కేసీఆర్ దత్తకుమార్తెకు అధికారుల ‘కౌన్సెలింగ్’

Update: 2016-05-04 05:16 GMT
కేసీఆర్ దత్త కుమార్తె ప్రత్యూష లవ్ మ్యాటర్ ఇప్పుడు పలు మలుపులు తిరుగుతోంది. తండ్రి చేత.. సవతి తల్లి చేతుల్లో చిత్రహింసలకు గురై.. చావు ముంగిట వరకూ వెళ్లి.. ఆమె ఉండే ఇంటి దగ్గరి ఇరుగుపొరుగు సమాచారంతో ప్రత్యూష దయనీయ ఉదంతం బయటకు రావటం.. మీడియాలో బాగా ఫోకస్ కావటం తెలిసిందే. ప్రత్యూష ఉదంతం విని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ సైతం కదిలిపోయి..ఆమెను తన దత్త పుత్రికగా చెబుతూ.. ఆమె బాగోగులు తానే స్వయంగా చూసుకుంటానని చెప్పటం తెలిసిందే.

ప్రత్యూషను తన ఇంటికి ఆహ్వానించి.. ఆమెకు భరోసాను ఇవ్వటమే కాదు.. తాను అండగా ఉంటానని చెప్పటం తెలిసిందే. ఇప్పుడదే ప్రత్యూష లవ్ లో పడటం.. ప్రేమించిన వ్యక్తిని పెళ్లాడతానని బలంగా చెప్పటం.. ఇది కాస్తా మీడియాలోకి రావటం తెలిసిందే. ఈ వ్యవహారం మీడియాలోకి రావటంతో ఇంటెలిజెన్స్ అధికారులు.. ప్రత్యూష ప్రేమికుడి వివరాలు సేకరించే పని మొదలెట్టారు. చివరకు అతనిని కర్నూలుజిల్లా ఆళ్లగడ్డకు చెందిన మద్దిలేటిగా గుర్తించారు. ఒక షాపులో గుమస్తాగా అతను పని చేస్తున్న విషయాన్ని అధికారులు నిర్దారించారు.

తండ్రి.. సవతి తల్లి చేతుల్లో దారుణ చిత్రహింసలకు గురైన ప్రత్యూష.. ఆ నరకం నుంచి బయటపడినప్పుడు.. తాను నర్సింగ్ కోర్సు చేస్తానని చెప్పటం తెలిసిందే. ఇటీవల ఇంటర్ పాస్ అయిన ప్రత్యూష.. తనకు ముందు పెళ్లి చేయాలని.. తాను పెళ్లి చేసుకున్న తర్వాత చదువుకుంటానని చెప్పటంతో అధికారులు తల పట్టుకునే పరిస్థితి. మూములుగా అయితే ఈ విషయం ఎలా ఉండేదోకానీ.. ప్రత్యూషకు గార్డియన్ గా తెలంగాణ ముఖ్యమంత్రే ఉండటంతో అధికారులు ఈ మ్యాటర్ మీద ఆచితూచి అడుగులేస్తున్నారు. ముందు కోర్సు పూర్తి చేయాలని అధికారులు చెబుతుంటే.. తాను హాస్టల్ లో ఉండలేకపోతున్నానని.. తాను ప్రేమించిన వ్యక్తిని పెళ్లాడి.. చదువు పూర్తి చేస్తానని.. తానిప్పుడు మేజర్ ని అని.. తనకు 20 ఏళ్లన్న విషయాన్ని ప్రత్యూష గుర్తు చేయటంతో అధికారులు కిందామీదా పడుతున్నట్లు తెలుస్తోంది.

ఈ విషయాన్ని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లాలని భావిస్తున్నట్లు సమాచారం. అంతకు ముందే.. లవ్ మ్యాటర్ మీద అధికారులు ఆమెకు ‘కౌన్సెలింగ్’ చేపట్టినట్లుగా చెబుతున్నారు. అయితే.. తన లవ్ మ్యాటర్ ను ప్రత్యూష తన న్యాయవాది ద్వారా కోర్టుకు తెలియజేసినట్లుగా చెబుతున్నారు. మరి.. దత్తకూతురి ఇష్టంపై ముఖ్యమంత్రి కేసీఆర్ ఎలా రియాక్ట్ అవుతారన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

ఇదిలా ఉంటే.. తండ్రి.. సవతి తల్లి చేతుల్లో చిత్రహింసలకు గురై.. ఆ తర్వాత ఆసుపత్రిలో చికిత్స పొంది.. హాస్టల్ లో ఉంటున్న ప్రత్యూషకు మానసిక వైద్యులతో కౌన్సెలింగ్ ప్రక్రియను నిర్వహించలేదని.. పరిసరాలు.. చుట్టూ ఉన్న వాతావరణం కారణంగా ఆమె ఇప్పుడు వాటిని నుంచి బయటపడాలని చూస్తున్నట్లుగా బాలల హక్కుల కమిషన్ సభ్యులు అచ్యుత రావు అభిప్రాయపడుతున్నారు. ఆమెకు నిపుణులైన మానసిక వైద్యులతో కౌన్సెలింగ్ అవసరమని అభిప్రాయపడుతున్నారు. ఇదే మాటను అధికారుల నోటి నుంచి వినపడటంతో ఈ ఉదంతం ఎలాంటి మలుపు తిరుగుతుందన్నది ఉత్కంఠగా మారింది.
Tags:    

Similar News