కేసీఆర్ రాజ‌కీయ వార‌స‌త్వంపై క‌విత‌ క్లారిటీ

Update: 2016-02-06 14:22 GMT
తెలంగాణ రాష్ట్ర ముఖ్య‌మంత్రి, టీఆర్ ఎస్ అధినేత క‌ల్వ‌కుంట్ల చంద్ర‌శేఖ‌ర్ రావు రాజ‌కీయ వార‌స‌త్వంపై క్లారిటీ వ‌చ్చేసింది. ఇన్నాళ్లు కుటుంబ పాల‌న అంటూ కేసీఆర్ మేన‌ల్లుడు టి.హ‌రీశ్‌ రావు - కుమారుడు కేటీఆర్‌ - కూతురు క‌విత‌ల మ‌ధ్య విశ్లేష‌ణ‌లు చేస్తూ వార‌సుడు ఎవ‌ర‌నే దానిపై చ‌ర్చోప‌చ‌ర్చ‌లు సాగాయి. అయితే తాజాగా సీఎం కేసీఆర్ కూతురు - నిజామాబాద్ ఎంపీ క‌విత ఈ చ‌ర్చ‌ల‌కు ఫుల్‌ స్టాప్ పెట్టారు.

త‌మ పార్టీ అధినేత - సీఎం కేసీఆర్ రాజ‌కీయ వార‌సుడు త‌న సోద‌రుడు కేటీఆరేన‌ని చెప్పారు. గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల బాధ్యతలను సీఎం కేసీఆర్ ఆదేశాల మేర‌కు భుజాన వేసుకొని కేటీఆర్ సమర్థవంతంగా పార్టీని విజ‌య‌తీరాల‌కు చేర్చాడ‌ని కితాబిచ్చారు. గ్రేటర్ హైదరాబాద్ ఎన్నిక‌ల సంద‌ర్భంగా తాము ప‌రిస్థితులు చూసిన మేర‌కు రాజకీయంగా చాలా మార్పు స్ప‌ష్టంగా క‌నిపించింద‌ని కవిత అభిప్రాయ‌ప‌డ్డారు. నగరంలో అన్ని వర్గాల వారు టీఆర్ ఎస్ కు ఓటేశారని, అందుకే ఇంతటి భారీ విజయం దక్కిందని పేర్కొంటూ వారికి ప్ర‌త్యేక కృత‌జ్ఞ‌త‌లు తెలిపారు.

గ్రేట‌ర్ ఎన్నిక‌ల బాధ్య‌త‌లను కేటీఆర్ భుజాన పెట్టిన‌పుడే కేసీఆర్ త‌న‌ వార‌సుడిగా పరోక్షంగా  చెప్పిన‌ట్ల‌యిందని రాజ‌కీయ వ‌ర్గాలు మొద‌ట్లోనే అంచ‌నావేశాయి. తాజాగా ఎంపీ క‌విత ఈ విష‌యంలో క్లారిటీ ఇచ్చిన నేప‌థ్యంలో ఇక వార‌స‌త్వ రాజ‌కీయాల‌కు తెలంగాణ కూడా మ‌రో అడ్ర‌స్‌ గా మారిన‌ట్ల‌యింది.
Tags:    

Similar News