క‌న్న‌డ రాజ‌కీయాలు మ‌ళ్లీ హీట్..కాంగ్రెస్ కు రాజీనామా

Update: 2019-03-04 10:45 GMT
ఒక‌సారి క‌న్నుప‌డితే అంతే.. అనుకున్న‌ది ద‌క్కే వ‌ర‌కూ ఎన్ని ప్ర‌య‌త్నాలు అయినా చేయాల్సిందే. ఎన్ని ఎదురు దెబ్బ‌లు త‌గిని కోరింది ద‌క్కేంత‌వ‌ర‌కూ వ‌దిలి పెట్టే ప్ర‌సక్తే లేద‌న్న‌ట్లుగా ఉంది బీజేపీ తీరు. క‌న్న‌డ‌నాట కాషాయ జెండా ఎగ‌రాల‌న్న ప‌ట్టుద‌ల‌తో ఉన్న మోడీషా బ్యాచ్.. కాంగ్రెస్ జేడీఎస్ ప్ర‌భుత్వానికి నిద్ర లేకుండా చేస్తున్నారు. ఏ చిన్న అవ‌కాశాన్ని వ‌ద‌ల‌కుండా ప్ర‌భుత్వం సాఫీగా పాల‌న మీద దృష్టి పెట్ట‌లేని రీతిలో వారు చికాకులు సృష్టిస్తున్నారు.

ఏ నిమిషాన ఏం జ‌రుగుతుందోన‌న్న భావ‌న క‌ర్ణాట‌క ప్ర‌జ‌ల్లోనే కాదు.. రాజ‌కీయ ప‌క్షాల్లోనూ క‌లిగించ‌టంలో స‌క్సెస్ అయిన బీజేపీ నేత‌ల తాజా దౌత్యం పుణ్య‌మా అని.. కాంగ్రెస్ తిరుగుబాటు ఎమ్మెల్యేల్లో ఒక‌రైన ఉమేశ్ యాద‌వ్ తాజాగా త‌న ప‌ద‌వికి రాజీనామా చేశారు. సోమ‌వారం ఉద‌యం అసెంబ్లీ స్పీక‌ర్ ర‌మేశ్ కుమార్ ను క‌లిసి ఆయ‌న త‌న రాజీనామాను స‌మ‌ర్పించారు.

దీంతో.. కాంగ్రెస్ పార్టీలో క‌ల‌క‌లం రేగింది. చించోలీ నియోజ‌క‌వ‌ర్గం నుంచి రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన ఉమేశ్‌.. అంద‌రూ ఊహించిన‌ట్లే ఆయ‌న‌ బీజేపీలో చేర‌తార‌ని చెబుతున్నారు.  రానున్న లోక్ స‌భ ఎన్నిక‌ల్లో కాంగ్రెస్ సీనియ‌ర్ నేత మ‌ల్లికార్జున్ ఖ‌ర్గే మీద పోటీగా ఆయ‌న్ను దించాల‌ని బీజేపీ భావిస్తున్న‌ట్లు చెబుతున్నారు.

ఇటీవ‌ల జ‌రిగిన సీఎల్పీ స‌మావేశానికి న‌లుగురు ఎమ్మెల్యేలు గైర్హ‌జ‌రు కాగా.. వారిలో ఉమేశ్ ఒక‌రు కావ‌టం గ‌మ‌నార్హం. దీంతో.. మిగిలిన ముగ్గురు ఎమ్మెల్యేలు కూడా పార్టీ మారే అవ‌కాశం ఉంద‌న్న అభిప్రాయం వ్య‌క్త‌మ‌వుతోంది. ఇదిలా ఉంటే.. త‌మ పార్టీ ఎమ్మెల్యేను డ‌బ్బు ఎర‌వేసి పార్టీలోకి లాక్కున్న‌ట్లుగా కాంగ్రెస్‌.. జేడీఎస్ పార్టీ నేత‌లు మండిప‌డుతున్నారు.

ఈ ఆరోప‌ణ‌కు త‌గ్గ‌ట్లే ఈ మ‌ధ్య‌నే ఒక టేపు విడుద‌లై క‌ల‌క‌లం రేగింది. కర్ణాట‌క బీజేపీ అధ్య‌క్షుడు యాడ్యుర‌ప్ప మ‌ధ్య‌వ‌ర్తి ద్వారా ఒక జేడీఎస్ ఎమ్మెల్యేకు డ‌బ్బు ఎర వేస్తున్న విధానాన్ని తెలిపే ఆడియో ఒక‌టి బ‌య‌ట‌కు వ‌చ్చింది. ఈ నేప‌థ్యంలో తాజాగా కాంగ్రెస్ పార్టీకి చెందిన ఒక తిరుగుబాటు ఎమ్మెల్యే పార్టీకి గుడ్ బై చెప్పేయ‌టంతో క‌ర్ణాట‌క రాజ‌కీయాలు మ‌రోసారి వేడెక్కిన ప‌రిస్థితి.

Tags:    

Similar News