కోర్టు మెట్లు ఎక్కనున్న కరుణతో ‘అమ్మ’కు కష్టాలు

Update: 2016-01-15 06:51 GMT
తమిళనాడులో రాజకీయం కాస్త భిన్నంగా ఉంటుంది. అధికారంలో ఉన్న వారు సూపర్ పవర్ గా వ్యవహరించటం.. తమ వ్యతిరేకుల మీద తీవ్రస్థాయిలో విరుచుకుపడటమే కాదు.. అవసరమైతే వారిపై చర్యలకు సైతం వెనుకాడరు. ప్రతీకార రాజకీయాలు తమిళనాడులో ఏ రేంజ్లో ఉంటాయో గత చరిత్రే నిలువెత్తు నిదర్శనం. తాజాగా అలాంటి పరిణామాలు మరోసారి చోటు చేసుకునే పరిస్థితి.

అధికారంలో ఉన్న అమ్మ జయలలితకు విమర్శలన్నా.. ఆరోపణలన్నా అస్సలు సహించరు.. భరించలేరు. తనకు వ్యతిరేకంగా చేసే వ్యాఖ్యలపై ఆమె తీవ్రస్థాయిలో మండిపాటు ప్రదర్శించి.. తనపై ఆరోపణలు చేసినోళ్లను కోర్టుకు లాగుతుంటారు. ఈ తరహా వైఖరి కారణంగా ప్రస్తుతం తెమిళనాడులోని పలు మీడియా సంస్థలపై పెద్ద ఎత్తున కేసులున్న పరిస్థితి.

ఇటీవల మురసోలి పత్రికలో అచ్చేసిన ఒక కథనంలో పేర్కొన్న అంశాల ఆధారంగా డీఎంకే అధినేత కరుణ.. అమ్మ సర్కారు మీద.. జయలలిత మీద తీవ్ర విమర్శలు.. ఆరోపణలు చేశారు. తనపై చేసిన వాటిలో నిజం లేదంటూ జయలలిత కోర్టుకు వెళ్లారు. ఈ నేపథ్యంలో సోమవారం కరుణానిధి కోర్టుకు హాజరు కావాల్సి ఉంది. అయితే.. ఆయన కోర్టు వరకూ రాకుండా కూడా తన వాదనను కోర్టుకు వినిపించే వీలుంది. అయితే.. స్వయంగా కోర్టుకు హాజరు కావటం ద్వారా వచ్చే సానుభూతి భారీగా ఉంటుందన్న అంచనాలు వ్యక్తమవుతున్నాయి.

కేవలం విమర్శలు చేస్తేనే కోర్టుకు లాగుతున్న వైఖరిపై ప్రజల్లో సానుభూతితో పాటు.. ఈ అంశంపై చర్చ జరగాలన్నదే కరుణ లక్ష్యంగా చెబుతున్నారు. ఇందుకోసమే..  ఇంత పెద్ద వయసులో.. అనారోగ్యంగా ఉన్నా కూడా కోర్టు మెట్లు ఎక్కాలని నిర్ణయించినట్లుగా చెబుతున్నారు. కరుణ కోర్టు మెట్లు ఎక్కితే అమ్మకు కొత్త కష్టాలు షురూ అయినట్లేనన్న మాటను రాజకీయ వర్గాలు పేర్కొంటున్నాయి. మరి.. వారి అంచనాల్లో నిజం ఎంతన్నది కాలమే చెప్పాలి.
Tags:    

Similar News