నెల‌కొక‌రు చొప్పున కాంగ్రెస్‌కు దిమ్మ‌తిరిగే షాకిస్తున్నారుగా

Update: 2022-05-25 16:30 GMT
ఓ వైపు కేంద్రంలోని అధికార బీజేపీకి ప్ర‌త్యామ్నాయ పార్టీగా ఎద‌గాల‌నే ప్ర‌య‌త్నం.... మ‌రోవైపు ప్రాంతీయ పార్టీల కూట‌మికి నాయ‌క‌త్వం వ‌హించాల‌నే ఆరాటం... వీట‌న్నింటినీ సాధ్యం చేసుకునేందుకు జ‌రుగుతున్న సంస్క‌ర‌ణ‌ల‌తో బిజీ బిజీగా ఉన్న కాంగ్రెస్ పార్టీకి... ఈ ప్ర‌య‌త్నాలు ఫ‌లితం ఇవ్వ‌డం సంగ‌తి అలా ఉంచితే... వ‌రుస‌గా ఊహించ‌ని షాకులు త‌గులుతున్నాయి. తాజాగా పార్టీ సీనియ‌ర్ నేత‌, గాంధీ కుటుంబానికి అత్యంత స‌న్నిహితుడు, పేరు మోసిన న్యాయ‌వాది క‌పిల్ సిబ‌ల్‌ పార్టీకి హ‌ఠాత్తుగా రాజీనామా చేసేశారు. `జీ 23 గ్రూప్` కాస్త చ‌ల్ల‌బ‌డిన త‌ర్వాత కాంగ్రెస్‌లో ఇక అస‌మ్మ‌తి, అసంతృప్తులు ఉండ‌వ‌ని అధిష్ఠానం భావిస్తున్న స‌మ‌యంలోనే ఇలాంటి షాక్ త‌గ‌ల‌డం కాంగ్రెస్ జీర్ణించుకోలేక‌పోతోంది. మ‌రోవైపు ఇటీవ‌ల ఐదుగురు ముఖ్య నేత‌లు కాంగ్రెస్ పార్టీని వీడటం ఆ పార్టీ ప‌రిస్థితిని చాటి చెప్తోందంటున్నారు.

గ‌త ఐదు నెల‌ల కాలంలో రాహుల్ గాంధీకి స‌న్నిహితుల‌నే పేరునున్న ఐదుగురు నేత‌లు కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పేశారు. యువ‌నేత‌, రాహుల్ గాంధీకి అత్యంత స‌న్నిహితుడు అనే పేరున్న జ్యోతిరాదిత్య సింధియా కాంగ్రెస్‌కు గుడ్ బై చెప్పేసిన త‌ర్వాత నుంచి వ‌రుస‌గా ఒక్కొక్క‌రు  ఝ‌ల‌క్ ఇవ్వ‌డం ప్రారంభించారు. రాహుల్ స‌న్నిహితుల‌నే పేరున్న అగ్ర‌నేత‌లు జితిన్ ప్ర‌సాద‌, ఆర్పీఎన్ సింగ్‌, సునీల్ ఝాక‌ర్‌, హార్థిక్ ప‌టేల్ ఈ జాబితాలో ఉన్నారు. సీనియ‌ర్ నేత దిగ్విజ‌య్ సింగ్‌తో పొస‌గ‌క… కాంగ్రెస్‌కు గుడ్ బై చెప్పేసిన జ్యోతిరాధిత్య‌ ఆ త‌ర్వాత బీజేపీలో చేరి ప్ర‌స్తుతం కేంద్ర మంత్రిగా ఉన్నారు. యూపీలో బ్రాహ్మ‌ణ వ‌ర్గంపై మంచి ప‌ట్టున్న  రాహుల్ గాంధీకి అత్యంత స‌న్నిహితుడైన జితిన్ ప్ర‌సాద స‌రిగ్గా యూపీ అసెంబ్లీ ఎన్నిక‌ల స‌మ‌యంలో పార్టీకి ఝ‌ల‌క్ ఇచ్చారు. పార్టీకి గుడ్ బై చెప్పేసి, బీజేపీలో చేరిపోయిన జితిన్ ప్ర‌సాద ప్ర‌స్తుతం యోగి కేబినెట్‌లో మంత్రిగా ఉన్నారు. యూపీలో కీల‌క నేత‌గా, రాహుల్ కోట‌రీగా ముద్ర ప‌డిన కేంద్ర మంత్రిగా ఆర్పీఎన్ సింగ్ 32 సంవ‌త్స‌రాలు పార్టీలో ఉన్నా.. లాభం లేకుండా పోతోందంటూ విమర్శ‌లు చేశారు. ఇక తాను కాంగ్రెస్‌లో ఇమ‌డ‌లేన‌ని పార్టీకి బైబై చెప్పేశారు.

కేంద్ర న్యాయ శాఖ మంత్రిగా ప‌నిచేసిన అశ్వ‌నీ కుమార్ ఈ ఏడాది ఫిబ్ర‌వ‌రిలో పార్టీకి రాజీనామా చేసేశారు. కాంగ్రెస్ ప‌త‌నం అంచుగా ప‌య‌నిస్తోంద‌ని కామెంట్ చేసిన అశ్వ‌నీ కుమార్ ఆ ప‌త‌నం తాను చూస్తాన‌ని సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. గౌర‌వ ప్ర‌దంగా కాంగ్రెస్ నుంచి వ‌చ్చేశాన‌ని త‌న నిర్ణ‌యాన్ని విశ్లేషించారు. సీనియ‌ర్ నేత‌,  పంజాబ్ పీసీసీ అధ్య‌క్షుడిగా సేవ‌లు అందించిన సునీల్ ఝాక‌ర్ పార్టీకి గుడ్‌బై చెప్పేసి, బీజేపీలో చేరిపోయారు. మాజీ సీఎం చెన్నీపై ఆయ‌న విమ‌ర్శలు చేయ‌గా పార్టీ వ్య‌తిరేక కార్య‌క‌లాపాలు చేశారంటూ ఆయ‌న‌కు హైక‌మాండ్ నోటీసులు ఇవ్వ‌డంతో ఈ నిర్ణ‌యం తీసుకున్నారు. ప‌టేల్ ఉద్య‌మ నేత హార్థిక్ ప‌టేల్ కూడా కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పేశారు. త‌న‌ను గుజ‌రాత్ పీసీసీ ప‌ట్టించుకోవ‌డం లేద‌ని, ఎంత‌సేపూ చికెన్ స్యాండ్‌విచ్‌లు తింటూ వుంటార‌ని, నేత‌ల‌ను ప‌ట్టించుకోర‌ని, ధ్వ‌జ‌మెత్తుతూ కాంగ్రెస్‌కు గుడ్‌బై చెప్పారు. తాజాగా ఈ జాబితాలో సీనియ‌ర్ నేత క‌పిల్ సిబ‌ల్ చేరిపోయారు. దీంతో ఐదు నెల‌ల వ్య‌వ‌ధిలోనే కాంగ్రెస్‌కు అదిరిపోయే షాకులు ఇచ్చార‌ని విశ్లేష‌కులు పేర్కొంటున్నారు.
Tags:    

Similar News