అన్న సింహం అంటే.. చెల్లెలు వార్ అంట

Update: 2018-09-28 11:55 GMT
మూర్తీభివించిన ఆత్మ‌విశ్వాసానికి కేరాఫ్ అడ్రస్ గా నిలుస్తున్నారు కేసీఆర్ కుటుంబ స‌భ్యులు. మైకు క‌నిపిస్తే చాలు.. చెల‌రేగిపోతున్నారు. రానున్న ఎన్నిక‌ల్లో దంచి పారేస్తామ‌ని చెబుతున్నారు. ఎన్నిక‌ల్లో త‌మ‌ను ఢీ కొట్టే మొన‌గాడే లేడ‌న్న‌ట్లుగా వ్యాఖ్య‌లు చేయ‌టం కేసీఆర్ ఫ్యామిలీలో అంత‌కంత‌కూ పెరుగుతోంది.

ఈ మ‌ధ్య‌నే అన్న ఏమో కేసీఆర్ సింహంగా అభివ‌ర్ణిస్తే.. తాజాగా ఆయ‌న సోద‌రి క‌మ్ ఎంపీ క‌విత‌.. వార్ వ‌న్ సైడే అంటూ గ‌ర్జిస్తున్నారు. ఇలా అన్నా చెల్లెళ్లు రెట్టించిన ఉత్సాహంతో ప్ర‌త్య‌ర్థుల‌పై చెల‌రేగిపోవ‌టం ఇప్పుడు ఆస‌క్తిక‌రంగా మారింద‌ని చెప్ప‌క త‌ప్ప‌దు.

తాజాగా అదేతీరును ప్ర‌ద‌ర్శించారు ఎంపీ క‌విత‌. తాజాగా నిజామాబాద్ లో నిర్వ‌హించిన బ‌హిరంగ స‌భ‌ను ఉద్దేశించి మాట్లాడిన ఎంపీ క‌విత‌.. అసెంబ్లీ ఎన్నిక‌ల్లో వార్ వ‌న్ సైడేన‌ని తేల్చేశారు. టీడీపీ పుట్టిందే కాంగ్రెస్ వ్య‌తిరేకంగా అని.. అలాంటిది రెండు పార్టీలు జ‌త‌క‌ట్ట‌టం అనైతిక‌మ‌ని ఆమె ఫైర్ అయ్యారు.

నిజ‌మే.. అలాంటి డీల్స్ విష‌యంలో చేస్తే గీస్తే కేసీఆర్ లాంటి బ‌డా ఉద్య‌మ‌కారుడు చేయాలే కానీ.. బాబు.. కాంగ్రెస్ లాంటి పార్టీలు చేసుడేంది?  అన్న క్వ‌శ్చ‌న్ ను మ‌ర్చిపోకూడ‌దు క‌దా. 2004లో కాంగ్రెస్‌ తో 2009లో టీడీపీతో జ‌త క‌ట్ట‌టానికి టీఆర్ ఎస్ కు పెద్ద లాజిక్కులు అవ‌స‌రం లేదు. ఆయా స‌మ‌యాల్లో మిత్రుల్లోని సైద్దాంతికి తేడాలు టీఆర్ ఎస్ నేత‌ల క‌ళ్ల‌కు అస్స‌లు క‌నిపించ‌వు.

తాను వేర్వేరుగా పొత్తులు పెట్టుకున్న రెండు పెద్ద‌పార్టీలు ఈ రోజున క‌లిసి త‌న‌పై పోరాటం చేయ‌టాన్ని క‌విత అస్స‌లు జీర్ణించుకోలేక‌పోతున్నారు. ఈ ఆగ్ర‌హంతోనే కావొచ్చు తాజాగా ఒక రేంజ్లో విరుచుకుప‌డుతున్నారు. టీడీపీ.. కాంగ్రెస్ లు త‌మ సిద్ధాంతాల్ని ప‌క్క‌న పెట్టేశాయ‌ని.. రానున్న ఎన్నిక‌ల్లో ప్ర‌భంజ‌నం సృష్టిస్తామ‌ని ఆమె ధీమా వ్య‌క్తం చేస్తున్నారు.

కానీ.. ఇప్పుడు మాత్రం ఆ రెండు పార్టీలు క‌ల‌వ‌టాన్ని ఆమె తీవ్రంగా త‌ప్పు ప‌డుతున్నారు. పొత్తుల్ని పార్టీ నేత‌లే జీర్ణించుకోలేన‌ప్పుడు ప్ర‌జ‌లు ఎలా ఆమోదిస్తార‌ని చెప్పిన క‌విత‌.. మ‌హాకూట‌మిలోని అప‌విత్ర పొత్తును ప్ర‌జ‌లు తిప్పి కొడ‌తార‌న్న ఆశాభావాన్ని వ్య‌క్తం చేస్తున్నారు. మ‌రి.. క‌విత అంచ‌నా ఎంత‌వ‌ర‌కూ నిజ‌మ‌వుతుందో కాల‌మే స‌మాధానం చెప్పాలి.
Tags:    

Similar News