నగరం నడిబోడ్డున అడవి లాంటి పార్కు

Update: 2015-03-18 05:10 GMT
అడవి అనగానే దట్టమైన చెట్లు.. విభిన్నమైన జంతుజాలంతో అలరారటం తెలిసిందే. హైదరాబాద్‌ మహానగరం నడిబడ్డున అడవి లాంటి పార్కు సాధ్యమేనా? ఒకవేల అడవిని తలపించేలా చెట్లు పెంచినా.. అందులో విభిన్నమైన జంతుజాలాన్ని పెంచటం సాధ్యమేనా? అంటే సందేహమే అని చెబుతారు.

కానీ.. ఆ అభిప్రాయం తప్పుని చెబుతోంది బంజారాహిల్స్‌లోని కాసు బ్రహ్మానందరెడ్డి నేషనల్‌ పార్కు. ఇప్పుడీ పార్కులోని జంతుజాలాన్ని చూసిన అధికారులే కాదు.. ఆ పార్కుకు రెగ్యులర్‌గా వెళ్లే వారు సైతం ఔరా.. అంటూ ఆశ్చర్యపోవటం కనిపిస్తోంది.

కాంక్రీట్‌ జంగిల్‌ లాంటి నగరంలో నడిబడ్డున నిజమైన అడవి లాంటి పార్కు ఉండటం హైదరాబాద్‌ విలక్షణతకు చిహ్నమేమో. నిత్యం ప్రముఖలతో సందడి సందడిగా ఉండే కాసు బ్రహ్మానందరెడ్డి పార్కులో ఉన్న జంతుజాలంపైనా.. వృక్షాలపైనా లెక్కింపు జరిపారు.

ఈ లెక్క ఆసక్తికరమైన విషయాల్ని వెల్లడించింది. ఈ పార్కులో వృక్ష సంపదతో పాటు.. జంతుజాలం కూడా అనూహ్యంగా అభివృద్ధి చెందటం ఆశ్చర్యానికి గురి చేస్తుంది.

వృక్షాలతో పాటు.. విలక్షణమైన జంతుజాలానికి సంబంధించి లెక్కను చూసిన ప్రతి ఒక్కరూ ఇదే అభిప్రాయానికి గురి కావటం ఖాయం. ఈ పార్కులో 460 నెమళ్లు ఉన్నట్లు గుర్తించారు. 70 రకాల పాము జాతులు ఉన్నట్లు లెక్క తేల్చారు. ఈ పాముల్లో పంగోలిన్‌ అనే అరుదైన సర్పం ఉన్నట్లు గుర్తించారు. అంతేకాదు.. పలురకాల విష సర్పాలు ఈ పార్కులో ఉన్నాయని గుర్తించిన అధికారులు.. ఈ పార్కులో 130 రకాల పక్షి జాతులు ఉన్నట్లు చెబుతున్నారు.

50 అడవి పందులు.. 20 రకాల సీతాకోకచిలుకలు.. 100 కుందేళ్లు ఉన్నాయని ఇటీవల తాము జరిపిన లెక్కల్లో తేలిందంటున్నారు. క్రూర మృగాలైన సింహం.. పులి.. ఏనుగు లాంటివి తప్పించి.. ఓ మోస్తరు జంతువులు ఈ పార్కులో ఉన్నాయన్న మాట. ఇటీవలే ఒక కొండ చిలువ పార్కు నుంచి బయటకు వచ్చి రోడ్డుపైన వెళుతుండటం చూసిన కొందరు.. దాన్ని పట్టుకొని మళ్లీ పార్కులో వదిలేసిన విషయన్ని గుర్తు చేస్తున్నారు. మొత్తానికి నగరం నడిబడ్డున పార్కులాంటి అడవి ఉండటం గొప్పే కదూ.

Tags:    

Similar News