భార‌తీయుల ర‌క్తం మ‌రిగే మాట పేల్చాడు

Update: 2017-11-16 08:07 GMT
దేశ సార్వ‌భౌమాధికారాన్ని ప్ర‌శ్నించేలా మాట్లాడ‌టం ఏ దేశంలోనూ క‌నిపించ‌దు. దుర‌దృష్ట‌మైన విష‌యం ఏమిటంటే.. ప్ర‌జాస్వామ్యం పేరుతో కొంద‌రు నేత‌లు.. సామాన్యులు హ‌ద్దులు దాటేస్తారు. వీరి నోట్లో నుంచి వ‌చ్చే మాటల వ‌ల్ల దేశానికి జ‌రిగే న‌ష్టం అంతా ఇంతా కాదు. ఇష్టం వ‌చ్చిన‌ట్లుగా మాట్లాడే సామాన్యుడితో క‌లిగే న‌ష్టం పోలిస్తే.. కీల‌క నేత నోటి నుంచి ఇదే త‌ర‌హాలో మాట‌లు వ‌స్తేనే ఇబ్బంది అంతా.

జ‌మ్ముకశ్మీర్ రాష్ట్రానికి ముఖ్య‌మంత్రిగా వ్య‌వ‌హ‌రించిన నేష‌న‌ల్ కాన్ఫ‌రెన్స్ అధినేత ఫ‌రూఖ్ అబ్దుల్లా అంద‌రికి సుప‌రిచితుడే. ఆయ‌న నోటి నుంచి వ‌చ్చే మాట‌లు ఇబ్బందిగా ఉంటాయి. కశ్మీర్ లో కూర్చొని ఇష్టం వ‌చ్చిన‌ట్లుగా మాట్లాడే ఆయ‌న‌.. తాను ఉన్న‌ది భార‌త‌దేశంలో భాగ‌మైన క‌శ్మీర్ అన్న విష‌యాన్ని గుర్తుంచుకుంటే మంచిది. నిజానికి ఆయ‌న ఆ విష‌యాన్ని మ‌ర్చిపోయి చాలా రోజులు అయ్యింది.

దుర‌దృష్ట‌క‌ర‌మైన విష‌యం ఏమిటంటే.. దేశానికి ఇబ్బంది క‌లిగేలా మాట్లాడినా  చ‌ట్టం నుంచి ఎలాంటి రియాక్ష‌న్ ఉండ‌ని ప‌రిస్థితి. ఒక సామాన్యుడు ఫేస్ బుక్ లో ఏదైనా వ్యాఖ్య చేసిన మ‌రుక్ష‌ణం అత‌డిపై పోలీసులు కేసు న‌మోదు చేసి.. ఆ వెంట‌నే అదుపులోకి తీసుకుంటారు. మ‌రి..  దేశ సార్వ‌భౌమాధికారానికి సంబంధించి వివాదాస్ప‌ద వ్యాఖ్య‌లు చేసినా ఆయ‌న‌పై ఎలాంటి చ‌ర్య‌లు ఎందుకు ఉండ‌వ‌న్న స‌గ‌టుజీవికి ఎదుర‌య్యే ప్ర‌శ్న‌.

మొన్న‌టికి మొన్న పాక్ అక్ర‌మిత క‌శ్మీర్ భార‌త్ లో అంత‌ర్భాగం కాదంటూ వ్యాఖ్య‌లు చేసిన అబ్దుల్లా.. తాజాగా మ‌రింత వివాదాస్ప‌ద వ్యాఖ్య‌లు చేశారు. పీవోకే విష‌యంలో చూస్తూ ఊరుకోవ‌టానికి పాకిస్థాన్ గాజులు తొడుక్కోలేదంటూ బారాముల్లాలో నోరు పారేసుకున్నారు. త‌న‌కు జీవితాన్ని ఇచ్చిన గ‌డ్డ‌కు.. తాను ప్రాతినిధ్యం వ‌హిస్తున్న దేశానికి వ్య‌తిరేకంగా ఆయ‌న అలా మాట్లాడ‌టం.. అది కూడా భార‌త గ‌డ్డ మీద నుంచే ఆయ‌న మాట్లాడ‌టాన్ని బ‌రితెగింపు అనాలేమో?

ఆయ‌న నోరు పారేసుకోవ‌టం అక్క‌డి ఆగ‌లేదు. యుద్ధం గురించి ఆలోచించే ముందు ఇక్క‌డ మ‌నుషులుగా బ‌త‌గ్గ‌ల‌మా అని ఆలోచించాల‌ని.. పీవోకే భార‌త్ లో అంత‌ర్బాగ‌మ‌ని ఇంకా ఎంత‌కాలం చెబుతూ వ‌స్తారంటూ నోరు పారేసుకున్నారు. 70 ఏళ్లు గ‌డిచిపోయాయ‌ని.. ఇంకా పీవోకేను సొంతం చేసుకోలేక‌పోయామ‌ని.. పీవోకే ముమ్మాటికి పాకిస్థాన్ లో అంత‌ర్బాగ‌మే అన్న జ‌మ్ముక‌శ్మీర్ మాజీ ముఖ్య‌మంత్రి మాట‌లు ఇప్పుడు కొత్త  చ‌ర్చ‌కు తెర తీస్తున్నాయి. నిజ‌మే.. పీవోకే చేజారి 70 ఏళ్లు అయ్యింది. ఫ‌రూక్ లాంటి రాజ‌కీయ నేత‌ల కార‌ణంగానే పీవోకే పాక్ అక్ర‌మ‌ణ‌లో ఉంది. లేకుంటే.. విష‌యం మ‌రోలా ఉండి ఉండేద‌ని చెప్ప‌క త‌ప్ప‌దు.
Tags:    

Similar News