కాంగ్రెస్ నుంచి క‌త్తి కార్తీక పోటీ చేసేది అక్క‌డేనా..?

Update: 2022-07-21 02:30 GMT
తెలంగాణ‌లో అధికార‌మే ల‌క్ష్యంగా దూసుకుపోతున్న కాంగ్రెస్ పార్టీలో చేరికలు ఊపందుకున్నాయి. ఎన్నిక‌ల‌కు ఏడాదికి పైగా స‌మ‌యం ఉండ‌గానే ఆయా నియోజ‌క‌వ‌ర్గాల్లో నేత‌లు క‌ర్చీఫ్ వేసుకుంటున్నారు. త‌మకు అనువుగా ఉన్న స్థానంపై క‌న్నేసిన నేత‌లు పెద్ద‌ల దృష్టిలో ప‌డేందుకు శ్ర‌మిస్తున్నారు. అందులో భాగంగా ఆ నియోజ‌క‌వ‌ర్గం నుంచి పోటీ చేసే ఉద్దేశంతో క‌త్తి కార్తీక ఇటీవ‌ల కాంగ్రెసులో చేరిన‌ట్లు తెలుస్తోంది.

క‌త్తి కార్తీక పేరు తెలంగాణ ప్ర‌జానీకానికి సుప‌రిచిత‌మే. తెలంగాణ యాస‌తో మాట్లాడి అంద‌రినీ ఆక‌ట్టుకుంటారు. తొలుత రేడియో జాకీగా.. ఆ త‌ర్వాత ప‌లు టీవీ చాన‌ళ్ల‌లో జ‌ర్న‌లిస్టుగా ప‌నిచేసి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. లండ‌న్ లో ఉన్న‌త విద్య పూర్తి చేసి ఆర్కిటెక్ గా ప‌నిచేశారు. వ్యాఖ్యాత‌గా పేరొందిన కార్తీక ఇటీవ‌ల రాజ‌కీయాల వైపు ఆస‌క్తి చూపించారు. దుబ్బాక ఉప ఎన్నిక‌లో ఆల్ ఇండియా ఫార్వార్డ్ పార్టీ త‌ర‌పున పోటీ చేసి ఓడిపోయారు.

ఆ త‌ర్వాత‌ బీజేపీలో చేరిన కార్తీక ఇటీవ‌ల కాంగ్రెస్ రాజ‌కీయాల ప‌ట్ల ఆక‌ర్షితులై పార్టీ అధ్య‌క్షుడు రేవంత్ స‌మ‌క్షంలో హ‌స్తం కండువా క‌ప్పుకున్నారు. అయితే ఆమె పార్టీలో చేరిన ప్ర‌ధాన ఉద్దేశం వ‌చ్చే ఎన్నిక‌ల్లో దుబ్బాక నుంచి పోటీ చేయ‌డ‌మేన‌ని తెలుస్తోంది. ప్ర‌స్తుత ఎమ్మెల్యే ర‌ఘునంద‌న్ రావుపై పోటీ చేయించేందుకు టీపీసీసీ పెద్ద‌లు సుముఖంగా ఉన్న‌ట్లు స‌మాచారం. అయితే ఈ సంఘ‌ట‌న‌తో ఇప్ప‌టికే అక్క‌డ ప‌నిచేసుకుంటున్న చెరుకు శ్రీ‌నివాస్ రెడ్డి అయోమ‌యంలో ప‌డిపోయారు.

ఉమ్మ‌డి ఏపీలో వ్య‌వ‌సాయ రంగంలో కీల‌క సంస్క‌ర‌ణ‌లు తెచ్చిన మాజీ మంత్రి చెరుకు ముత్యంరెడ్డి కుమారుడే శ్రీ‌నివాస్ రెడ్డి. విదేశాల్లో విద్య‌న‌భ్య‌సించిన ఈయ‌న తండ్రి మ‌ర‌ణంతో రాజ‌కీయాల్లోకి అడుగుపెట్టారు. దుబ్బాక మాజీ ఎమ్మెల్యే సోలిపేట రామ‌లింగా రెడ్డి మ‌ర‌ణంతో వ‌చ్చిన ఉప ఎన్నిక‌లో టీఆర్ఎస్ నుంచి టికెట్ రాక‌పోవ‌డంతో చివ‌రి నిమిషంలో కాంగ్రెస్ లో చేరి పోటీ చేశారు. అయినా మూడో స్థానానికి ప‌రిమితం అయ్యారు.

ఇక అప్ప‌టి నుంచి కాంగ్రెస్ పార్టీనే అంటిపెట్టుకొని ప‌నిచేసుకుంటున్నారు. ఇటీవ‌ల పార్టీ ఆధ్వ‌ర్యంలో చేప‌ట్టిన ర‌చ్చ‌బండ కార్య‌క్ర‌మాల్లో చురుగ్గా పాల్గొంటూ అన్ని గ్రామాలూ ప‌ర్యటిస్తూ పార్టీని బ‌లోపేతం చేస్తున్నారు. వ‌చ్చే ఎన్నిక‌ల్లో టికెట్ త‌న‌కేన‌న్న ధీమాతో ఉన్నారు ఇన్ని రోజులు. ఇపుడు క‌త్తి కార్తీక ఎంట్రీ ఇవ్వ‌డంతో త‌న ప‌రిస్థితి డోలాయ‌మానంలో ప‌డింది. బీసీ మ‌హిళ గౌడ సామాజిక వ‌ర్గానికి చెందిన కార్తీక‌కు టికెట్ ఇస్తారా లేదా శ్రీ‌నివాస్ రెడ్డినే కొన‌సాగిస్తారా అనేది వేచి చూడాలి.
Tags:    

Similar News