అవును.. ఆ కూలీ మాజీ ఎమ్మెల్యేనే

Update: 2016-08-12 03:43 GMT
ఒక్కసారి ఎమ్మెల్యే అయితే.. ఫ్యామిలీ.. ఫ్యామిలీ మొత్తం సెటిల్ అయిపోయినట్లేనని చాలామంది విశ్వసిస్తారు. రాజకీయాల్లాంటి రొచ్చులో తులసి మొక్కలకు స్థానం లేదని.. నిజానికి అలాంటోళ్లు కనిపించరని చెబుతుంటారు. కానీ.. తరచి చూస్తే.. నీతికి.. నిజాయితీకి నిలువెత్తు రూపంలా వ్యవహరించే నేతలు కొందరు కనిపిస్తారు. నిజాయితీకి నిలువెత్తు నిదర్శనంలా.. గాంధీమార్గాన్ని మాత్రమే అనుసరిస్తూ.. ఎమ్మెల్యే పదవి అంటే పవర్ స్టేషన్ కాదని.. ప్రజలకు బాధ్యతగా ఉండాల్సిన పదవిగా ఫీలయ్యే ఆ మాజీ ఎమ్మెల్యే  కథ ఇది.

ఆయన పేరు బాకేల శుక్రప్ప. కర్ణాటక బీజేపీ నేతగా అసెంబ్లీలో గతంలో అడుగు పెట్టారు. పది వేల ఓట్ల మెజార్టీతో విజయం సాధించిన ఆయన ఎమ్మెల్యేగా వ్యవహరిస్తూనే.. మరోవైపు తాను నిత్యం చేసుకునే కూలీ పనిని వదిలిపెట్టని విచిత్ర తత్త్వం ఆయన సొంతం. సుళ్య అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేసిన ఆయన.. ఎమ్మెల్యేగా పదవీ బాధ్యతలు చేప్టటిన స్వల్ప వ్యవధిలోనే బోలెడన్ని సంక్షేమ కార్యక్రమాలు అమలు చేయటమే కాదు.. తన నియోజకవర్గ రూపురేఖల్ని మార్చేశాడు. కేవలం 19 నెలల కాలంలో రెండు పీయూసీ కాలేజీలు.. ఐదు హైస్కూళ్లు.. నాలుగు హాస్టళ్లు.. ఆరు వంతెనలు.. మూడు రోడ్లు వేయించారు. ఎంతో పవిత్రంగా పదవి నిర్వహించి ఐదేళ్లకు దిగిపోయారు.

ఎమ్మెల్యేగా ఉన్నంత కాలం... ఆయన అసెంబ్లీకి బస్సులో మాత్రమే వచ్చేవారు. మాజీ అయ్యాక ప్రజా సేవ చేస్తూనే.. తనకు అలవాటైన కూలీ పనిని మాత్రం వదిలిపెట్టటం లేదు. ఇటీవల అనారోగ్యానికి గురై ఆసుపత్రిలో చేరారు. అయితే, చికిత్సకు ఆయనతో డబ్బులు లేవు. ఈ విషయం తెలుసుకున్న ప్రజలు ఆయనతో తమకు ఏ సంబంధం లేకపోయినా చందాలు వేసుకొని మొత్తం ఆస్పత్రి బిల్లును కట్టేశారు. ఆయన ఎంత మంచిపనులు చేయకపోతే జనం ఇలా ముందుకు కదిలి వస్తారు చెప్పండి.  అసలు ఈ కాలంలో ఇలాంటి దుస్థితిలో ఒక మాజీ ఎమ్మెల్యే ఉంటారని ఊహించగలమా..? గమనించాల్సింది ఏంటంటే... పదవి ఉన్నపుడు సంపాదించుకోకపోతే తర్వాత దిక్కులేని వాళ్లవుతాం అనుకునే ప్రజాప్రతినిధులు ఒక్కసారి ఆలోచించాలి. ప్రజలకు మంచి చేస్తే వాళ్లే కాపాడుకుంటారు మనల్ని.
Tags:    

Similar News