిలో విలీనం చేస్తే ఆంధ్ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రిని చేస్తాన‌ని హామీ ఇస్తారు. అలాగే దేశంలో వ‌చ్చే పార్ల‌మెంటు ఎన్నిక‌ల్లో 175 పార్ల‌మెంటు సీట్ల‌లో పోటీ చేస్తామ‌ని ప్ర‌క‌టిస్తుంటారు.

ఆలూ లేదు చూలూ లేదు.. అల్లుడి పేరు సోమ‌లింగం అన్న‌ట్టు కేఏ పాల్ వ్య‌వ‌హ‌రిస్తుంటార‌ని ఆయ‌న‌పై తీవ్ర విమ‌ర్శ‌లు ఉన్నాయి. అందులోనూ కొద్ది రోజుల క్రితం కేంద్ర ఎన్నిక‌ల సంఘం.. కేఏ పాల్‌కు తీవ్ర షాక్ ఇచ్చింది. ఆయ‌న ప్రజాశాంతి పార్టీ యాక్టివ్ పాలిటిక్స్‌లో లేద‌ని.. ఎన్నిక‌ల్లోనూ పోటీ చేయ‌డం లేద‌నే కార‌ణాలతో ఆ పార్టీని కేంద్ర ఎన్నిక‌ల సంఘం జాబితా నుంచి తొల‌గించింది. దీంతో పార్టీ గుర్తును కూడా కేఏ పాల్ కోల్పోవాల్సిన ప‌రిస్థితి వ‌చ్చింది.

అయితే న‌వ్విన నాప చేనే పండుతుంది అన్న‌ట్టు కేఏ పాల్‌కు భారీగా వివిధ నేత‌ల మ‌ద్ద‌తు ల‌భిస్తుంది. ఒక‌ప్ప‌టి ప్ర‌ముఖ న‌క్స‌లైట్‌, ప్ర‌జా యుద్ధ నౌక‌గా పేరుగడించిన గ‌ద్ద‌ర్.. కేఏ పాల్‌కు మ‌ద్ద‌తు ప్ర‌క‌టించారు. అయితే రాజ‌కీయంగా కాదు లెండి. కేఏ పాల్ గ్లోబ‌ల్ శాంతి మిష‌న్ అని ఒక దాన్ని ఏర్పాటు చేశారు. ప్ర‌పంచ శాంతి, మాన‌వ హ‌క్కుల కోసం ఈ సంస్థ ప‌నిచేస్తుంటుంది. ఈ విష‌యాల్లో కేఏ పాల్‌తో ప‌నిచేయ‌డానికి త‌న మ‌ద్ద‌తు తెలుపుతున్నాన‌ని తాజాగా గ‌ద్ద‌ర్ ప్ర‌క‌టించారు. అలాగే సీబీఐ మాజీ జాయింట్ డైరెక్ట‌ర్ ల‌క్ష్మీనారాయ‌ణ‌, జ‌స్టిస్ చంద్ర‌కుమార్, ఉద్య‌మ‌కారిణి విమ‌ల‌క్క‌ల‌తోపాటు మ‌రో 12 మంది ఉన్నార‌ని తెలిపారు.

గ్లోబల్ శాంతి మిష‌న్‌లో ప‌నిచేయ‌డానికి అనేక మంది ముందుకు వ‌స్తున్నార‌ని గద్ద‌ర్ చెబుతున్నారు. ఈ సంస్థ‌కు రాజ‌కీయాల‌తో ఎలాంటి సంబంధం లేద‌న్నారు. కేవ‌లం ప్ర‌పంచ శాంతి, మాన‌వ హ‌క్కుల కోస‌మే గ్లోబ‌ల్ శాంతి మిష‌న్ ప‌నిచేస్తుంద‌ని వివ‌రించారు. వీటిలో ఉన్న స‌మ‌స్య‌ల ప‌రిష్కారం కోస‌మే తాము ప‌నిచేస్తామ‌న్నారు.

కాగా సెప్టెంబ‌ర్ 25న కేఏ పాల్ 59వ పుట్టిన రోజును పుర‌స్క‌రించుకుని ప్ర‌స్తుతం ఉప ఎన్నిక జ‌ర‌గ‌బోతున్న మునుగోడు నియోజ‌క‌వ‌ర్గంలో సూప‌ర్ స్పెషాలిటీ ఆస్ప‌త్రి కోసం స్థలాన్ని కొనుగోలు చేస్తామ‌ని గ‌ద్ద‌ర్ ప్ర‌క‌టించారు. అక్క‌డ కేఏ పాల్ ఆస్ప‌త్రిని నిర్మిస్తార‌ని గ‌ద్ద‌ర్ చెబుతున్నారు.

మొత్తానికి కేంద్ర ఎన్నిక‌ల‌కు కేఏ పాల్‌కు షాక్ ఇచ్చినా ఆయ‌న మాత్రం త‌న దూకుడును కొన‌సాగిస్తున్నారు. రెండు తెలుగు రాష్ట్రాల ప్ర‌ముఖుల‌ను త‌న వైపుకు తిప్పుకుని మొత్తానికి రంజుగానే రాజ‌కీయాన్ని ర‌క్తిక‌ట్టిస్తున్నారు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News