సోమిరెడ్డి మీదేసిన బుర‌ద కాకాణికి అంటుకుంది

Update: 2017-10-22 05:32 GMT
రాజ‌కీయాల‌న్నాక స‌వాల‌చ్చ ఉండొచ్చు. కానీ.. లేనివి ఉన్న‌ట్లుగా ఆరోపించి.. నింద‌లు వేస్తే అస‌లుకే ఎస‌రొస్తుంది. ఇప్పుడా విష‌యం నెల్లూరు జిల్లా స‌ర్వే ప‌ల్లి ఎమ్మెల్యే.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత కాకాణి గోవ‌ర్ద‌న్ రెడ్డికి బాగానే అర్థ‌మై ఉండాలి. ఏపీ వ్య‌వ‌సాయ మంత్రి సోమిరెడ్డి చంద్ర‌మోహ‌న్ రెడ్డిపై చేసిన ఆరోప‌ణ‌ల విష‌యంలో ఇప్పుడాయ‌న అడ్డంగా బుక్ అయ్యారు.

అక్ర‌మంగా సంపాదించిన మొత్తాన్ని విదేశాల్లో దాచి పెట్టారంటూ సోమిరెడ్డిపై కాకాణి తీవ్ర ఆరోప‌న‌లు చేశారు. తాను చెబుతున్న మాట‌ల‌కు ఆధారంగా కొన్ని డాక్యుమెంట్ల‌ను తెర మీద‌కు తీసుకొచ్చారు. అయితే.. ఈ డాక్యుమెంట్లు ఫోర్జ‌రీవేన‌న్న విష‌యాన్ని పోరెన్సిక్ లేబొరేట‌రి తేల్చ‌టం ఇప్పుడు సంచ‌ల‌నంగా మారింది.

తాను అక్ర‌మంగా సంపాదించిన దాన్ని మ‌లేసియా.. థాయ్ లాండ్ లో దాచి పెట్టార‌ని.. ఇందులో భాగంగా మంత్రి ర‌హ‌స్య విదేశీ ప‌ర్య‌ట‌న చేసిన‌ట్లుగా కాకాణి ఆరోపించారు. అయితే.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత పేర్కొన్న విధంగా సోమిరెడ్డి మ‌లేషియాకు వెళ్ల‌లేద‌ని ఇమిగ్రేష‌న్ అధికారులు ధ్రువీక‌రించారు. మంత్రి సోమిరెడ్డి2003 సెప్టెంబ‌రు 13న మ‌లేషియాకు వెళ్లి స్థిరాస్తులు.. బ్యాంకుల్లో న‌గ‌దు ఉన్న‌ట్లుగా కాకాణి ఆరోపించారు. థాయ్ లాండ్ లో సోమిరెడ్డికి ఆయ‌న కుటుంబ స‌భ్యుల‌కు ప‌వ‌ర్ ప్రాజెక్టు ఉన్న‌ట్లుగా ఎమ్మెల్యే కాకాణి ఆరోపించారు. 2016 డిసెంబ‌రులో విలేక‌రుల స‌మావేశాన్ని ఏర్పాటు చేసి కొన్ని డాక్యుమెంట్ల‌ను చూపించారు.

ఈ ఉదంతంపై కాకాణిపై సోమిరెడ్డి పోలీసుల‌కు ఫిర్యాదు చేశారు. దీనిపై విచారించిన అధికారులు.. కాకాణి చూపించిన డాక్యుమెంట్లు అన్ని నిజ‌మైన‌వి కాద‌ని.. ఫోర్జ‌రీవ‌న్న విష‌యాన్ని తేల్చారు. ఈ డాక్యుమెంట్ల వెనుక చిత్తూరు జిల్లా పిచ్చాటూరు మండ‌లానికి చెందిన ప‌సుపులేటి చిరంజీవి కీల‌క సూత్ర‌ధారిగా గుర్తించారు. ఆయ‌న ఇంట్లో త‌నిఖీలు నిర్వ‌హించ‌గా.. ఫోర్జ‌రీ డాక్యుమెంట్లు అంద‌జేయ‌టానికి కాకాణితో రూ.ల‌క్ష‌కు ఒప్పందం చేసుకున్న విష‌యాన్ని చిరంజీవి పోలీసుల‌కు చెప్పారు. దీంతో.. ఈ వ్య‌వ‌హారం రివ‌ర్స్ అయి.. కాకాణి కేసులో చిక్కుకున్నారు.

ఏ1గా కాకాణి.. ఏ2గా ప‌సుపులేటి చిరంజీవి.. ఏ3గా పి. వెంక‌ట‌కృష్ణ‌.. ఏ4గా జి.హ‌రిహ‌ర‌న్ ల‌ను పేర్కొంటూ కేసు న‌మోదు చేశారు. ఇదిలా ఉండ‌గా.. కాకాణి ఆరోపించిన‌ట్లుగా సోమిరెడ్డి విదేశాల‌కు వెళ్ల‌లేద‌ని ఇమ్మిగ్రేష‌న్ అధికారులు తాజాగా స్ప‌ష్టం చేయ‌టంతో.. ఈ వ్య‌వ‌హారంలో ఎమ్మెల్యే కాకాణి మ‌రింత ఇరుక్కుపోయిన‌ట్లుగా భావిస్తున్నారు.
Tags:    

Similar News