సీఎం గారి సెంటిమెంట్ డైలాగ్ విన్నారా?

Update: 2016-04-29 11:46 GMT
ముఖ్య‌మంత్రి పీఠం..ఒక రాజకీయ నాయ‌కుడి జీవితంలో అత్యున్న‌త ప‌ద‌విగా చెప్పుకొనే వాటిలో ప్ర‌థ‌మ స్థానం సీఎం కుర్చిదే. ఎన్నిక‌లు జ‌రుగుతున్న స‌మ‌యంలో, పైగా ప్ర‌తిప‌క్షంలో ఉన్న నాయ‌కుడికి ఈ కుర్చీపై ఎంత ప్రేమ ఉంటుందో ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు. అలాంటి భావోద్వేగంతోనే త‌మిళ‌నాడు మాజీ ముఖ్య‌మంత్రి -  డీఎంకే అధినేత క‌రుణానిధి ఎమోష‌న్ అయ్యారు. ఏకంగా క‌న్నీళ్లు పెట్టుకున్నారు.

'నా వయస్సు 92 ఏళ్లు.. తమిళనాడు ప్రజలే నా ఊపిరి.. నాకు ఎలాంటి ఆస్తి పాస్తుల్లేవు.. ఉన్నది ఇద్దరు భార్యలే.. మీరిచ్చిన ఊపిరితోనే ఇన్నాళ్లూ బతికాను.. ఇదే నా చివరి ఎన్నిక' అంటూ భావోద్వేగంతో కరుణానిధి ఎన్నికల ప్రచారంలో క‌న్నీళ్లు పెట్టుకున్నారు. డీఎంకే త‌ర‌ఫున సీఎం అభ్య‌ర్థిగా బ‌రిలో ఉన్న ఆయ‌న తాజాగా ప్ర‌జ‌ల ముందుకు వ‌చ్చి చ‌క్రాల కుర్చీలో మైకుతో ఈ త‌ర‌హాలో ఓట్లు అడ‌గ‌టం ఆస‌క్తిక‌రంగా మారింది. మరోపక్క కరుణానిధి కుమారుడు స్టాలిన్‌ రోడ్డుషోల ద్వారా ప్రచారం చేస్తున్నారు. సముద్రం తీరాన జాలర్లను - వాకింగ్‌ లో వృద్ధులను - మార్కెట్ లో మహిళలను - బార్బర్‌ షాపుల్లో యువతను స్వయంగా కలిసి ఓటును అభ్యర్థిస్తున్నారు. కరుణానిధి మాత్రం ఇదే తన చివరి ఎన్నికని, ఇక పోటీ చేసే ఓపిక లేదని హెలికాఫ్టర్లు - ఎన్నికల ఏసీ వాహనాల్లో తిరుగుతూ సభల్లో ప్రసంగిస్తున్న కుటుంబ సభ్యులందరినీ ప్రచారానికి ఉపయోగిస్తున్నారు.

అయితే సెంటిమెంట్‌ కు తమిళ ప్రజలు ఎక్కడ కరిగిపోతారోననే భయంతో ఏఐడీఎంకే అధినేత జయలలిత ఉచిత పథకాలను మరిన్ని ముందుకు తెచ్చి ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇందుకోసం ఏ పథకాలు ప్రవేశపెడితే మహిళలను - యువతను ఆకట్టుకోవచ్చనే యోచనలో అమ్మ బిజీగా ఉన్నారు. ఇప్పటికే అమ్మా టిఫిన్‌ - అమ్మా నీరు - అమ్మా టాయిలెట్స్‌ - అమ్మా లాప్‌ టాప్‌ - అమ్మా ఫ్యానులతో ఆకట్టుకున్నారు. ఈసారి అమ్మా మిక్సీ - అమ్మా కుక్కర్‌ - అమ్మా వాషింగ్‌ మిషన్‌ ఇచ్చి మహిళా ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇదిలా ఉండ‌గా మే మొదటివారంలో ఏఐసీసీ ఉపాధ్యక్షులు రాహుల్‌ గాంధీ రోడ్డుషో భారీ ఎత్తున నిర్వహించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. కరుణానిధి పోటీ చేస్తున్న తిరువారూర్‌ లో భారీ మెజార్టీ సాధించేందుకు సోనియాగాంధీ సభ నిర్వహించాలనే ప్రయత్నాలు జరుగుతున్నాయి.
Tags:    

Similar News