సొంత పార్టీ నాయకుడికి వైసీపీ ఎమ్మెల్యే చెంపదెబ్బ!

Update: 2023-05-01 11:50 GMT
యలమంచిలి ఎమ్మెల్యే కన్నబాబు రాజుకు సొంత పార్టీ నేతల నుంచే నిరసన సెగ ఎదురైంది. ఆయనకు సొంత పార్టీలోనే అసమ్మతి వర్గం ఉన్న సంగతి తెలిసిందే. ఇప్పటికే పలుమార్లు కన్నబాబు రాజును అసమ్మతి నేతలు నియోజకవర్గ పర్యటనలో అడ్డుకున్నారు. తాజాగా తనపై అసమ్మతి వ్యక్తం చేసిన సొంత పార్టీ నేతపై బహిరంగంగా ఎమ్మెల్యే కన్నబాబు రాజు చేయి చేసుకోవడం వివాదాస్పదమైంది.

ఈ ఘటన వివరాల్లోకెళ్తే.. అచ్యుతాపురం(మం) పూడిమడకలో గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమం జరిగింది. ఇందులో ఎమ్మెల్యే కన్నబాబు రాజు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సొంత పార్టీ నేతలు, కార్యకర్తలు ఆయనను నిలదీశారు. తమకు ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలు చేయడంలో పక్షపాతం ప్రదర్శిస్తున్నారని ఆయనను చుట్టముట్టారు. ఆయనను ఎంతోకష్టం మీద పోలీసులు బయటకు తీసుకురావడానికి ప్రయత్నించారు.

అయినా సరే భారీ సంఖ్యలో అసమ్మతి కార్యకర్తలు, నేతలు చుట్టుముట్టడంతో ఎమ్మెల్యే కన్నబాబు రాజులో ఆగ్రహం పెల్లుబికింది. దీంతో తనను ప్రశ్నిస్తూ తన వెనకాలే వస్తున్న నేత చెంపపై ఎమ్మెల్యే కొట్టారు. దీంతో అక్కడి పరిస్థితి ఉద్రిక్తంగా మారింది.

తమకు సంక్షేమ పథకాలు అమలు చేయడంతో పాటు పూడిమడక జెట్టీ నిర్మాణం కోసం ఇచ్చిన హామీలు నెరవేర్చాలని స్థానిక నేతలు డిమాండ్‌ చేస్తున్నారు. ఈ క్రమంలో ఆయన సొంత పార్టీ నేతపైనే చేయి చేసుకోవడంతో కన్నబాబు వద్దు – జగనన్న ముద్దు అంటూ నినాదాలు చేశారు.

కన్నబాబు అరాచకాలు జగన్‌ వరకూ చేరాలని.. కన్నబాబు అరాచకాలు నశించాలి అంటూ నినాదాలు చేశారు. ఎమ్మెల్యే దందాలను అరికట్టాలని.. ఆయన అరాచకాలు అడ్డుకోవాలని వైసీపీ అధిష్టానాన్ని కోరారు. ఎమ్మెల్యే తప్పులు చేస్తారు.. చేయిస్తారంటూ ప్లకార్డులు తీసుకొచ్చి నిరసనకు దిగారు.

కొద్దిరోజుల క్రితం కూడా ఎమ్మెల్యే కన్నబాబు రాజుకు స్థానికుల నుంచి నిరసన సెగ ఎదురయిన సంగతి తెలిసిందే. అభివృద్ధి జరగడం లేదని ప్రశ్నించిన ఓ యువకుడిపై కన్నబాబు రాజు ఆగ్రహం వ్యక్తం చేశారు. పళ్లు పీకేస్తానంటూ ఆ యువకుడిని హెచ్చరించడం విమర్శలకు దారితీసింది. ఇంకా అసెంబ్లీ ఎన్నికలకు ఏడాది సమయం కూడా లేని నేపథ్యంలో సొంత పార్టీలోనే వ్యతిరేకతతో కన్నబాబు రాజు ఎలా నెట్టుకొస్తారో వేచిచూడాల్సిందే!

Similar News