షాకింగ్‌.. స్వామీజీకి షాకిచ్చిన ముఖ్యమంత్రి!

Update: 2023-01-28 10:22 GMT
కర్ణాటకలో మరికొద్ది నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో ఆ రాష్ట్ర రాజకీయాలు వేడెక్కాయి. మరోమారు అధికారంలోకి రావాలని అధికార బీజేపీ ఉవ్విళ్లూరుతోంది. మరోవైపు ప్రతిపక్ష పార్టీలు కాంగ్రెస్, జేడీఎస్‌ సైతం అధికారం కోసం వ్యూహాలు పన్నుతున్నాయి.

కాగా కర్ణాటకలో మత పీఠాలు చాలా ఎక్కువ. కర్ణాటక రాజకీయాల్లో పీఠాధిపతులు కీలకపాత్ర పోషిస్తుంటారు. దీంతో పీఠాధిపతుల ఆశీస్సుల కోసం అన్ని పార్టీలు ప్రయత్నాలు చేస్తుంటాయి. ముఖ్యంగా అధికార బీజేపీ వచ్చే ఎన్నికల్లో విజయం కోసం ఈ పీఠాధిపతులనే నమ్ముకుంది.

ఈ నేపథ్యంలో కాగినెల మహాసంస్థానం కనకగురు పీఠాధిపతి ఈశ్వరానందపురి బీజేపీ ప్రభుత్వంపై చేసిన విమర్శలు హాట్‌ టాపిక్‌ గా మారాయి. అందులోనూ ఆయన ముఖ్యమంత్రి బవసరాజ బొమ్మై సమక్షంలోనే బీజేపీ ప్రభుత్వంపై ఘాటు వ్యాఖ్యలు చేయడంతో పీఠాధిపతి చేతిలోని మైకును స్వయంగా ముఖ్యమంత్రి లాక్కున్నారు. దీంతో ఈ ఘటన సోషల్‌ మీడియాలో వైరల్‌ గా మారింది.

మహదేవపురలో నిర్వహించిన బహిరంగ సభలో కాగినెల మహాసంస్థానం కనకగురు పీఠాధిపతి ఈశ్వరానందపురి మాట్లాడుతూ.. కర్ణాటకలో వర్షాలు కురిసిన సమయంలో ప్రజలు ఇబ్బంది పడ్డారన్నారు. అయినా అధికారులు ఏమాత్రం పట్టించుకోలేదని ఆరోపించారు. బెంగళూరులో మౌలిక సదుపాయాలకు తీవ్రమైన కొరత ఉందన్నారు.

నగరవాసులు ఇబ్బంది పడుతున్నా ప్రభుత్వం స్పందించడంలేదని విమర్శించారు. ముఖ్యమంత్రి కూడా గతంలో పలు హామీలు ఇచ్చారు అని ఈశ్వరానందపురి మాట్లాడుతుండగా వేదికపైనే ఉన్న సీఎం బసవరాజ బొమ్మై తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. వెంటనే స్వామీజీ చేతిలోని మైకును లాక్కున్నారు.

తాను కేవలం హామీలు ఇచ్చి మర్చిపోయే ముఖ్యమంత్రిని కాదని బసవరాజ బొమ్మై స్పష్టం చేశారు. తాను సమస్యను పరిష్కరించేందుకు శ్రమిస్తానని వెల్లడించారు. నిధులు కేటాయించామని.. పనులు జరుగుతున్నాయని గుర్తు చేశారు. ఇలా కాగినెల మహాసంస్థానం కనకగురు పీఠాధిపతి ఈశ్వరానందపురి విమర్శలను తిప్పి కొట్టారు. కాగా సీఎం బసవరాజ బొమ్మై మైకు లాక్కుంటున్న వీడియో సామాజిక మాధ్యమాలలో వైరల్‌గా మారింది. కర్ణాటకలో మరికొద్ది నెలల్లో ఎన్నికలు జరగనున్న వేళ ఈ ఘటన ప్రాధాన్యం సంతరించుకుంది.   



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.

Similar News