కేసీఆర్ నోట‌.. మ‌ళ్లీ ఉద్యోగాల మాట‌.. అందుకేనా?

Update: 2021-10-06 08:31 GMT
రాజ‌కీయ నాయకులు ఏదైనా ప్ర‌క‌టన చేశారంటే దాని వెన‌క క‌చ్చితంగా వాళ్ల‌కు లాభించే ఏదో ఓ ప్ర‌తిఫ‌లం ఉంటుంది. ముఖ్యంగా అధికార పార్టీ నేతలు ఏం చేసినా.. అది ప్ర‌జ‌ల‌ను ఆక‌ట్టుకుని ఓట్ల రూపంలో తిరిగి ప్ర‌తిఫ‌లం పొందేందుకే! అందుకే ఎన్నిక‌లు అనే మాట విన‌ప‌డ‌గానే.. రాజ‌కీయ నాయకులు హ‌మీల వ‌ర్షం కురిపిస్తూనే ఉంటారు. ఇక ఇప్పుడు తెలంగాణలో హుజూరాబాద్ ఉప ఎన్నిక‌తో రాజ‌కీయ వాతావ‌ర‌ణం వేడెక్కింది. ఈ ఎన్నిక‌లో ఎలాగైనా విజ‌యం సాధించాల‌ని సీఎం కేసీఆర్ ప‌ట్టుద‌ల‌తో ఉన్నారు. ఆ దిశ‌గా ప్ర‌జ‌ల ఓట్ల‌ను సొమ్ము చేసుకునేందుకు అవ‌స‌ర‌మైన అన్ని ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు.

తాజాగా శాస‌న‌స‌భ‌లో కేసీఆర్ మాటల వెన‌క ఈ ఉప ఎన్నిక అనే కాకుండా వ‌చ్చే అసెంబ్లీ ఎన్నిక‌ల్లోనూ ప్ర‌జ‌ల‌ను త‌న‌వైపుగా తిప్పుకోవాల‌నే వ్యూహం దాగి ఉంద‌ని రాజకీయ విశ్లేష‌కులు భావిస్తున్నారు. రాష్ట్రంలో ఎన్నిక‌లు వ‌చ్చిన ప్ర‌తిసారి ఉద్యోగాలు భ‌ర్తీ చేస్తాం.. త్వ‌ర‌లోనే నోటిఫికేష‌న్ విడుద‌ల చేస్తామ‌ని గ‌తంలో చాలా సార్లు చెప్పిన కేసీఆర్‌.. ఇప్పుడు మ‌రోసారి అదే పాట ఎత్తుకున్నారు. కానీ ఈ సారి భ‌ర్తీ చేసే ఉద్యోగాల సంఖ్య పెంచారు. గ‌తంలో 50 వేలు అన్న కేసీఆర్‌.. ఇటీవ‌ల ఆ సంఖ్య‌ను 60వేల‌కు పెంచారు. ఇక ఇప్పుడేమో వ‌చ్చే మూడు నెల‌ల్లో 80 వేల వ‌ర‌కు ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేష‌న్ విడుద‌ల చేస్తామంటూ పేర్కొన్నారు. దీంతో ఎన్నిక‌లు వ‌చ్చిన ప్ర‌తిసారి ఉద్యోగాల భ‌ర్తీ విష‌యాన్ని తెర‌పైకి తీసుకువ‌చ్చి నిరుద్యోగుల ఓట్ల‌ను సొమ్ము చేసుకోవ‌డం కోసం కేసీఆర్ ప్ర‌య‌త్నిస్తున్నారు.. ఎన్నిక‌లు ముగిసిన త‌ర్వాత వాటి ఊసే ఎత్త‌డం లేద‌నే విమ‌ర్శ‌లు తీవ్రంగా వినిపిస్తున్నాయి.

దుబ్బాక ఉప ఎన్నిక ఆ త‌ర్వాత జీహెచ్ఎంసీ ఎన్నిక‌లు నాగార్జున సాగ‌ర్ ఉప ఎన్నిక ఇక ఇప్పుడేమో హుజూరాబాద్ ఉప ఎన్నిక‌.. ఇలా ఎన్నిక‌లు ఎప్పుడు వ‌చ్చినా ఓట్ల కోసం కేసీఆర్ ఉద్యోగాల భ‌ర్తీ పేరుతో నిరుద్యోగుల‌ను మోసం చేస్తున్నార‌ని.. ఎన్నిక‌ల‌ప్పుడే ఆయ‌న‌కు ఉద్యోగాలు భ‌ర్తీ చేయాల‌నే అంశం గుర్తుకు వ‌స్తుంద‌ని ఆ త‌ర్వాత మ‌ళ్లీ మ‌ర్చిపోతార‌ని ప్ర‌జ‌లు తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు. త్వ‌ర‌లోనే 50 వేల ఉద్యోగాలు భ‌ర్తీ చేస్తామ‌ని గ‌త అసెంబ్లీ స‌మావేశాల‌ప్పుడు చెప్పిన కేసీఆర్‌.. ఆ మేర‌కు రాష్ట్ర ప్ర‌భుత్వ విభాగాల్లో ఉన్న ఖాళీల వివ‌రాలు తెలపాల‌ని అధికారుల‌ను ఆదేశించారు. వాళ్లు కిందా మీదా ప‌డి 60 వేల‌కు పైగా ఖాళీలు ఉన్నాయ‌ని తేల్చారు. అంతే ఇక ఆ సంగ‌తి గురించి ప‌ట్టించుకునే వారే క‌ర‌వ‌య్యారు. కొత్త జిల్లాల‌కు రాష్ట్రప‌తి ఆమోద ముద్ర వేశార‌ని ఇక కొత్త జోన‌ల్ విధానం ప్ర‌కారం ఉద్యోగాల భ‌ర్తీకి లైన్ క్లియ‌ర్ అయిందని చెప్పిన కేసీఆర్‌.. ఆ త‌ర్వాత ఆ విష‌యాన్ని పట్టించుకోవ‌డం లేదు.

ఇప్పుడేమో మ‌ళ్లీ అసెంబ్లీలో కేసీఆర్ ఉద్యోగాల భ‌ర్తీ విష‌యాన్ని ప్ర‌స్తావించ‌డం వెన‌క హుజూరాబాద్ ఉప ఎన్నిక‌లో దాగి ఉంద‌ని విశ్లేష‌కులు అభిప్రాయప‌డుతున్నారు. రాష్ట్రంలో నిరుద్యోగుల స‌మ‌స్య‌పై వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధినేత్రి ష‌ర్మిల మొద‌టి నుంచి పోరాటం చేస్తున్నారు. అంతే కాకుంగా హుజూరాబాద్‌లో వెయ్యి మంది నిరుద్యోగుల‌తో నామినేష‌న్ వేస్తామ‌ని ప్ర‌క‌టించారు. మ‌రోవైపు కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో నిరుద్యోగ జంగ్ సైర‌న్ పేరుతో పోరాటానికి తెర‌దీసింది. ఈ నేప‌థ్యంలో నిరుద్యోగుల హుజూరాబాద్‌లో త‌మ పార్టీ విజ‌యానికి అడ్డంకిగా మారే ప్ర‌మాదం ఉంద‌ని గ్రహించిన కేసీఆర్‌.. తాజాగా మ‌ళ్లీ ఉద్యోగాల నోటిషికేష‌న్ మాట తీసుకొచ్చి వాళ్ల‌ను త‌న వైపుగా తిప్పుకునేందుకు సిద్ధ‌మ‌యార‌నే అభిప్రాయాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. కానీ ఇప్ప‌టికే ఎన్నోసార్లు మాట త‌ప్పిన కేసీఆర్‌.. ఇప్పుడు చెప్పిన విష‌యాన్ని నమ్మే ప‌రిస్థితుల్లో ప్ర‌జ‌లు లేర‌ని విశ్లేష‌కులు అంటున్నారు.
Tags:    

Similar News