బ్యాడ్ టైం అంటే ఇదే.. కోర్టుకు కవిత

Update: 2020-02-28 03:30 GMT
గులాబీ దళపతి, తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు తనయ, నిజామాబాద్ మాజీ ఎంపీ కల్వకుంట్ల కవితకు ఇప్పుడు నిజంగానే బ్యాడ్ టైం నడుస్తోందని చెప్పాలి. మొన్నటి సార్వత్రిక ఎన్నికల్లో ఊహించని విధంగా నిజామాబాద్ లో బీజేపీ యువనేత ధర్మపురి అరవింద్ చేతిలో ఓటమి దక్కడంతో దాదాపుగా రాజకీయాలకే దూరమైనట్లుగా కనిపిస్తుండగా... తాజాగా ఆమె ఓ కేసులో ఏకంగా కోర్టు మెట్లెక్కక తప్పలేదు. గురువారం నాంపల్లిలోని ప్రత్యేక న్యాయస్థానం ముందు ఆమె హాజరయ్యారు.

అటు తెలంగాణ తో పాటు ఇటు ఏపీలోనూ ఆసక్తి రేకెత్తించిన ఈ ఘటన వివరాల్లోకి వెళితే... తెలంగాణ ఉద్యమం సాగుతున్న సమయంలో 2010లో నిజామాబాద్‌ ఉపఎన్నికల సందర్భంగా నిజామాబాద్ జిల్లా ఎస్పీ కార్యాలయం ఎదుట కవిత తన అనుచరులతో కలిసి ధర్నాకు దిగారు. ఎన్నికల కోడ్ అమల్లో ఉండగా.. దానిని ఉల్లంఘిస్తూ కవిత ధర్నా చేసినట్టు గా పోలీసులు కవిత తో పాటుగా మరో నలుగురి పై కేసు నమోదు చేశారు. ఈ కేసులో కవితను ఏ1గా పోలీసులు కేసు నమోదు చేశారు. ఇన్నేళ్లుగా నిజామాబాద్ కోర్టులోనే ఉన్న ఈ కేసు తాజాగా హైదరాబాద్ నాంపల్లిలోని ప్రత్యేక కోర్టుకు బదిలీ అయ్యింది. గురువారం నాంపల్లి ప్రత్యేక కోర్టు లో ఈ కేసుపై విచారణ జరగగా.. కవిత కోర్టుకు హాజరు కాక తప్పలేదు.  దీనిపై విచారణ చేపట్టిన న్యాయస్థానం కేసును వచ్చే నెల 19కి వాయిదా వేసింది.

రాజకీయంగా తీవ్ర ఇబ్బందికర పరిస్థితులను ఎదుర్కొంటున్న కవిత కు ఈ కేసు నిజంగానే మరో పెద్ద ఇబ్బందిగానే మారి పోయిందని చెప్పక తప్పదు. ఎంపీగా ఓటమిని జీర్ణించుకోలేక దాదాపుగా బయటకు రావడమే తగ్గించేసిన కవిత... రాజకీయాల నుంచి తప్పుకుంటారా? అన్న దిశగానూ ఆసక్తికర చర్చ సాగుతోంది. అయితే తన కూతురును ఎలాగైనా తిరిగి రాజకీయాల్లో యాక్టివేట్ చేసేందుకు కేసీఆర్ ఎప్పటికప్పుడు యత్నిస్తూనే ఉన్నా... పరిస్థితులు అనుకూలించడం లేదు. ఇలాంటి ఇబ్బందికర పరిస్థితుల నేపథ్యంలో ఎప్పుడో 2010లో నమోదైన కేసు విచారణకు కవిత కోర్టు మెట్లెక్కాల్సి రావడం చూస్తుంటే... ఆమెను ఇంకా బ్యాడ్ టైం వెంటాడుతోందన్న వాదనలు ఆసక్తి రేకెత్తిస్తున్నాయి.
Tags:    

Similar News