ఏపీకి వెళ్లే వారికి కావేరీ ట్రావెల్స్ టెన్షన్

Update: 2019-04-10 05:09 GMT
ఏపీలో జరుగుతున్న ఎన్నికల్లో ఓటు వేసేందుకు హైదరాబాద్ మహా నగరం నుంచి తక్కువలో తక్కువ 10 లక్షల మంది ఓటర్లు ఆంధ్రప్రదేశ్ కు పయనమవుతున్న వైనం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. వాస్తవానికి ఏపీకి వెళ్లే ఓటర్ల సంఖ్య మరింత ఎక్కువగా ఉంటుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.  ఏపీలోని తమ ఓటు వేసేందుకు వీలుగా ఇప్పటికే పెద్ద ఎత్తున ట్రైన్లు.. బస్సుల్లో టికెట్లను బుక్ చేసుకున్న వారు వేలాదిగా ఉంటే.. ప్రైవేటు వాహనాల్లో ప్రయాణాన్ని ప్లాన్ చేసుకున్న వారి సంఖ్య భారీగా ఉన్నట్లు తెలుస్తోంది.

ఇదిలా ఉంటే.. ప్రైవేటు బస్సుల్లో టికెట్లు బుక్ చేసుకున్న వారికి ఝులక్ ఇస్తూ కావేరీ ట్రావెల్స్ సంస్థ  తాము సర్వీసులు నడపలేకపోతున్నట్లుగా బస్సుల్ని క్యాన్సిల్ చేస్తున్నట్లుగా మెసేజ్ లు పంపటం ఇప్పుడు సంచలనంగా మారింది. అయితే.. ఇదంతా కుట్ర పూరితంగా సాగుతుందన్న ప్రచారం నడస్తోంది. అయితే.. ఇందులో ఎలాంటి కుట్ర లేదన్న విషయాన్ని గుర్తించాల్సి అవసరం ఉంది.

కావేరీ ట్రావెల్స్ తప్పించి.. మిగిలిన ఏ ప్రైవేటు బస్సు సర్వీసులకు సంబంధించిన బస్సులు రద్దు కావట్లేదన్న విషయాన్ని మర్చిపోకూడదు. ఇక.. ఏపీఎస్సీ ఆర్టీసీ.. టీఆర్టీలు రెండు ఏపీకి ప్రత్యేకంగా బస్ సర్వీసుల్ని వేశారు. ఇక.. ప్రైవేటు ట్రావెల్స్ యజమానులు సైతం భారీ ఎత్తున బస్సు సర్వీసుల్ని పెంచినట్లుగా తెలుస్తోంది. ఇక. కావేరీ ఇష్యూకు వస్తే.. ఈ సంస్థకు సంబంధించిన పార్టనర్స్ మధ్య నెలకొన్న విభేదాలతే సర్వీసులు కాన్సిల్ కావటానికి కారణంగా చెబుతున్నారు.

ఆర్టీవోకు చెల్లించాల్సిన పన్నుల బకాయిలే సర్వీసులు రద్దుకు కారణంగా తెలుస్తోంది. నిజానికి కావేరీ ట్రావెల్స్ బస్సులు గడిచిన ఐదు రోజులుగా కొన్ని సర్వీసుల్ని రద్దు చేసింది.  ఈ సంస్థకు చెందిన కొన్ని బస్సులు నడుస్తుండగా.. మరికొన్ని మాత్రంరద్దు అవుతున్నాయి. ఇదంతా పార్టనర్స్ మధ్య నెలకొన్న విభేదాలే తప్పించి మరే కారణం లేదని చెబుతున్నారు. అయితే.. గోరంతల్ని కొండతలు చేసే బ్యాచ్ ఒకటి కావేరీ ట్రావెల్స్ కు సంబంధించిన కొన్ని బస్సుల్ని రద్దు చేయగా.. ఏదో కుట్ర జరిగిపోతున్నట్లుగా ప్రచారం చేస్తున్నారు. ఈ ప్రచారానికి టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. కాకుంటే.. ముందస్తు జాగ్రత్తగా ఏపీకి వెళ్లి ఓటు వేయాలని భావిస్తున్న ఓటర్లు తాము బుక్ చేసుకున్న సర్వీసులకు సంబంధించి లేటెస్ట్ సమాచారాన్ని ఒక్కసారి చెక్ చేసుకుంటే అనవసరమైన టెన్షన్లు ఉండవన్నది మర్చిపోకూడదు.

Tags:    

Similar News