క‌డియంకు ఎందుకో కంగారు ?

Update: 2017-10-18 08:50 GMT
తెలంగాణ తెలుగుదేశం పార్టీ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలోకి వెళ్తున్న‌ట్లు వార్త‌లు హ‌ల్ చ‌ల్ చేస్తున్నాయి. ఈ నేప‌థ్యంలో తాను పార్టీ మార‌డం లేద‌ని - టీఆర్ ఎస్ పార్టీ నేత‌లు - మంత్రులు గ‌త ఏప్రిల్ లో ఆ పార్టీ ఆవిర్భావ దినోత్స‌వం సంధ‌ర్భంగా కూలీ పని పేరుతో ల‌క్ష‌ల రూపాయ‌లు నిధులు సేక‌రించార‌ని, ఇది చ‌ట్ట విరుద్దం అని ఎన్నిక‌ల క‌మీష‌న్ కు ఫిర్యాదు చేశాన‌ని, ఢిల్లీ హైకోర్టులో కేసు వేసేందుకు న్యాయ‌వాదితో చ‌ర్చించేందుకు ఢిల్లీకి వ‌చ్చాన‌ని రేవంత్ రెడ్డి మీడియా ముందుకు వ‌చ్చి వివ‌ర‌ణ ఇచ్చారు.

పార్టీ మార‌డం - మార‌క‌పోవ‌డం అనేది రేవంత్ రెడ్డికి సంబంధించిన విష‌యం. అయితే ఈ విష‌యంలో తెలంగాణ ఉప ముఖ్య‌మంత్రి క‌డియం శ్రీ‌హ‌రి స్పందించ‌డం ఆశ్చ‌ర్యంగా ఉంది. అధికారంలో ఉన్న‌ప్పుడు కాంగ్రెస్ పార్టీ తెలంగాణ చేసింది శూన్యం అని - ఇప్పుడు తెలంగాణ ప్ర‌భుత్వం చేస్తున్న అభివృద్ది చూసి ఓర్వ‌లేక అడ్డుప‌డుతుంద‌ని క‌డియం ఆరోపించారు. అలాంటి పార్టీలోకి రేవంత్ రెడ్డి వెళ్ల‌డం సిగ్గుమాలిన చ‌ర్య అని, చంద్ర‌బాబు వ‌ద్ద ఆత్మ‌గౌర‌వం తాక‌ట్టు పెట్ట‌లేకే తాను టీఆర్ ఎస్ లో చేరాన‌ని - రేవంత్ రెడ్డికి ఆత్మ‌గౌర‌వం లేద‌ని చెప్పుకొచ్చారు.

ఓటుకునోటు కేసు త‌రువాత తెలంగాణ‌లో తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలంతా టీఆర్ ఎస్ తీర్ధం పుచ్చుకున్నారు. ఇక తెలంగాణ‌లో టీడీపీ భ‌విష్య‌త్ ఉంద‌న్న న‌మ్మ‌కం కూడా ఆ పార్టీ నేత‌ల‌కు లేదు. ఈ నేప‌థ్యంలో రేవంత్ పార్టీ మార్పు గురించి వార్త‌ల‌ను చూసి క‌డియం ఎందుకు కంగారు పడ్డార‌న్న‌ది ప్ర‌శ్న‌. రేవంత్ రెడ్డి టీఆర్ ఎస్ పార్టీ నేత కాదు .. ఇప్పుడున్న ప‌రిస్థితిలో ఆయ‌న టీఆర్ ఎస్ లో చేరే అవ‌కాశాలు కూడా లేవు.  అలాంటిది హ‌ఠాత్తుగా క‌డియం ఎందుకు మీడియా ముందుకు వ‌చ్చార‌న్న చ‌ర్చ జ‌రుగుతుంది.
Tags:    

Similar News